సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం అంతటా ఒకటే ‘కూల్’ టాపిక్.. ఈ చలేంట్రా బాబూ అన్నదే.. పెథాయ్ తుపాన్ దెబ్బకు రాత్రి, పగటి ఉష్ణోగ్రతలకు తేడా లేకుండా పోయింది. ఉదయం, మిట్టమధ్యాహ్నం అన్న తేడా లేకుండా చలి వణికించేసింది. అనేకచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలే పగలూ నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో భద్రాచలంలో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, పగటి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదైంది. అక్కడ సాధారణంగా పగటి ఉష్ణోగ్రత 30 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా, 10 డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌లో రాత్రి ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కాగా, హన్మకొండలో పగటి ఉష్ణోగ్రత కూడా 18 డిగ్రీలే నమోదైంది. వాస్తవంగా హన్మకొండలో సాధారణంగా 30 డిగ్రీలు పగటి ఉష్ణో గ్రత నమోదు కావాలి.
కానీ 12 డిగ్రీలు తక్కువగా నమోదైంది. అంతేకాదు హన్మకొండలో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు నమోదైంది. అంటే అక్కడా పగలు, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య పెద్దగా తేడా లేదు. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గతంలో ఎన్నిసార్లు తుపాన్లు, చలికాలం వచ్చినా ఇలాంటి పరిస్థితి లేదని ప్రజలు అంటున్నారు. నిజామా బాద్, రామగుండంలోనూ 9 డిగ్రీలు తక్కువగా పగటి ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే అనేకచోట్ల మోస్తరు నుంచి అధిక వర్షాలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లా తల్లాడ, మధిరల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. పెథాయ్ తుపాను శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. తుపాను తీరం దాటినందున ఒకట్రెండు రోజుల్లో శీతల గాలుల తీవ్రత తగ్గి, సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు.
‘చిల్డ్’ సిటీ...
రాజధాని ఒక్కసారిగా ‘చిల్డ్’జోన్‌లో చేరిపోయింది. తుపానుతో పాటు శీతల గాలుల జోరుతో నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తొమ్మిది డిగ్రీలు పడిపోయాయి. దీంతో రాత్రితో పాటు పగటి సమయాల్లోనూ చలి తీవ్రత నగరవాసుల్ని వణికిస్తోంది. చిరు జల్లులు సైతం చలి తీవ్రతను పెంచేశాయి. గడిచిన 24 గంటల్లో నగరంలో పగటిపూట 19.8, రాత్రివేళల్లో 15.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణగా 28 డిగ్రీలు నమోదు కావాల్సి ఉంది. కానీ తొమ్మిది డిగ్రీలు తగ్గి 19.8 డిగ్రీలు రికార్డు కావటంతో పగలు–రాత్రి తేడా లేకుండాపోయింది. దీంతో నగరంలో ఒక్కసారిగా స్వెటర్లు, బ్లాంకెట్లు, జెర్కిన్ల మార్కెట్‌కు డిమాండ్ పెరిగింది. తుపాను కారణంగా ఆకాశం మేఘావృతమవడంతో గాలి నాణ్యత కూడా ఓ మోస్తరుగానే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇదిలా ఉంటే నగరంలో 2012 జనవరి 15న మారేడుపల్లిలో 5.2 డిగ్రీలు, 2011 జనవరి 6న కాప్రాలో 5.6 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
విజృంభిస్తున్న ఫ్లూ...
చలిగాలుల తీవ్రతతో రాష్ట్రంలో ఫ్లూ విజృంభిస్తోంది. మరోవైపు స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వెంకయ్య(73) మంగళవారం మృతిచెందాడు. చలి తీవ్రత కారణంగా రాష్ట్రంలో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. అధిక చలితో పిల్లల్లో ఆస్తమా, జలుబు వంటివి వచ్చే ప్రమాదముందని, తీవ్రమైన చలి కారణంగా ఊపరితిత్తులు దెబ్బతింటాయని డాక్టర్ కమల్‌నాథ్ ‘సాక్షి’కి తెలిపారు. తీవ్ర చలి కారణంగా అధిక ఆహారం తీసుకుంటారని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో 14 మంది, ఏపీలో 19 మంది మృతి
చలిపులి పంజా విసిరింది. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న గాలులు, చలి తీవ్రతను తట్టుకోలేక మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో 14 మంది మృతి చెందారు. కాగా ఏపీలో శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 19 మంది చనిపోయారు. పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది.
అన్నదాత గుండె పగిలింది
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్: అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని గొట్టిపల్లి చిన్నయ్య(69) కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వరిసాగు చేసిన చిన్నయ్య కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. వర్షానికి పొలంలో కుప్పల చుట్టూ నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా నీటమునిగిన తన పంటను చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా పంట మునగడంతో తీవ్రంగా కలత చెంది నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment