ఉమ్మడి నెట్‌వర్క్‌కు టాటా!
► ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
► ఏపీతో కలసి ఉన్న ఉమ్మడి నెట్‌వర్క్ నుంచి బయటకు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తనకంటూ ఓ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. రిజిస్ట్రేషన్ల లావాదేవీల్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌తో కలసి ఉన్న ఉమ్మడి నెట్‌వర్క్ నుంచి బయటకు వచ్చేసింది. ఇందుకోసం భారతీయ రైల్వేకు చెందిన రెయిల్‌టెల్‌తోపాటు ఐటీ హంగులను సమకూర్చుకునేందుకు విస్సెన్ ఇన్ఫోటెక్ అనే మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఈ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసేందుకు కసరత్తు చేస్తోంది.
మూడేళ్లుగా ఒకే నెట్‌వర్క్
రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటుతున్నా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన నెట్‌వర్క్ మాత్రం ఒక్కటే నడుస్తోంది. తెలంగాణలోని 141, ఆంధ్రప్రదేశ్‌లోని 270 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే క్రయ విక్రయ లావాదేవీలన్నీ ఒకే నెట్‌వర్క్ పైనే జరుగుతున్నాయి. ఒకటే నెట్‌వర్క్‌తో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, తెలంగాణకు ప్రత్యేక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెట్‌వర్క్‌లో తలెత్తే ట్రాఫిక్ బిజీని తగ్గించుకోవచ్చని, మెరుగైన సేవలను వేగంగా అందించవచ్చని రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కొనసాగుతున్న స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (స్వాన్)కు అదనంగా మరో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుంటోంది. ఇండియన్ రైల్వేకు చెందిన ఐటీ సంస్థ రెయిల్‌టెల్‌తో నెట్‌వర్క్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా మల్టీప్రోటోకాల్ లేబుల్ స్విచింగ్ (ఎంపీఎల్‌ఎస్) వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది. ఈ వ్యవస్థ ఏర్పాటుతో రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఐటీ సమస్యలు ఉండవని, ఒకవేళ వచ్చినా అన్ని కార్యాలయాలు స్తంభించిపోయే పరిస్థితి, సర్వర్లు డౌన్ అయ్యే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1.2 కోట్లను రెయిల్‌టెల్‌కు చెల్లించనుంది.
ఐటీ హంగులు కూడా..
కొత్త నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ఐటీ హంగులను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సమకూర్చుకుంటోంది. ఇందుకోసం రూ.72 కోట్లతో విస్సెన్ ఇన్ఫోటెక్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 7–9 కొత్త కంప్యూటర్లతో పాటు స్కానర్లు, ప్రింటర్లు, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలు, ఐరిష్ రీడర్లు, మోడెమ్‌లను ఆ సంస్థ సరఫరా చేసి ఐదేళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి 5 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఒక ఇంజనీర్‌ను కూడా నియమించుకుని రోజువారీ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ సామగ్రి చేరుకోగా, అక్టోబర్ 15 కల్లా అన్ని కార్యాల యాల్లో ఐటీ హంగులను సమకూర్చనున్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో సర్వర్లు, స్టోరేజీ సామర్థ్యం కూడా పెరగనుంది.