పోలీసులకు చిక్కిన నిందితులు
ఆయుధాలు స్వాధీనం
మహబూబ్‌నగర్ క్రైం : అన్నను చంపేందుకు తమ్ముడు పథకం పన్నగా చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేయడమేగాక మారణాయుధాలను స్వాధీనపరచుకున్నారు. ఈ వివరాలను మంగళవారం రాత్రి ఇక్కడ సీఐ సోమ్‌నారాయణసింగ్ వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఇసాక్, అజీం అన్నదమ్ములు. వీరికి గతంలో మూన్ పౌల్ట్రీఫారం చికెన్ సెంటర్ ఉండేది. ఇద్దరూ కలిసి కొన్నేళ్లపాటు వ్యాపారం చేశారు. కొన్ని నెలల తర్వాత మనస్పర్థలు, గొడవలు రావడంతో చికెన్ సెంటర్‌ను ఇసాక్ సొంతం చేసుకున్నాడు. దీంతో మూడునెలల క్రితం తన అన్నను తుదముట్టించాలని తమ్ముడు అజీం పథకం పన్నాడు.
ఇందులోభాగంగా మహబూబ్‌నగర్‌కు చెందిన ఇలియాస్‌కు *నాలుగు లక్షలు ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలాగే కొన్నిరోజుల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన అలీ, షకీల్‌ను సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి జడ్చర్లకు చెందిన పాత నేరస్తులైన పాలకొండ కృష్ణయ్య, బోయ మహేష్, నవాబ్‌పేట మండంలోని కామరం వాసి సుంకరి కృష్ణను సంప్రదించారు. ఇసాక్‌ను హత్య చేస్తే *మూడున్నర లక్షలు ఇస్తామని ముందుగా *లక్ష అడ్వాన్స్‌గా చెల్లించారు. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఇద్దరికి నిందితులు *25 వేలు చెల్లించారు.
రెండురోజుల క్రితం ముగ్గురు కలిసి బోయపల్లిగేట్ సమీపంలోని ఇసాక్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇది తెలుసుకుని అప్రమత్తమైన బాధితుడు సోమవారం రాత్రి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి అజీంను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్‌ఫోన్ కాల్‌డేటాను పరిశీలించి మంగళవారం ఉదయం జడ్చర్లలో ఉన్న నిందితుల ఇళ్లపై దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు ఇలియాస్, అలీ, షకీల్‌ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్‌లు, రెండు గొడ్డళ్లు, కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అన్న హత్యకు తమ్ముడి కుట్ర
Published Wed, May 27 2015 12:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement