వీడని ఉత్కంఠ! | Suspense sin! | Sakshi
Sakshi News home page

వీడని ఉత్కంఠ!

Published Wed, Sep 24 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

Suspense sin!

హుజూరాబాద్ : హుజూరాబాద్‌లో క్లినిక్ నిర్వహిస్తున్న పిల్లల వైద్యుడు సురేందర్‌రెడ్డి కిడ్నాప్.. విడుదల ఉదంతంలో ఉత్కంఠ వీడడం లేదు. సోమవారం కొందరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం వరకు హుజూరాబాద్ పోలీసులే ఈ కేసును విచారణ జరుపుతుండగా ప్రస్తుతం వరంగల్ జిల్లా పోలీసులు కూడా విచారణలో పాలుపంచుకున్నట్లు సమాచారం. డాక్టర్ సురేందర్‌రెడ్డి 15 రోజుల క్రితం హన్మకొండ వెళ్తుండగా దుండగులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు బందీగా ఉంచుకుని హింసించి, రూ.32 లక్షలు డిమాండ్ చేసి రూ.16 లక్షలు తీసుకుని వదిలేశారు. కిడ్నాప్ వెనక కుట్రను ఛేదించేందుకు రెండు జిల్లాల పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. తొలుత అక్రమంగా సిమ్‌కార్డులు విక్రయిస్తున్న ఒకరిని సోమవారం రాత్రి హుజూరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కిడ్నాపర్లు ఉపయోగించినట్లు భావిస్తున్న ఫోన్‌నంబర్ సిమ్‌కార్డులను నెట్‌వర్క్ కంపెనీ ద్వారా వాటిని విక్రయించిన వారి చిరునామాను కనుగొన్నారు. హుజూరాబాద్‌లో ఈ సిమ్‌కార్డు తీసుకున్నట్లు తెలిసింది. గుర్తింపు కార్డులు లేకుండానే సిమ్‌కార్డు విక్రయించినట్లు తెలియడంతో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.
 పోలీసుల అదుపులో కీలక వ్యక్తి?
 హుజూరాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు భావిస్తున్న ఆరుగురిలో ఒకరిని మాత్రమే కస్టడీలో ఉంచుకొని మిగతావారిని వదిలేసినట్లు తెలిసింది. ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన ఇద్దరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ కిడ్నాప్ సంఘటనకు సూత్రధారి అయిన కీలకమైన వ్యక్తిని వరంగల్ పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. ఆ వ్యక్తి ఎవరో అనే విషయంపై ఇంకా స్పష్టత రావడం లేదు. కిడ్నాప్‌లో పాల్గొన్న నలుగురు వ్యక్తులు, ఇన్నోవా డ్రైవర్, దీనంతటికీ కారణమై ఎప్పటికప్పుడు ఫోన్‌లో కిడ్నాప్ వ్యూహానికి సలహాలిచ్చిన అసలు నిందితుడు ఎవరనే విషయంలో పోలీసులు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement