
వైద్య విద్యార్థినికి పట్టా అందజేస్తున్న రాష్ట్రపతి కోవింద్
సాక్షి, బెంగళూరు: దేశంలో కరోనా మహమ్మారిని చూసిన తర్వాత గుణపాఠాలు నేర్చుకుని ప్రజా ఆరోగ్యానికి అన్ని ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ఆదివారం బెంగళూరులోని నిమ్హాన్స్‌లో జరిగిన రాజీవ్‌గాంధీ ఆరోగ్య యూనివర్సిటీ 23వ వార్షిక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎంబీబీఎస్, పీజీ పట్టభద్రులకు పట్టాలను, బంగారు పతకాలను అందజేసి ప్రసంగించారు. ఆరోగ్యం, విద్యా రంగాలు అత్యంత ప్రధాన రంగాలని పేర్కొన్నారు.
శాస్త్రవేత్తల విజయం ..
భవిష్యత్తులో కరోనా వంటి అంటురోగాలు విస్తరించకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆరోగ్య రంగం మరింత బలోపతం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ యోజన ద్వారా మన శాస్త్రవేత్తలు కరోనాకు టీకాను కనిపెట్టారని, దీనివల్ల మనదేశంలో లక్షలాది మందికి వ్యాక్సిన్ అందించడం సాధ్యమైందని చెప్పారు. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాలకు సైతం కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసిన ఘనత మనదేశానికి దక్కుతుందని చెప్పారు. ఇది మన శాస్త్రవేత్తల విజయమని కొనియాడారు. కోవిడ్ సమయంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ జీవితాలను పణంగా పెట్టి పని చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment