వేట మొదలైంది...! | Telangana MPTC And ZPTC Elections | Sakshi
Sakshi News home page

వేట మొదలైంది...!

Published Tue, Apr 16 2019 9:46 AM | Last Updated on Tue, Apr 16 2019 9:46 AM

Telangana MPTC And ZPTC Elections - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం గల మండలం అది. మహిళా జనరల్‌గా రిజర్వు అయిన ఈ స్థానం నుంచి జెడ్‌పీటీసీగా తమ సతీమణులను టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయించేందుకు ఓ బీసీ నాయకుడు, ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ప్రయత్నిస్తున్నారు. వీరికి తోడు ఇటీవల ఇతర పార్టీలకు చెందిన ఒకరిద్దరు మండల స్థాయి కీలక నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి టికెట్టు ఇప్పించాలో అర్థం గాని పరిస్థితి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిది. దీంతో ఆయన ‘గెలుపు గుర్రం’ ఎవరనే విషయంలో ముగ్గురి గురించి తానే ప్రత్యేకంగా సర్వే చేయిస్తున్నారు’.

ఇది ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినదే కాదు. జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా పరిషత్‌లకు కేంద్రం నుంచి వచ్చే నిధులు లేక, తమ విధులు, విధానాలు ఏమిటో తెలియక.. ఏ పనులు కాక గత ఐదేళ్లుగా జెడ్‌పీ చైర్‌పర్సన్‌తోపాటు జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజకీయ ఎదుగుదలకు కీలకమెట్టుగా భావించే జెడ్‌పీటీసీ ప్రొటోకాల్‌లో ఎమ్మెల్యే తరువాత స్థానంలో ఉండడం, అదృష్టం కలిసొస్తే జెడ్‌పీ చెర్‌పర్సన్‌ అయితే రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వస్తుందనే ఆలోచనతో మండల నాయకులు అడుగులు వేస్తున్నారు.

ఈ మేరకు ఎమ్మెల్యేల కళ్లల్లో పడి జెడ్‌పీటీసీ టికెట్టు దక్కించుకునేందుకు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు  ప్రతిపాదించే పేర్లకే స్థానిక మంత్రుల నేతృత్వంలోని కమిటీలు ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో షెడ్యూల్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల నుంచి టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు టికెట్ల వేటలో పడిపోయారు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ అభ్యర్థిగా సోమవారం హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

అందరిదీ టీఆరెస్సేనాయే..!
2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చే నాటికే ఉమ్మడి కరీంనగర్‌లో ఆ పార్టీలో మండలాల వారీగా నాయకులకు కొదవ లేదు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయా నియోజకవర్గాల్లో ఉన్న మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇతర పార్టీల నుంచి జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలుగా గెలిచిన వారు కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఎమ్మెల్యేలకు సన్నిహితంగా మెలుగుతూ భవిష్యత్తు జెడ్‌పీటీసీ, ఎంపీపీలపై దృష్టి కేంద్రీకరించారు.

‘జెడ్‌పీటీసీ అయితే ఏముందన్నా,.. ఫండ్స్‌ లేవు, పరపతి లేదు’ అని బహిరంగంగా చెబుతూనే ఎలాగైనా ఆ పదవిని దక్కించుకునే ఆలోచనతో నాయకులు తమ ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో కీలక పదవులు అనుభవించిన వారు సైతం టీఆర్‌ఎస్‌లో చేరి, తమకు కూడా అవకాశం దక్కకపోతుందా అని పైరవీల్లో మునిగిపోయారు. పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న వారికి కొత్తగా 2014 తరువాత టీఆర్‌ఎస్‌లో చేరిన వారే ప్రధాన పోటీదారులుగా తయారయ్యారు. పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలన్నింటిలో అదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ‘టీఆర్‌ఎస్‌లోని ఇద్దరు ముగ్గురు ఆశావహుల్లో గెలిచేవారు ఎవరు? ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్‌ లేదా బీజేపీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉంటే టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరికి సీటివ్వాలి’ అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు అనుకూలమైన వ్యక్తులు, ఏ పక్షానికి చెందని వారితో సర్వేలు చేయిస్తున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలే ఫైనల్‌
ఉమ్మడి కరీంనగర్‌లోని సిరిసిల్ల నియోజకవర్గంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎవరిని జెడ్‌పీటీసీ చేయాలన్నా, ఎంపీపీలు అయ్యేందుకు ఎంపీటీసీ టికెట్టు ఇవ్వాలన్నా కేటీఆరే కావడంతో నాయకులంతా దేవుడి మీద భారం వేశారు. కేటీఆర్‌ పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూసుకొనే ఒకరిద్దరు నాయకుల కనుసన్నల్లో పడేందుకు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఆయన నిర్ణయమే ఫైనల్‌.

