మద్యం పాలసీ ఖరారు
ఖమ్మం క్రైం : కొత్త మద్యం పాలసీ ఖరారైంది. తెలంగాణ కొత్త రాష్ట్రంలోనూ పాత విధానాన్నే కొనసాగించనున్నారు. ఈ ఏడాది జిల్లాకు 147 మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే ఏడు మండలాల్లోని తొమ్మిది షాపులు సీమాంధ్రకే వెళ్లనున్నాయి. జిల్లాలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 77 షాపులు, కొత్తగూడెం సూపరింటెండెంట్ పరిధిలోని 67 షాపులు ఉన్నాయి. వీటితో పాటు కరీంనగర్‌కు చెందిన మూడు షాపులను కూడా మన జిల్లాకే కేటాయించారు.
ఈ మొత్తం 147 షాపులకు ఆదివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 21 వరకు దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు. 23న లాటరీ పద్ధతిలో షాపులను కేటాయిస్తారు. దరఖాస్తుతో పాటు రూ.25 వేల డీడీ అందజేయాల్సి ఉంటుంది. వైన్‌షాపు వేలానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి గతంలో ఏ విధమైన కేసుల్లోనూ నిందితుడిగా ఉండకూడదని, 21 సంవత్సరాలు నిండి ఉండాలని, ప్రభుత్వానికి ఏమైనా బకాయిలు చెల్లించాల్సి ఉన్నవారు, అంటువ్యాధులు ఉన్నవారు అనర్హులని అధికారులు వివరించారు.
జిల్లాకు ఆరు శ్లాబులు వర్తింపు...
ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో అమలు కానున్న మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం ఫిక్స్‌డ్ లెసైన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. 2011 జానాభా లెక్కల ప్రకారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వైన్‌షాపులను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. 10 వేల లోపు జనాభాకు రూ.32.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల నుంచి 50 వేల జనాభాకు రూ. 34 లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల వరకు జనాభా ఉంటే రూ.42 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో నాలుగు శ్లాబ్‌లు వర్తించే షాపులు ఉన్నాయి. అధికంగా 3 లక్షల జనాభాకు రూ.42 లక్షల శ్లాబ్ ఉంది.
అంతకుముందు జిల్లాలో మొత్తం 153 షాపులుండేవి. 2012లో షాపుల వేలం అనంతరం.. ఇక్కడ మ ద్యం అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో ఏడాది తర్వాత కరీంనగర్ జిల్లాకు చెందిన మూడు దుకాణాలను ఖమ్మం జిల్లాకు కేటాయించారు. దీంతో మొత్తం 156 షాపులయ్యాయి. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కలుస్తున్న ఏడు మండలాల్లో ఉన్న తొమ్మిది షాపులు సీమాంధ్రకు వెళ్తుండడంతో ప్రస్తుతం 147 షాపులకు వేలం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2012లో జిల్లాలోని 153 షాపుల కోసం 2,374 దరఖాస్తులు రాగా, వాటి ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ.5.92 కోట్ల ఆదాయం వచ్చింది.
నేడు అధికారులతో సమీక్ష...
మద్యం పాలసీ ఖరారు కావడంతో వైన్ షాపులకు నిర్వహించాల్సిన వేలంపై ఆదివారం జిల్లా ఎక్సైజ్ శాఖాధికారులతో డీసీ మహేష్‌బాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలోని ఎక్సైజ్ అధికారులంతా హాజరు కావాలని సూచించారు. కాగా, శనివారం కొందరు అధికారులతో సమావేశమై వేలంలో పాటించాల్సిన నిబంధనల గురించి చర్చించారు.