నిర్లక్ష్యానికి బాలింత బలి | Women Died To Doctors Negligence In Nagarkurnool | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యానికి బాలింత బలి

Published Sat, May 5 2018 8:10 AM | Last Updated on Sat, May 5 2018 8:10 AM

Women Died To Doctors Negligence In Nagarkurnool - Sakshi

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు, కృష్ణవేణి (ఫైల్‌)

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. పండంటి బిడ్డను జన్మనివ్వాలని పురుడు పోయడానికి వచ్చిన మహిళ విగతజీవిగా ఇంటికి చేరింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కృష్ణవేణి (22) గత ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతూ జిల్లా ఆస్పత్రిలో చేరింది. మరుసటిరోజు సిజేరియన్‌ చేయగా రెండో కాన్పులోనూ మగబిడ్డ జన్మించాడు. ఫొటోథెరపీ కోసం శిశువును వేరే ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ప్రసవం అనంతరం బాలింత నొప్పులతో బాధపడుతుందని భర్త మల్లేష్‌ వైద్యులకు చెప్పాడు. అయినా వినకుండా నిర్లక్ష్యం చేశారు.

మరుసిటిరోజు పొట్ట ఉబ్బడం, తీవ్ర నొప్పులు రావడంతో సంబంధిత వైద్యున్ని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని, ఇక్కడ సరిపోను వసతులు లేవని మహబూబ్‌నగర్‌కు రెఫర్‌ చేశారు. అక్క డ కూడా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం రాత్రి 9.30గంటల సమయంలో మృతిచెందింది. మృతికి కారణం సిజేరియన్‌ చేసిన వైద్యుల అలసత్వమేనం టూ శుక్రవారం ఉదయం బంధువులతోపాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. వైద్యాధికారులు స్పం దించక పోవడంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు.

మద్దతు తెలిపిన నాయకులు   

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులకు అండగా కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండా మణెమ్మ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాస్, ఉస్సేన్, బాలయ్య, నాసర్‌ఖాన్, సీపీఎం, సీపీఐ ఇతర నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. కలెక్టర్‌ వచ్చి కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర దారులకు మళ్లించారు. అనంతరం సంఘటన స్థలానికి డీఆర్వో మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకుని బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సంఘటనపై విచారం వ్యక్తంచేస్తూ కుటుంబానికి ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగం కల్పించడంతోపాటు జీవన భృతి కోసం ఎస్సీ కార్పొరేషన్‌ కింద లక్ష రూపాయల లోన్‌ వచ్చే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే మళ్లీ ఆందోళనకు వెనకాడమని వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న డీఆర్వో, ఆర్డీఓ, డీఎస్పీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement