మేం మేం చేశాం నేరం | Special Story On Orphans child | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల క్షణికావేశం.. పసిపిల్లలకు శాపం

Published Thu, Jul 4 2019 1:29 PM | Last Updated on Thu, Jul 4 2019 1:29 PM

Special Story On Orphans child - Sakshi

సాక్షి, సిద్దిపేట : ‘ శ్రావణ్‌ది తొగుట మండలం జప్తి లింగారెడ్డిపల్లి గ్రామం. ప్రస్తుతం మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఐదేళ్ల క్రితం శ్రావణ్‌ తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీశైలం ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయం చేద్దామని అందినకాడికి అప్పులు చేసి బోరు బావులు తవ్వించారు. బోరు బావుల్లో చుక్క నీరు పడక పోవడంతో వ్యవసాయం సన్నగిల్లింది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో 2014లో శ్రావణ్‌ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో తల్లిదండ్రుల సంరక్షణలో పెరగాల్సిన శ్రావణ్‌ అనాథగా మారాడు. చేరదీయడానికి బంధువులు ఎవరూ  ముందుకు రాకపోవడంతో శ్రావణ్‌ సంరక్షణ భారం నానమ్మ సత్తవ్వ భుజస్కంధాలపై పడింది. సత్తవ్వకు వచ్చే ఆసరా పింఛన్‌తో శ్రావణ్‌ను పోషించుకుంటోంది. ఆసరా పింఛన్‌ డబ్బులు సత్తవ్వ మందులకే సరిపోవడంతో శ్రావణ్‌ చదువులకు ఆటంకం ఏర్పడింది. దీంతో గ్రామంలోని కొందరు యువకుల సహకారంతో మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించి చదివిస్తుంది.’

‘నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జాల మల్లేశం బతుకుదెరువు నిమిత్తం సౌదీ వెళ్లి గత ఏడాది అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడ సరిగా వేతనం లభించకపోవడం, స్వగ్రామంలో అప్పులబాధ వెరసి అతడు సౌదీలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు 14 ఏళ్లలోపు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక వైపు భర్త దేశంకాని దేశంలో ఆత్మహత్య చేసుకోగా.. ముగ్గురు పిల్లలతో లక్ష్మి బతుకు బండిని ఈడుస్తూ క్షణమొక యుగంగా గడుపుతోంది. ఏ పాపం ఎరుగని పిల్లలు తండ్రిప్రేమకు దూరమయ్యారని, కన్నీరు మున్నీరు అవుతుంది.’ 

ఇలా లక్ష్మి, శ్రావణ్, మరో చోట పల్లవి, కల్యాణ్‌ వంటి పసిపిల్లలు ఏపాపం ఎరుగకుండానే అనాథలుగా జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు చేసిన తప్పుతో సాటి పిల్లలు అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటే వీరు మాత్రం అమ్మానాన్నలను కోల్పోయి ముసలి తాత, అమ్మలకు భారంగా ఉన్నారు. కుటుంబ కలహాలు, అనుమానాలు, వరకట్నం, అత్యాచారాలు, ఆఘాయిత్యాలతో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే మరికొందరిని పురిటిలోనే చెత్తకుప్పల పాలు చేసిన అమ్మలు ఉండటం గమనార్హం. అయితే వీరిలో కొందరిని అమ్మానాన్నలు, బంధువులు చేరదీయగా, మరికొందరు వీధిబాలలుగా, నేరస్తులుగా, దోపిడి దొంగలుగా మారుతున్నవారు ఉన్నారు. సమాజంపై కసిని పెంచుకొని రాక్షసులుగా మారినవారు కూడా లేకపోలేదు. 

16 నెలల్లో 687 స్త్రీ, పురుషుల ఆత్మహత్యలు..
గడిచిన 16 నెలల్లోనే ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 687 మంది స్త్రీ, పురుషులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. వీరిలో తల్లిదండ్రులు, తమ పిల్లలకు కూడా విషమిచ్చి వారు విషం తీసుకొని మరణించిన వారు ఉండగా.. మరికొందరు తాము చనిపోయి పిల్లలను అనా«థలుగా చేసిన వారు ఉన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మొత్తం 729 మంది ఆత్మహత్య చేసుకోగా వారిలో 522 మంది పురుషులు ఉన్నారు. వీరిలో దుబాయ్, మస్కట్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడే ఆత్మహత్యలు చేసుకున్నవారు ఉన్నారు. అదే విధంగా కరువు జిల్లా కావడంతో కాలం కలిసి రాక వ్యవసాయంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వారు ఉన్నారు.

మరికొందరు చిన్న చిన్న సంఘటనలకు మనోవేదనకు గురై నిండుప్రాణం నిలువునా తీసుకున్నవారు లేకపోలేదు. అదేవిధంగా 165 మంది మహిళలు ఉన్నారు. వీరు కూడా భార్య భర్తల మద్య మనస్పర్థలు, అత్తా మామలు, ఇతర గొడవలు, వరకట్నం వేదింపులకు తాళలేక ఒక చోట ఫ్యాన్‌కు ఉరివేసుకొని, మరొక చోట క్రిమిసంహారక మందు తాగి, ఇంకొక చోట కిరోసిన్, పెట్రోల్‌తో తగుల బెట్టుకొని మరణించిన వారు ఉన్నారు. అయితే ఈ 687 మందిలో దాదాపుగా 90 శాతం మంది వివాహితులు కావడం, వారికి చిన్న చిన్న పిల్లలు ఉండటం గమనార్హం. తనువు చాలించే సమయంలో పసికూనల భవిష్యత్‌ ఆలోచించి ఉంటే వారు బతికుండేవారని, అనేవారు కొందరైతే ఏ పాపం ఎరుగని పసిపిల్లల బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసి వెళ్లిపోయారని అనేవారు కొందరు ఉన్నారు. ఎవ్వరేమన్నా.. అనా«థలుగా మారిన బాల్యం మాత్రం అనునిత్యం మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. 

బాల్యానికి భరోసా ఏదీ?
పిల్లలను వేధించడం నేరం అని తల్లిదండ్రులకు కూడా శిక్షలు వేసే దేశాలు ఉన్నాయి. బాల్యం విలువైనది, వారి హక్కులను హరించే అధికారం ఎవరికి లేదని మన దేశంలో కూడా ఎన్నో హక్కులు వచ్చినా.. తల్లిదండ్రుల క్షణికావేశం, ఇతర కారణాలతో పిల్లలను వదిలేయడం, బాల్య వివాహాలు చేసి వారి భవితను అంధకారం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు బాలుర రక్షణ, సంరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ ముస్కాన్, ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా మాతా, శిశుసంక్షరణ, పోలీస్‌ శాఖ ఉమ్మడి మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 1651 మందిని గుర్తించారు. ఎవరూ లేక భిక్షాటన చేసేవారు,  అనాధలు, బడిమానేసిన వారు, బాలకార్మికులుగా జీవనం సాగించేవారు ఉండటం గమనార్హం.

కౌన్సెలింగ్‌ అవసరం.. 
ఆత్మహత్యలు క్షణికావేశంలో చేసే పని. మానసికంగా బలహీనంగా ఉన్నవారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతారు. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు జీవితాంతం వేదన చెందాల్సి ఉంటుంది. మానసికంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం. చిన్న చిన్న విషయాల్లో భయాందోళన చెందిన వారిని గుర్తించాలి. వారి కుటుంబ సభ్యులు వెంటనే మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. చిన్నతనం నుంచే సమాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాలి. 
– డాక్టర్‌ అనూష, మానసిక వైద్యురాలు, సిద్దిపేట

రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలు   

జిల్లా   బాలురు బాలికలు మొత్తం
సిద్దిపేట 333 85 468
సంగారెడ్డి 206 411 617
మెదక్‌  258 358 566
మొత్తం 797 854 1651

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement