ప్రభుత్వాసుపత్రి ముందు రోడ్డుపై ధర్నా చేపడుతున్న మృతురాలి కుటుంబ సభ్యులు
సాక్షి, గజ్వేల్(మెదక్) : ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి డెలివరీ చేసిన తర్వాత మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన గజ్వేల్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. బా«ధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలా ఇలా ఉన్నాయి. ములుగు మండలం కొక్కొండకు చెందిన పుట్టి ప్రవళిక(20)కు అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. శ్రీనివాస్ గ్రామంలో తమకున్న వ్యవసాయంతో పాటు దినసరి కూలీగా పని చేస్తున్నాడు. ప్రవళికను కాన్పుకోసం శనివారం ఉదయం గజ్వేల్ పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకువచ్చారు. సాయంత్రం 4:15 గంటలకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి డెలివరీ చేయగా ప్రవళిక పాపకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో రాత్రి 8గంటల ప్రాంతంలో ప్రవళిక మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబీకులు వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెలివరీ సమయంలో బాగానే ఉన్న ప్రవళిక అకస్మాతుగా మృతి చెందడమేంటని మండిపడుతూ అర్ధరాత్రి వరకు మృతురాలి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న గజ్వేల్ సీఐ ప్రసాద్ ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం సైతం మృతురాలి కుటుంబీకులు ఆందోళనకు దిగుతూ ఆసుపత్రి ముందు భాగంలో రోడ్డుపై ధర్నా చేపట్టారు.
నిర్లక్ష్యం వల్లే మృతి..
వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రవళిక మృతి చెందిందని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రవళిక మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అక్కడి నుంచి స్వగ్రామమైన కొక్కొండకు తీసుకువెళ్లారు. ఇదిలా ఉంటే ప్రవళిక మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment