
‘వీణవంక’ కేసు: అనూహ్య తీర్పు
కరీంనగర్: తెలంగాణలో సంచలనం సృష్టించిన వీణవంక గ్యాంగ్ రేప్ కేసులో న్యాయస్థానం శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులు గొట్టె శ్రీనివాస్, ముద్దం అంజయ్యలకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కరీంనగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగరాజు తీర్పు చెప్పారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు. మరో నిందితుడిని బాలనేరస్తుడిగా గుర్తించారు.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై గతేడాది ఫిబ్రవరి 10న ముగ్గురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆకృత్యాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఫిబ్రవరి 24న పోలీసులు కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్సై కిరణ్, కానిస్టేబుల్ పరశురాములను అప్పట్లో సస్పెండ్ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ స్వయంగా జోక్యం చేసుకోవడంతో కేసు దర్యాప్తు వేగవంతంగా ముందుకు సాగింది. దోషులకు కోర్టు శిక్ష విధించడంతో బాధితురాలి తరపువారు హర్షం వ్యక్తం చేశారు.