లోటు వర్షపాతంతో అడుగంటిన నీటి వనరులు
రాష్ట్రంలో 10.97 మీటర్ల లోతుకు చేరిన వైనం
ఇప్పుడే నిండు వేసవి పరిస్థితి.. అతి వినియోగంతో ముప్పు
క్రాప్‌హాలిడేను తలపిస్తున్న రబీ.. తాగునీటికి కటకట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత అడుగంటాయి. ఐదేళ్లతో పోల్చితే ఈ ఏడాది పాతాళంలోకి పడిపోయాయి. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, వర్షాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఖరీఫ్‌లో 30 శాతం, రబీలో 61 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో గతేడాది జనవరిలో 7.80 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది జనవరిలో ఏకంగా 10.97 మీటర్ల లోతుకి చేరుకున్నాయి. ఏకంగా 3.21 మీటర్లమేర జలాలు అడుగంటిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే నిండు వేసవిలో పరిస్థితి ఏంటన్నది ఆందోళన కలిగిస్తోంది.
వచ్చే మేలో భూగర్భ జలాలు దాదాపు 12 మీటర్లకు పడిపోవచ్చునని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌లో కొద్దిపాటి వర్షం పడటంతో అవి భూములోకి ఇంకలేదు. చెరువులు, కుంటలు కూడా ఎండిపోవడంతో గ్రామాల్లోనూ కరువు పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పంటలసాగు ముఖ్యంగా వరి వంటి పంట పొలాల్లో నీటిని ఎక్కువగా నిల్వ ఉంచడం వల్ల కూడా భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ అసలు నీటి వనరులే లేకపోవడంతో ఈసారి పంటల సాగు కూడా తగ్గిపోయింది. రబీసాగు అధ్వాన్నంగా తయారైంది. క్రాప్ హాలీడేను తలపిస్తోంది. రబీలో 13.09 లక్షల హెక్టార్లలో పంటల సాగు జరగాల్సి ఉండగా.. ఈసారి 8.94 లక్షల హెక్టార్లలోనే సాగు జరిగింది. 15 ఏళ్లుగా భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితే నెలకొంది. 1998 నుంచి బోరు బావుల సంఖ్య పెరగడమూ ఇందుకు కారణమైంది.
ప్రమాదకర స్థితిలో వినియోగం
భూగర్భ జలాలను ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. రాష్ట్రంలో 15 లక్షల బోర్లు ఉన్నట్లు అంచనా. ఏటా ఇంకా పెరుగుతున్నాయి. భూగర్భంలోని జలాలను 45 శాతానికి మించి వినియోగించకూడదు. కానీ ప్రస్తుతం ఈ వినియోగం 58 శాతంగా ఉంది. రాష్ట్రంలో 1057 గ్రామాలు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తున్నట్లు రికార్డుల్లో నమోదైంది. దీంతో ఆ గ్రామాల్లో బోర్లు వేయడాన్ని, బావులు తవ్వడాన్ని నిషేధించాలని జలవనరుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. చలికాలంలోనే రాష్ట్రంలో తాగునీటికి కటకట ఏర్పడింది. దీంతో వచ్చే వేసవి ప్రజలకు చుక్కలు చూపిస్తుందని అధికారులు అంటున్నారు. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ డెరైక్టర్ జి.సాంబయ్య తెలిపారు.
ఆవిరైన భూగర్భజలాలు
Published Fri, Feb 13 2015 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM
Advertisement
Advertisement