కోరుట్ల: నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీల నిర్వహణ బాధ్యతలను రైతులకే అప్పగించాలని సర్కార్ యోచిస్తున్న క్రమంలో చెరకు రైతులు ఊగిసలాడుతున్నారు. కో-ఆపరేటివ్ సోసైటీల అధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడపడం ఎంతవరకు సాధ్యమన్న అంశంపై రైతుల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వపరం చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్.. అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేకపోవడంతో రైతు భాగస్వామ్యం ప్రతిపాదనను తెరపైకి తెచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై అవగాహన లేని ఆయా ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు ఎటూ నిర్ణయించుకోలేక అయోమయానికి గురవుతున్నారు.
అవగాహనకు స్టడీ టూర్!
రైతు భాగస్వామ్యంతో మహారాష్ట్రలోని బారామతి, సతారా జిల్లాల్లో కొనసాగుతున్న చక్కెర ఫ్యాక్టరీల తీరుతెన్నులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ అధ్వర్యంలో పదిహేనురోజుల క్రితం రైతులకు స్టడీ టూర్ నిర్వహించారు. మూడురోజుల పాటు సాగిన ఈ స్టడీ టూర్‌లో మెదక్, బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగు చేస్తున్న 160 మంది రైతులు పాల్గొన్నారు. వీరితో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బాజిరెడ్డి గోవర్దన్‌తో పాటు ఆయా ప్రాంతాల ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు టూర్‌లో పాల్గొన్నారు. ఈ టూర్‌లో రైతు భాగస్వామ్యంతో నడుస్తున్న బారామతి , సతారా జిల్లాలోని కిసాన్‌వీర్ నగర్ చక్కెర కర్మాగారాలను సందర్శించారు. షుగర్‌కేన్ అధికారులు రైతు భాగస్వామ్యంతో చేకూరే ప్రయోజనాలను రైతులకు తెలియజేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.
మిశ్రమ స్పందన
కో-ఆపరేటివ్ పద్ధతిలో భాగస్వామ్యానికి రైతుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. మహారాష్ట్రలో చక్కెర ఫ్యాక్టరీల్లో ఉన్న పరిస్థితులు స్థానికంగా లేకపోవడంతో రైతు భాగస్వామ్యంలో ఫ్యాక్టరీల నిర్వహణపై కొందరు విముఖత వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో ఫ్యాక్టరీ నిర్వహణకు ఏటా సుమారు రూ.40-60 కోట్లకు మించి వ్యయం చేయాల్సి ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో రైతులు ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడుల ద్వారా ఈ డబ్బు సమకూర్చుకునే అవకాశముంది. మెదక్, ముత్యంపేట, బోధన్ చక్కెర కర్మాగారాల పరిధిలో చెరకు పండిం చే రైతుల సంఖ్య అంత ఎక్కువ స్థాయిలో లేకపోవడంతో పెట్టుబడులకు ఇబ్బందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కో-ఆపరేటివ్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పా టు చేస్తే డబ్బులు సమకూర్చుకోవడం పెద్ద సమస్య కాదని కొందరు రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలను ప్రభుత్వం తీసుకుని నష్టాల నుంచి లాభాల బాటలోకి వచ్చాక రైతుల పరం చేస్తే బాగుంటుందని మరికొందరు చెరకు రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.
చెరకు రైతుల ఊగిసలాట
Published Wed, Feb 4 2015 4:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement