రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండోస్థానం
అల్గునూర్(మానకొండూర్): రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సాగునీరందక తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో ఎండిన వరి పంటలను సోమవారం ఆయన పరిశీలించారు. తలాపునే మానేరు ప్రాజెక్టు ఉన్నా.. ఇసుక అక్రమ తవ్వాకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక దందాను నిరోధించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని ఆరోపించారు. చేతికొచ్చిన పంట ఎండిపోతుండడంతో అన్నదాత బతుకు చితికిపోతుందని ఆవేదన చెందారు.
మండల పరిధిలో 20 వేల ఎకరాలకు సాగునీరందించాలన్నారు. కానీ సగం పంటలకు కూడా నీరందే పరిస్థితి లేదన్నారు. దీంతో పెట్టుబడి కూడా రాక అన్నదాతలు అప్పుల పాలవుతున్నారని చెప్పారు. ఎండిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మిర్చి, కంది పంటలకు కూడా మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలవకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి పొనుగంటి కేదారి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మారుపాక అనిల్, తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, నాయకులు మల్లేశం, భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, సమ్మయ్య, నరేశ్, రాజనర్సు, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.