హైదరాబాద్:తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను, వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక సభ్యులు శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ ముందు ధర్నా నిర్వహించారు. ట్రస్ట్‌భవన్ ముట్టడికి యత్నించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాబు కావాలంటే బాబు రావాలి అనే నినాదంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు... కానీ ఆ తర్వాత బాబు వచ్చాడు జాబు పోయింది అన్నట్లుగా పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్రస్ట్ భవన్ ముందు బైఠాయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఇంటికో ఉద్యోగం అనే హామీని అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పోలీసులు వీరిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు అయిన వారిలో ఐక్యవేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్.గోవిందరావు, పలువురు నేతలు, నిరుద్యోగులు ఉన్నారు.