ధర్మపురిలో సైతం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరిస్థితి అదే. మంత్రులు తమ నియోజకవర్గాలతోపాటు తాము లోక్‌సభ ఇన్‌చార్జిలుగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం జెడ్‌పీటీసీ అభ్యర్థుల ఎంపికలో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు సూచించిన పేర్లకు మార్పులు చేయాలన్నా, గెలిచే అభ్యర్థిగా ఎవరినైనా తెరపైకి తేవాలన్నా మంత్రులు సూచించిన వారికి అధిష్టానం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జెడ్‌పీటీసీలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు మంత్రులే ఫైనల్‌ కాబోతున్నారు.
 
నాలుగు జెడ్‌పీ పీఠాలే లక్ష్యం
ఉమ్మడి జిల్లాలో 58 జెడ్‌పీటీసీలు ఉండగా, వీరంతా నలుగురు జెడ్‌పీ చైర్‌పర్సన్‌లను ఎన్నుకోవలసి ఉంటుంది. జగిత్యాలలోనే ఎక్కువగా 18 మంది జెడ్‌పీటీసీలను ఎన్నుకోనున్నారు. 10 మంది జెడ్‌పీటీసీలు ఎవరిని ఎన్నుకొంటే వారే జెడ్‌పీ చైర్‌పర్సన్‌. సిరిసిల్లలో 12 జెడ్‌పీటీసీలకు ఎన్నికలు జరుగుతుండగా, ఇక్కడ ఏడుగురు సభ్యుల మద్ధతున్నవారు జెడ్‌పీ పీఠంపై కూర్చోవచ్చు. పెద్దపల్లిలో 13కు 7గురి మద్ధతు అవసరం కాగా, కరీంనగర్‌లో 15 జెడ్‌పీటీసీలకు 8 మంది సభ్యులు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఓటు హక్కు ఉన్న నేపథ్యంలో ఉన్న నాలుగు జిల్లా పరిషత్‌లకు నాలుగింటిని గెలుచుకునే అవకాశం టీఆర్‌ఎస్‌కే ఉంది. ఈ నేపథ్యంలో పోటీ పెరిగింది. కాగా పెద్దపల్లి జెడ్‌పీ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పుట్ట మధు పేరును ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే మిగతా మూడు జిల్లాలకు కూడా చైర్మన్‌లను ముందే నిర్ణయించే అవకాశం ఉంది. కాగా సోమవారం హైదరాబాద్‌లో జిల్లా పరిషత్‌ ఎన్నికలపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు, మంత్రులను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు రాజధానికి వెళ్లి పైరవీల్లో మునిగిపోయారు.

అనుకున్నట్టుగా అవకాశం!
 మంథని: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముందు నుంచి ఊహించిట్టుగా టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సముచిత స్థానం కల్పించారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌ ఒక్క మంథని మాత్రం ఓడిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన పుట్ట మధు మాజీ మంత్రి శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆయనకు పార్టీ పరంగా రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి ఇవ్వాలని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ ప్రాంతానికి వచ్చిన అధిష్టానం పెద్దలు, మంత్రులు సైతం సరైన స్థానం లభిస్తుందని హామీ ఇచ్చారు.

అనుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిపికేషన్‌ రెండు రోజుల్లో రానుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌   పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా పుట్ట మధు పేరును స్వయంగా ప్రకటించారు. సాధారణ ఎన్నికల్లో ఓడిపోయినా సర్పంచ్‌ ఎన్నికల్లో అత్యధిక గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులే విజయం సాధించారు. ఇందుకు పుట్టమధు కృషి చేశారు.

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌నేతకు వెన్నంటి ఉండి మంథనితోపాటు పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈక్రమంలోనే పుట్ట మధును జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించాలని మంత్రులతోపాటు చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని నిర్ధారించడంతో కమాన్‌పూర్‌ మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు పుట్ట మధు సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement