తుమాటి భద్రారెడ్డి: రైతు ఉద్యమాల వేదికగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శాసనసభ ఎన్నికలకు సకల అస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఈ ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 శాసనసభ స్థానాలు ఉండగా 2014లో బీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. 2018లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన 8 సీట్లు గెలిచింది. అయితే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పసుపు బోర్డు హామీతో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ రైతుల ఆసరాతో అనూహ్యంగా కేసీఆర్ కుమార్తె కవితపై విజయం సాధించారు.
ఇక ఇప్పుడు నిజాం షుగర్స్ అంశం ప్రధాన ఎజెండాగా రైతుల ఓట్లు మరోసారి కొల్లగొట్టే లక్ష్యంతో బీజేపీ ప్రణాళిక రూపొందించుకుంటోంది. కాంగ్రెస్ సైతం నిజాం షుగర్స్, మంచిప్ప రిజర్వాయర్ ముంపు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, ఆరు హామీలతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. అలాగే దళితబంధులో కమీషన్ల వసూళ్లు, డబుల్ ఇళ్ల నిర్మాణంలో విఫలం, కామారెడ్డి జిల్లాలో సాగునీటి సమస్య తదితరాలపైనా ప్రచారం చేస్తోంది.
ఇక సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, పైగా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతుండడంతో ఆ ప్రభావం చుట్టుపక్కల నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని బీఆర్‌ఎస్ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ప్రస్తుతానికి మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ప్రకటన తర్వాత సమీకరణాలు మారనున్నాయి. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
బాల్కొండ బరిలో ముక్కోణపు పోటీ
వరుసగా రెండుసార్లు గెలుపొందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందని ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డికి టికెట్ వచ్చింది. ఈయనకు గత ఎన్నికల్లో బీఎస్పీ తరపున 42వేల ఓట్లు దక్కడం గమనార్హం. ఇక బీజేపీ తరపున ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బదులు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మను బరిలోకి దించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో త్రిముఖ పోటీ తప్పని పరిస్థితి.
బోధన్ బాస్ ఎవరో?..
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి గెలిచేందుకు బీఆర్‌ఎస్ అభ్యర్థి షకీల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ టికెట్ ఆశిస్తున్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, వడ్డి మోహన్‌రెడ్డి ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డికే టికెట్ ఇచ్చారు. షకీల్‌ను ఓడించాలనే లక్ష్యంతో శరత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడం గమనార్హం.
ఆర్మూర్ ఆషామాషీ కాదు
ఇప్పటికే రెండుసార్లు గెలవడంతో ఈసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందని బీఆర్‌ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. అయితే జీవన్‌రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్‌ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో గడ్డు పరిస్థితి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి పొద్దు టూరి వినయ్‌రెడ్డికి టికెట్ ఖరారు అయ్యింది. బీజేపీ నుంచి పైడి రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నట్లు చెబుతున్నప్పటికీ పార్టీ ఆదేశిస్తే చివరి నిమిషంలో ఎంపీ అర్వింద్ బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అర్వింద్ బరిలో ఉంటే గెలుపు సులువని పార్టీ శ్రేణులు, వివిధ వర్గాలు భావిస్తున్నాయి.
నిజామాబాద్‌లో నిలిచేది ఎవరు?
ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బిగాల గణేశ్‌గుప్తా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. బీజేపీ నుంచి ధన్‌పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి పోటీ రసవత్తరంగా మారనున్నట్లు తెలుస్తోంది.
కామారెడ్డిలో కింగ్‌కి పోటీ ఇచ్చేనా?
బీఆర్‌ఎస్ నుంచి సీఎం కేసీఆర్ బరిలోకి దిగుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి షబ్బీర్‌అలీ, బీజేపీ నుంచి∙వెంకటరమణారెడ్డి పోటీలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. షబ్బీర్‌అలీ గతంలో తాను చేసిన అభివృద్ధి గురించి చెబుతున్నారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్, అక్రమ వెంచర్లు, ధరణి అక్రమాలు, పావలా వడ్డీ బకాయిల ఉద్యమాల్లో పాల్గొన్న వెంకటరమణారెడ్డి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.
నిజామాబాద్ రూరల్‌లో సీన్ మారుతుందా?
వరుసగా మూడోసారి, మొత్తంగా ఐదోసారి గెలిచి కేబినెట్‌లో స్థానం సంపాదించేందుకు బాజిరెడ్డి గోవర్దన్ లెక్కలు వేసుకుంటున్నారు. బీజేపీ నుంచి కులాచారి దినేష్కు టికెట్ దక్కనుందనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేష్రెడ్డి టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిప్ప జలాశయం ముంపు అంశం, ధరణి, పోడు భూముల అంశాలు కాంగ్రెస్ ప్రధాన ప్రచార అ్రస్తాలుగా వాడుతోంది.
బాన్సువాడ బరిలో గెలుపెవరిది?
రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టించిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గెలుపుపై ధీమాగా ఉన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయనే నమ్మకంతో బరిలో మరోమారు దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్ నిలబడితే గెలుపు అవకాశాలుంటాయనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి మాల్యాద్రిరెడ్డి టికెట్ రేసులో ఉన్నారు.
ఎల్లారెడ్డి.. ఏలేదెవరో?
గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన జాజాల సురేందర్ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. కేసీఆర్ పక్క నియోజకవర్గంలో పోటీ చేస్తుండడంతో గెలుపుపై ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మదన్‌మోహన్, సుభాష్ రెడ్డి మధ్య టికెట్ పోటీ ఉంది. ఇక్కడ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోటీ నడుస్తోంది.
జుక్కల్ ఎవరిపరం?
సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మూడోసారి గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అరుణతార, బుచ్చన్న టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ మధ్య పోటీ నెలకొనగా మరో ఎన్‌ఆర్‌ఐకి టికెట్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment