సోలార్ ప్లాంట్‌కు సన్నాహాలు
పరిగి: పరిగి మండలం కాళ్లాపూర్ శివారులో సోలార్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్‌జే పవర్ కంపెనీ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. ఆ కంపెనీ ప్రతినిధులు కాళ్లాపూర్ రెవెన్యూ పరిధిలోని 24వ సర్వే నంబర్‌లో ఈ ప్లాంటు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంటు నిర్మాణానికి అవసరమైన 45 ఎకరాల భూమిని సైతం ఇప్పటికే ఆ కంపెనీ కొనుగోలు చేసింది. సర్వే పనులు పూర్తి కావడంతో భూమి చదును పనులు కొనసాగుతున్నాయి.
పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్న భూమిలో రెండు మూడు చోట్ల విద్యుత్ వైర్లు ఉండడం పనులకు అడ్డంకిగా మారింది. విద్యుత్ స్తంభాలను ఆ స్థలం నుంచి తీసేస్తే నాలుగు నెలల్లో పవర్ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పరిగికి చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు తమకు పర్సెంటేజీలు ఇవ్వాలని కంపెనీపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
రూ.30 కోట్ల వ్యయంతో 45 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా 5.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ తయారైన విద్యుత్తును నేరుగా ప్రభుత్వానికి విక్రయించనున్నారు. ఇందుకోసం ముందుగానే ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేయించుకుని పవర్ ప్రాజెక్టు పను లు ప్రారంభిస్తున్నారు. ఉత్పత్తి అయిన ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.6.49 లెక్కన ప్రభుత్వానికి విక్రయించనున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌ను 33 కేవీ విద్యుత్ లైన్ ద్వారా పరిగి సమీపంలో ఉన్న 133 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సరఫరా చేయనున్నారు. అక్కడినుంచి మిగతా ప్రాంతాలకు సరఫరా అవుతుంది.
ఇక పరిగికి నిరంతర విద్యుత్
కాళ్లాపూర్ సమీపంలోని లొంక హనుమాన్ దేవాలయం వెనుక నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తై పరిగి ప్రజల కరెంటు కష్టాలు తీరనున్నాయి. పవర్ ప్రాజెక్టులో తయారైన విద్యుత్‌ను నిల్వ చేయడం వీలుకాదు. దీంతో తయారయ్యే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు విద్యుత్ ఫీడర్లతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఉత్పత్తి అయిన కరెంట్‌ను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసే క్రమంలో అనివార్యంగా పరిగిలో నిరంతర విద్యుత్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.