ఒకేరోజు ముగ్గురు బాలింతల మృతి | Three children were killed on the same day | Sakshi
Sakshi News home page

ఒకేరోజు ముగ్గురు బాలింతల మృతి

Published Fri, Apr 21 2017 11:18 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఒకేరోజు ముగ్గురు బాలింతల మృతి

ఒకేరోజు ముగ్గురు బాలింతల మృతి

⇒ నవజాత శిశువు కూడా..
⇒ వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయారని బంధువుల ఆరోపణ
⇒ విచారణకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం


గన్‌ఫౌండ్రి/సుల్తాన్‌బజార్‌: సకాలంలో వైద్యం అందించక వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించడంతో శుక్రవారం ముగ్గురు బాలింతలతో పాటు ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయారు. ప్రసవం కోసం సుల్తాన్‌బజార్‌లోని ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన ఇద్దరు మహిళలు ప్రసవానంతరం కొద్ది గంటల వ్యవధిలోనే ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. పేట్లబురుజు ప్రభుత్వ ఆధునిక ప్రసూతి ఆసుపత్రిలో మరో బాలింత, నవజాత శిశువు మృతి చెందారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం మల్లెపల్లికి చెందిన గర్భిణి జయమ్మ గురువారం సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. వైద్యులు శస్త్ర చికిత్స చేయడంతో ఆడశిశువు జన్మించింది. కాగా శుక్రవారం ఉదయం జయమ్మకు బీపీ తగ్గడంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో సంఘటనలో.. నాగర్‌కర్నూలు జిల్లా గౌడిపల్లికి చెందిన గర్భిణి శారద ఈ నెల 17న ఇదే ఆసుపత్రిలో చేరింది. గురువారం ఆమెకు శస్త్రచికిత్స చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా అదే రోజు సాయంత్రం ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్సల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

పేట్లబురుజు ఆస్పత్రిలో...
మెదక్‌ జిల్లా పెద్ద శంకరంపేట్‌ మండలం మార్చట్‌పల్లికి చెందిన బాల్‌రాజ్‌ భార్య కవిత (21) మొదటి ప్రసవం కోసం ఈ నెల 19న నగరంలోని పేట్లబురుజు ఆసుపత్రిలో చేరారు. గురువారం ఆపరేషన్‌ చేస్తామన్న వైద్యులు చేయకుండా సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో పుట్టిన శిశువు మృతి చెందిందని కవిత బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం కవితకు ఎలాంటి చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేయడంతో శుక్రవారం ఉదయం ఆమె కడుపు ఉబ్బిపోయిందన్నారు. తాము పలుమార్లు డాక్టర్లను సంప్రదించినా స్పందించలేదని.. చివరకు ఉదయం డాక్టర్‌ హడావుడిగా చికిత్స చేసినా అప్పటికే ఆమె మృతి చెందిందని వారు తెలిపారు.

ఈ నేపథ్యంలో డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో తన భార్య, బిడ్డ మృతి చెందిందని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కవిత భర్త బాల్‌రాజ్, బంధువులు ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. చార్మినార్‌ ఏసీపీ అశోక చక్రవర్తి, ఇన్‌స్పెక్టర్‌లు చంద్రశేఖర్‌రెడ్డి, శ్యాంసుందర్, లక్ష్మీనారాయణ, రుద్రభాస్కర్‌లు అక్కడికి చేరుకుని బాధితులను సముదాయించారు. చివరకు డాక్టర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరిన బాధితులు.. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించకుండానే తీసుకెళ్లిపోయారు. బాధితులు రాతపూర్వక ఫిర్యాదు చేయనందున కేసు నమోదు చేయలేదని ఏసీపీ అశోక చక్రవర్తి తెలిపారు.

విచారణకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం
హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆసుపత్రిలో ఇద్దరు బాలింతల మృతిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని మంత్రి డీఎంఈ రమణికి సూచించారు. బాలింతల మృతి పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. వారి మృతికి కారకులైన వారెవరినీ వదలబోమన్నారు. విచారణలో అన్నీ తేలుతాయన్నారు.  

వైద్యుల తప్పు లేదు
బాలింతల మృతికి సంబంధించి వైద్యుల తప్పు లేదు. వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించిన అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. శారదకు రక్త హీనత ఏర్పడటంతో, జయమ్మకు బీపి పడిపోవడంతో మెరుగైన వైద్య చికిత్సల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించాం. వారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  

Advertisement
Advertisement