మందుబాబులూ.. మీరెక్కడ? | Traffic police catched 14 thousand people in drunk and drive cases | Sakshi
Sakshi News home page

మందుబాబులూ.. మీరెక్కడ?

Published Mon, Oct 9 2017 12:57 AM | Last Updated on Mon, Oct 9 2017 9:20 AM

Traffic police catched 14 thousand people in drunk and drive cases

నేరాలకు పాల్పడే వారు పోలీసుల వాంటెడ్‌ లిస్ట్‌లో ఉంటారు. ఇప్పుడు నగర ట్రాఫిక్‌ పోలీసులకూ కొందరు ‘వాంటెడ్‌’గా ఉన్నారు. వారెవరో కాదు.. మందుబాబులు..! మద్యం తాగి వాహనాలు నడుపుతూ స్పెషల్‌ డ్రైవ్‌లో చిక్కిన కొందరు ఆపై ‘పత్తా లేకుండా’పోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిన వారి సంఖ్య 3,760గా ఉందని రికార్డులు చెబుతున్నాయి. కౌన్సెలింగ్‌కు కుటుంబీకులతో రావాల్సి ఉండటం, ఆపై కోర్టులో హాజరుకావాల్సి ఉండటంతో వీరంతా ‘తప్పించుకు తిరుగుతున్నట్లు’ అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి వారికి చెందిన వాహనాల నిర్వహణ ట్రాఫిక్‌ పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.    
– సాక్షి, హైదరాబాద్‌

పట్టుబడితే వాహనం సీజ్‌..
నిబంధనల ఉల్లంఘనల్ని ట్రాఫిక్‌ పోలీసులు మూడు రకాలుగా పరిగణిస్తారు. వాహనచోదకుడికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పు కలిగించేవి, వాహనచోదకుడితో పాటు ఎదుటి వారికీ ముప్పు కలిగించేవి. మూడో దాన్నే ట్రాఫిక్‌ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు. మద్యం తాగి వాహనాలు నడపటం ఈ కోవలోకే వస్తుంది. రోడ్డు ప్రమాదాలు నిరోధించడానికి ట్రాఫిక్‌ పోలీసులు.. వారాంతాలతో పాటు ఆకస్మికంగానూ స్పెషల్‌ డ్రైవ్‌లు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారి నుంచి తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటారు.

ఆ రెండు భయాల నేపథ్యంలో..
స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడిన ‘నిషా’చరులు ఆ తర్వాతి వారంలో టీటీఐలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. దీనికి కుటుంబంలో ఎవరో ఒకరిని తీసుకురావాలి. వివాహితులు భార్య, అవివాహితులు తల్లిదండ్రులు, సోదరుడు, సంరక్షకులతో హాజరుకావాలి. మందుబాబుల్లో చాలా మంది విషయం కుటుంబీకులకు తెలియడానికి ఇష్టపడట్లేదు. దీంతో కౌన్సెలింగ్‌కు హాజరుకావట్లేదు. ఈ అంశంలో సమస్య లేని వారికి కోర్టు భయం ఉంటోంది. కౌన్సెలింగ్‌ తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు సదరు మందుబాబును కోర్టులో హాజరుపరుస్తారు. పట్టుబడిన సమయంలో వారు తీసుకున్న మద్యం మోతాదును బట్టి న్యాయస్థానం వీరికి జైలు శిక్షలు సైతం విధించే ఆస్కారం ఉంది. దీనికి భయపడుతున్న మరికొందరు ట్రాఫిక్‌ పోలీసులకు ‘దూరంగా’ఉంటున్నారు. 

‘ఆధార్‌’ సరిపోవాల్సిందే..
స్నేహితులు, పరిచయస్తుల్ని కుటుంబీకులుగా చూపిస్తూ కొందరు మందుబాబులు కౌన్సెలింగ్‌కు వస్తున్నారని ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వారికి చెక్‌ చెప్పడానికి ఆధార్‌ తప్పనిసరి చేస్తున్నారు. ‘నిషా’చరుడితో పాటు అతడితో వచ్చిన వారి ఆధార్‌ వివరాలను సరిచూస్తూ.. అసలు కుటుంబీకులు ఎవరు? నకిలీ కుటుంబీకులు ఎవరు? అనేది గుర్తిస్తున్నారు. ఈ కారణాల నేపథ్యంలో నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో అనేక వాహనాలు ఉండిపోతున్నాయి. వీటిని సంరక్షించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇలా ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 14,528 మంది ‘నిషా’చరులు ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కగా.. 3,760 మంది కౌన్సెలింగ్‌కు హాజరుకాకుండా వాహనాలను ‘వదిలేశారు’.

కొత్త విధానం రూపొందిస్తాం
డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కి.. కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. ఈ వాహనాలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లలో ఉండిపోతున్నాయి. ఈ పరిణామాల దృష్ట్యా కొత్త విధానం రూపొందించాలని యోచిస్తున్నాం. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి బ్లడ్‌ ఆల్కహాల్‌ కౌంట్‌(బీఏసీ) ‘30 ఎంజీ ఇన్‌ 100 ఎంఎల్‌ బ్లడ్‌’కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటాం. ప్రస్తుతం చిక్కిన ప్రతి ఒక్కరికీ కౌన్సెలింగ్‌ తప్పనిసరి. దీనిని సవరించి బీఏసీ కౌంట్‌ 100 కంటే ఎక్కువ ఉన్న వారికే కౌన్సెలింగ్‌ వర్తింపజేయాలని యోచిస్తున్నాం.  
 – ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ డీసీపీ

‘టాప్‌ ఫైవ్‌’ ఠాణాలివే
గత 9 నెలల్లో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల వారీగా నమోదైన డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు, ‘వాంటెడ్‌’గా ఉన్న మందుబాబుల వివరాలు
ట్రాఫిక్‌ ఠాణా    కేసులు    ‘వాంటెడ్‌’
టోలిచౌకి    950    527
తిరుమలగిరి    827    309
మారేడ్‌పల్లి    795    336
గోపాలపురం    729    274
మహంకాళి    714    324 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement