చుక్కేసి..చిక్కేసి! | 14000 people jailed for Drunk Driving in hyderabad | Sakshi
Sakshi News home page

చుక్కేసి..చిక్కేసి!

Published Thu, Jun 21 2018 10:28 AM | Last Updated on Thu, Jun 21 2018 10:31 AM

14000 people jailed for Drunk Driving in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్య, చోరీ, దోపిడీ వంటి తీవ్రమైన నేరాలు చేస్తే జైలుకు వెళ్లడం సహజం. అయితే నగరంలో చెలరేగిపోతున్న మందుబాబులు సైతం ఊచలు లెక్కిస్తున్నారు. పూటుగా చుక్కేసి.. వాహనాలు నడిపినందుకు ‘నిషా’చరులు కూడా కటకటాల పాలవుతున్నారు. ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌డ్రైవ్‌లో చిక్కిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తోంది. ఈ రకంగా గడిచిన 51 నెలల్లో (2014–2018 మార్చి) ఏకంగా 14 వేల మంది జైలు ‘చూసొచ్చారు’. మొత్తమ్మీద ఈ కాలంలో 75 వేల కేసులు నమోదు కాగా.. వీరు జరిమానా రూపంలో ఏకంగా రూ.10 కోట్లు చెల్లించారు.  

‘ఆర్‌ఎస్‌–10 ప్రాజెక్ట్‌’లో భాగంగా.. 
ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, వీటి ద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘ఆర్‌ఎస్‌–10 ప్రాజెక్ట్‌’ ప్రారంభించింది. తక్కువ, మధ్య ఆదాయం గల 10 దేశాలను ఎంపిక చేసి వాటిలో దీన్ని అమలు చేస్తున్నారు. హెల్మెట్‌ వినియోగం పెంచడం, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చేయడం, డ్రంకన్‌ డ్రైవింగ్‌ నియంత్రణ, స్పీడ్‌ మేనేజ్‌మెంట్, ట్రామా కేర్, డేటా సిస్టమ్స్‌ అభివృద్ధి ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యాలు. భారతదేశంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా హైదరాబాద్‌తో పాటు పంజాబ్‌లోని జలంధర్‌ (పగ్వారా టౌన్‌)లో అమలవుతోంది. ఒక్కో ప్రాంతంలో ఉన్న సమస్యల ఆధారంగా కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్నారు. మన సిటీలో డ్రంకన్‌ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌ నిధుల ద్వారా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక బ్రీత్‌ అనలైజర్లతో 2011 నవంబర్‌ 4 నుంచి నగర ట్రాఫిక్‌ విభాగం ఈ డ్రైవ్‌ ప్రారంభించింది. తొలినాళ్లలో కోర్టులో హాజరు పరచగా కేవలం జరిమానా మాత్రమే విధించేవారు. ఆ తర్వాత జైలు శిక్షలు వేస్తున్నారు.  రెండోసారి చిక్కితే రెండేళ్ల శిక్ష  ‘నిషా’చరులకు జైలు శిక్ష విధించే అవకాశం మోటారు వాహన చట్టంలో ఉంది. ట్రాఫిక్‌ పోలీసులు ఈ డ్రైవ్‌ను మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని సెక్షన్ల ప్రకారం చేస్తారు. మద్యం తాగి చిక్కిన వారిని కోర్టుకు తీసుకువెళ్లాలంటే సెక్షన్‌ 185 ప్రకారం బుక్‌ చేసి, ఆధారాలతో వెళ్లడం అవసరం. చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకుంటారు. అయితే ట్రాఫిక్‌ పోలీసులు గతంలో ‘నిషా’చరులను ‘ర్యాష్‌ డ్రైవింగ్‌’ (సెక్షన్‌ 184బి) కింద మాత్రమే కేసు నమోదు చేసి ఫైన్‌తో సరిపెట్టేవారు. గత ఏడాది నవంబర్‌ నుంచి సెక్షన్‌ 185 ప్రకారం కేసు బుక్‌ చేసి కోర్టుకు తరలిస్తున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌ నుంచి వచ్చిన ప్రింట్‌ అవుట్‌ను ఆధారంగా చూపి చిక్కిన వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈ ఉల్లంఘనకు రూ. 2100 నుంచి రూ.3100 వరకు న్యాయస్థానం ఫైన్‌ వేస్తోంది. చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగాడని న్యాయమూర్తి భావిస్తే రెండు నెలల జైలు శిక్ష వేస్తారు. అదే వ్యక్తి రెండోసారి ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే రూ.3 వేల ఫైన్‌ లేదా రూ.రెండేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఆ చట్ట ప్రకారం ఉంది. ఇలా పదేపదే చిక్కుతున్న వారికి గుర్తించేందుకు నగర ట్రాఫిక్‌ వింగ్‌ అధికారులు ‘నిషా’చరులకు సంబంధించిన సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌ ఏర్పాటు చేస్తున్నారు.  

‘లేడీస్‌ స్పెషల్‌’ కోసం సన్నాహాలు.. 
నగరంలో మద్యం తాగా వాహనాలు నడిపేవారిలో మహిళలు అధికంగానే ఉంటున్నారు. కొన్నేళ్లుగా ‘మందుబాబుల’ పని పడుతున్న ట్రాఫిక్‌ వింగ్‌ అధికారులు.. ఇకపై ‘నిషా రాణు’లపైనా కన్నేయనున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 25 మంది మహిళలు మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కారు. వీరిలో యువతులు, మహిళలు సైతం ఎక్కువగానే ఉంటున్నారని అధికారులు భావిస్తున్నారు. నగరంలోని కొన్ని పబ్స్, హోటల్స్‌ ఎంపిక చేసుకున్న రోజుల్లో లేడీస్‌ నైట్స్, ఎమ్మార్పీ నైట్స్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆ రోజు సదరు పబ్‌ లేదా హోటల్‌కు వెళ్లే యువతులు/మహిళలకు నిర్వాహకులు ఉచితంగా, ఎమ్మార్పీ ధరలకే మద్యం సరఫరా చేస్తున్నారని తెలియడంతో దీనిపై దృష్టి పెట్టారు. అయితే మహిళలను తనిఖీ చేసే సమయంలో కచ్చితంగా ఉమెన్‌ పోలీసులు ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నగర ట్రాఫిక్‌ వింగ్‌లో మహిళా సిబ్బంది సంఖ్య స్వల్పంగా ఉండడంతో డ్రైవ్‌ సాధ్యం కావడం లేదు. దీంతో శిక్షణలో ఉన్న మహిళా సిబ్బంది నుంచి ట్రాఫిక్‌ వింగ్‌కు వచ్చే వారితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీరిపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.  

జైలుకు భయపడి వాహనాలూ వదిలేస్తున్నారు..
డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు కౌంట్‌ చూపించిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండడంతో భయపడిన కొందరు తమ వాహనాలకు ట్రాఫిక్‌ పోలీసుల వద్దే వదిలేస్తున్నారు. ఈ కోవకు చెందిన దాదాపు 450 కార్లు/ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ఆయా ట్రాఫిక్‌ ఠాణాల్లో పడి ఉన్నాయి. వారాంతాల్లో రాత్రి వేళల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా డ్రైవర్‌ మత్తులో ఉన్నట్లు బ్రెత్‌ ఎనలైజర్లు గుర్తిస్తే వెంటనే పోలీసులు చలాన్‌ జారీ చేస్తున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతడికి పంపిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో స్థానిక ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌కు రమ్మని చెప్పి అట్నుంచి ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. ఇది పూర్తయ్యాక కోర్టులో హాజరై జరిమానా చెల్లించడం/జైలు శిక్ష అనుభవించడం పూర్తయిన తరువాతే వాహనాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు చెప్పినట్లు కౌన్సిలింగ్‌/కోర్టుకు హాజరైతే జైలు పడుతుందనే భయంతో అనేక మంది నెలలుగా తమ వాహనాలనూ వదిలేసి తప్పించుకు తిరుగుతున్నారు.


నగరంలో ఇదీ ‘సీన్‌’.. 
ఏడాది                  కేసులు     జరిమానా     జైలు శిక్షలు        డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు (రూ.కోట్లు)
2014                  15,384     2.02             2569                     – 
2015                  16,633     2.07             2940                     – 
2016                  17,510     2.98             3470                    75 
2017                   20,811     2.20             4015                   203 
2018(మార్చి)         5,364      1.19            1103                    475
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement