బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు | Telangana government Struggled to Basara triple IT management | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు

Published Thu, Dec 25 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM

బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు

బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణపై సర్కార్ మల్లగుల్లాలు

స్వయం ప్రతిపత్తి కొనసాగించే అవకాశం?
 సాక్షి, హైదరాబాద్: బాసరలోని ట్రిపుల్ ఐటీ నిర్వహణను హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ తరహాలో చేపట్టే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాసర, నూజివీడు, ఇడుపులపాయలోని ఏపీ ట్రిపుల్ ఐటీలను నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక విశ్వ విద్యాలయం (ఆర్‌జీయూకేటీ) విభజనపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. బాసర ట్రిపుల్‌ఐటీ తెలంగాణ పరిధిలోకి రాగా, ఇడుపులపాయ, నూజివీడు ట్రిపుల్ ఐటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోకి వెళ్లాయి. ప్రస్తుతానికి బాసర ట్రిపుల్ ఐటీ నిర్వహణకోసం ఆర్‌జీయూకేటీ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి వర్తింపచేసుకునే చర్యలపై దృష్టిపెట్టినా, ఒక్క విద్యా సంస్థ కోసం యూనివర్సిటీ, దానికో ప్రత్యేకవ్యవస్థ అవసరమా? అనే భావన ప్రభుత్వవర్గాల్లో నెలకొంది. అయితే ట్రిపుల్‌ఐటీలో ఆరేళ్ల సమీకృత బీటెక్ డిగ్రీని  ఆర్‌జీయూకేటీ నిర్వహిస్తున్నందున, దానిని హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం లేదు. పైగా ఇందులో ప్రవేశాల తీరు వేరు.
 
 జేఎన్‌టీయూలో ప్రవేశాల విధానం వేరు. గ్రామప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను అందించే లక్ష్యంతో, వారికే సీట్లను కేటాయించేలా ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థలో పదోతరగతిలో మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా, జేఎన్‌టీయూ పరిధిలో ఎంసెట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో, స్వయంప్రతిపత్తితో హైదరాబాద్ ట్రిపుల్‌ఐటీ కొనసాగుతోంది. ఇదే తరహాలో బాసర ట్రిపుల్ ఐటీని కూడా రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ పరిధిలో స్వయంప్రతిపత్తితో కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్ ఐఐఐటీ నిర్వహణ విధానాన్ని పరిశీలించాలని భావిస్తోంది. ఒకవేళ ఆర్‌జీయూకేటీని యథాతథంగా కొనసాగించాల్సి వస్తే, ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ రాజిరెడ్డిని చాన్స్‌లర్‌గా కాకుండా,  రాష్ట్ర గవర్నర్‌ను చాన్స్‌లర్‌గా కొనసాగించాలనే యోచన ఉంది. ఏది చేయాలన్నా చట్టాన్ని సవరించాల్సి ఉంది.

Advertisement
Advertisement