పుస్తకం.. మా నేస్తం | World Book Lovers Day | Sakshi
Sakshi News home page

పుస్తకం.. మా నేస్తం

Published Thu, Aug 9 2018 11:02 AM | Last Updated on Tue, Oct 16 2018 3:15 PM

World Book Lovers Day - Sakshi

రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

‘నీళ్లు–నిజాలు’ పుస్తకం చదివితే కలిగిన ఆలోచనలకు ప్రతిరూపమే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన అంటున్నారు మంత్రి హరీశ్‌రావు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.. ‘మా పల్లె’ పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివానో లెక్కేలేదంటున్నారు.

ఇంకా.. ‘ద ప్రిన్స్‌’ చదివి పరిపాలన లక్షణాలను నేర్చుకున్నానని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి.. ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’ చదివి నిరాడంబరత అలవర్చుకున్నానని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ చెప్పారు. ఇక, పిల్లల్లో పఠనాసక్తి పెరగాలంటే బోధన కథల రూపంలో సాగాలని ‘కథల తాతయ్య’ ఎన్నవెళ్లి రాజమౌళి అంటున్నారు. 

సాక్షి మెదక్‌ :  పుస్తకం ఒక విజ్ఞానం.. పుస్తకం ఒక పవిత్ర గ్రంథం.. పుస్తకం ఒక దిక్సూచి.. పుస్తకం చరిత్రలకు సాక్ష్యం.. పుస్తకం భవిష్యత్తుకు ఆధారం.. అలాంటి పుస్తకాలను విజ్ఞానం కోసం చదివే వారు కొందరు.. మార్కుల కోసం చదివేవారు కొందరు.. ఉద్యోగం కోసం చదివేవారు కొందరు.. సరదా కోసం చదివేవారు కొందరు.. కానీ పుస్తకాలను ప్రేమిస్తూ చదివేవారు అరుదుగా ఉంటారు.. అలాంటి వారి కోసమే బుక్‌ లవర్స్‌ డే ను నిర్వహిస్తున్నారు.. నేడు ప్రపంచ పుస్తక ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం...

చరబండరాజు రచించిన మా పల్లె పుస్తకం నాకు అత్యంత ఇష్టం

దుబ్బాకటౌన్‌ : ప్రముఖ విప్లవ రచయిత చరబండ రాజు రచించిన మా పల్లె పుస్తకం నాకు అత్యంత ఇష్టం.. నేను సహజంగా పుస్తక ప్రేమికున్ని. 1981–82లో దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివేరోజుల్లో పీపుల్స్‌వార్‌ గ్రూపు నాయకుడు శాకమూరి అప్పారావుతో ఏర్పడ్డ పరిచయంతో కారల్‌ మార్క్స్‌ రచించిన దాస్‌క్యాపిటల్‌తో పాటు రష్యాకు చెందిన అమ్మనవల..మావో ఆలోచనలు చదివాక నాలో అంతర్గతంగా కొత్త ఆలోచనలు, తెలియని శక్తి వచ్చింది.

సమాజంలో మార్పు రావాలి దానికి నేను నావంతు బాధ్యత వహించేందుకు విప్లవోద్యమంలో ముందుకు కదిలానని... నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్తకం విప్లవ రచయిత చరబండ రాజు రాసిన మా పల్లె పుస్తకంను చాలా సార్లు చదివానని రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తనకు పుస్తకాలతో ఉన్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు.

మా పల్లెపుస్తకంలో పోలీసులు రివార్డులకోసం నక్సలైట్లను వారి కుటుంబాలను బలితీసుకునే సంఘటనలు... పోలీస్‌ కానిస్టేబుల్‌ కూతురు రాడికల్‌ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న యువకుడిని ప్రేమిస్తే ఇది తెలిసి తోటి పోలీసోళ్లు చేసిన హేళనతో తండ్రి, కూతురు చనిపోయిన ఉదాంతంతో పాటు చాలా సంఘటనలు నా మనసును కదిలించాయి... వాసిరెడ్డి సీతాదేవి రాసిన మరీచికలు, అరుణతార, శ్రీశ్రీ రచనలుతో పాటుగా పబ్లిక్‌ఓరియంటెడ్‌ పుస్తకాలు వేల సంఖ్యలో చదివాను.

పనిఒత్తిడిలో ఎంతో టెన్షన్‌లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఎంత రాత్రయినా సరే నచ్చిన పుస్తకం చదివితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. మొదటి నుంచి నేను జర్నలిస్టుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా పుస్తకాలు చదవడం మరువలేను. నా వద్ద వందల పుస్తకాలు భద్రంగా దాచుకున్నా.. ప్రతిరోజు తప్పకుండా ఉదయం 5గంటలకే దినపత్రికలు చదువుతా.. నేను చదివిన మంచి పుస్తకాలతోనే నాకు సమాజం పట్ల మంచి సంబంధాలు.. విలువలు, విజ్ఞానం లభించాయంటున్నారు  - దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

నీళ్లు నిజాలు’ తోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

తెలంగాణలో పేరుగాంచిన నీటిపారుదల ఇంజనీర్‌ విద్యాసాగర్‌రావు. ఆయన రాసిన ‘నీళ్లు నిజాలు’ అనే పుస్తకంలో తెలంగాణ నుంచి ప్రవహిస్తూ వెళ్తున్న గోదావరి, కృష్ణా నదుల నీరు తెలంగాణ బీళ్లకు రాకపోవడం. ఆంధ్రపాలకుల జలదోపిడీ వివరించారు. తెలంగాణ ప్రాంతంలో కరువు కాటకాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా తీరు.. కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో రాశారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో ఆ పుస్తకంలో వివరించారు. ఆ పుస్తకం అనేక సార్లు చదివాను. అప్పుడే గోదావరి, కృష్ణా జలాలు తెలంగాణ బీళ్లకు మళ్లించాలి అనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే ఇప్పుడు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు. 

– రాష్ట్ర భారీనీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

బాగా నచ్చిన పుస్తకం ‘మాకియవెల్లి ప్రిన్స్‌’ 

నాకు చిన్నప్పటి నుంచి రాజ్యాలు, రాజులు పరిపాలన విధానం మొదలైన పుస్తకాలు చదవడం బాగా ఇష్టం. అందుకోసమే నేను ఏంఏ పొలిటికల్‌ సైన్స్‌లో చేరి తర్వాత ఉన్నత ఉద్యోగం పొందాను. ప్రధానంగా మాకియావెల్లి రాసిన ‘ద ప్రిన్స్‌’ పుస్తకం బాగా నచ్చేది. ఇందులో రాజుకు ఉండాల్సిన లక్షణాలు. ప్రజలను పరిపాలించే తీరు క్షున్నంగా వివరించారు. ప్రతీ నాయకుడు, ఉన్నతాధికారి ఆపుస్తకం చదవాలి. కౌటిల్యుని అర్థశాస్త్రం, ఆరిస్టాటిల్‌ పొలిటికల్‌ థాట్‌ పుస్తకాలు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి..     – వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌

అబ్దుల్‌కలాం ‘వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌’..

కష్టపడితే ఫలితం ఉంటుంది.. అనడానికి అబ్దుల్‌కలాం జీవితమే ఆదర్శం.. భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్ధుల్‌కలాం సొంత ఊరు రామేశ్వరం మా ఊరుకు సరిగ్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏ పనికైనా రామేశ్వరం వెళ్లడం మాకు అనవాయితీ.. అప్పుడు అబ్దుల్‌కలాం పెరిగిన తీరు.. కష్టపడిన విధానం మా పెద్దలు చెబుతుండేవారు.

కాలానుగుణంగా అబ్దుల్‌కలాం జీవిత చరిత్ర వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌ చదివాను. ఆయన జీవితంలోని ప్రతీ సంఘటన నేటితరానికి ఒక పాఠంగా ఉంటుంది. ఎదిగిన కొద్ది ఒదిగే పద్దతి, నిరాడంభరమైన జీవితం ఇలా అబ్దుల్‌కలాం నుంచి ఎన్నొ విషయాలు నేర్చుకోవచ్చు. అందుకే అబ్దుల్‌ కలాం అన్నా, ఆయన పుస్తకాలన్నా ఇష్టంగా చవుతాను.   – జోయల్‌ డేవిస్, జిల్లా పోలీస్‌ కమిషనర్‌

చక్కని పద్య కావ్యం గబ్బిలం..

వర్గల్‌(గజ్వేల్‌): నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్నప్పటి నుంచే పుస్తక పఠనం ఎంతో ఇష్టం. కవి జాషువా, దాశరథి కృష్ణమాచా ర్య, కరుణశ్రీ రచనలంటే చాలా ఇష్టం. ‘గబ్బిలం’ పద్యకావ్యం నాకు బాగా నచ్చిన పుస్తకం. ఎవరూ ఇష్టపడని ‘గబ్బిలం’ పక్షినే కావ్య వస్తువుగా తీసుకుని కవి జాషువా కలం నుంచి జాలువారిన ఓ చక్కని పుస్తకం. ఎవరూ ఇంట్లోకి రానీయకపోవడంతో ఊరికి దూరంగా, ఓ పాడుపడిన చోట నిరాధరణకు గురైన సామాన్యుడి దైన్య పరిస్థితిని.. గబ్బిలం ద్వారా ఆలయంలో శివుడికి చేరవేసే తీరు అద్భుతం.. సామాన్యుడి వేదనను పద్యకావ్యంలో వర్ణించిన తీరు ఎంతో నచ్చింది. స్ఫూర్తిదాయకం గా నిలిచింది. స్వీయ రచనలకు బా సటగా నిలిచింది.    – బట్టపోతుల పరమేశ, తెలుగు పండిట్, నెంటూర్‌ జెడ్పీ హైస్కూల్‌

మహనీయుల చరిత్రంటే అమితాసక్తి

దుబ్బాక : దుబ్బాక పట్టణ కేంద్రానికి చెందిన దుద్దెడ రాజశేఖర్‌ ఇంటర్‌తో డీఈడీ పూర్తి చేశాడు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని ముందుగా వెళ్లేది స్థానిక గ్రంథాలయంలోకి. అందులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ మహనీయుల చరిత్రలను చదవడమంటే చాలా ఇష్టం. స్వామి వివేకానంద, స్వాతంత్య్రోద్యమంలో విరోచిత పోరాటం చేసిన వీరుల చరిత్ర, మహాత్మాగాంధీ, అంబేడ్కర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ చరిత్రలను చదవడం, అనుకరించడం అమితాసక్తి. వీటితో పాటు శ్రీధర చంద్రశేఖర శాస్త్రీ రచించిన గణిత నిర్వచనాలు ప్రతిరోజు పఠిస్తా.

ఇందులో శుద్ధి గణితం, ప్రయుక్త గణితం, అంకగణితం, బీజ గణితం, లేఖా గణితం, వ్యాపార గణితమంటే చాలా ఇష్టం. గణితం నేర్చుకోవడం వల్ల మేధస్సు పెరుగుతుంది. అందుకనే లెక్కలను ప్రతిరోజు పఠిస్తా. మార్కెట్‌లోకి కొత్త కొత్త పుస్తకాలు వచ్చినా కొనుగోలు చేసుకుని చదువుతా. తనదగ్గర ఉన్న పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా ఇస్తా. గ్రంథాలయంలోనే కాకుండా అప్పుడప్పుడు నెట్‌లో పుస్తకాలను సేకరిస్తా. మహనీయుల రాసిన పుస్తకాల్లో సామాజానికి కావాల్సిన మంచి మార్గాలను చూపిస్తాయి.   – దుద్దెడ రాజశేఖర్, డీఈడీ, దుబ్బాక

బాలసాహిత్యానికి బాటలు..

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట) : నేటి బాలలే రేపటి పౌరులు అలాంటి బాలలు మంచి మార్గంలో నడుస్తూ, నీతి, ధర్మాలను చిన్నప్పటి నుంచే అలవరుచుకోవడానికి బాల సాహిత్య పరిషత్‌ చేస్తున్న కృషి ఎంతో ముఖ్యమైంది. బాల సాహిత్య పరిషత్‌ ప్రోత్సాహంతో జిల్లాలోని బాల సాహిత్య రచయితలు రచనలు చేస్తూ పుస్తకాలు ప్రచురించడం జరగుతుంది. అంతేకాకుండా సెలవు సమయాల్లో బాలసాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలలకు రచనా మెళకువలను నిర్వహిస్తూ బాలల రచనలకు పుస్తకాలను ముద్రిస్తున్నారు.

 అలతి అలతి పదాలతో గేయాలు, సరళమైన పదాలను ఉపయోగించి కథలను రాసి బాలలకు అందించడం వలన కలుగు ప్రయోజనాలు చెబుతూ, కొన్ని కథలను పిల్లలకోసం వేదికగా సామాజిక మాధ్యమాలలలో సైతం బాలల కథలను, కవితలను, గేయాలను, పలు పత్రికలకు పంపి ముద్రింపజేస్తున్నారు. బాలసాహిత్య రచయితలు ప్రతినెల బాలవెన్నెల, బాలచెలిమి ముచ్చట్లు, తదితర కార్యక్రమాలకు వెళ్లి, శిక్షణ పోంది బాలసాహిత్యానికి, బాలలకు వారధులుగా నిలుస్తున్నారు రచయితలు.

జిల్లాలో 20మందికి పైగా బాలసాహిత్య రచనలు చేస్తూ బాలల లోకంలో విహరిస్తుండడం విశేషం. బాల సాహిత్య పరిషత్‌ రచయితలు తమ బాలసాహిత్య పుస్తకాలను పాఠశాలలకు ఉచితంగా అందిస్తు, బాలలచే చదివిస్తు బాలసాహిత్య కృషికి పాటుపడుతున్నారు. వివిధ సాహితీ ప్రక్రియల సమావేశాలకు బాలలను తీసుకెళ్లడం విశేషం. ప్రపంచ తెలుగు మహాసభల్లో సైతం బాలలచే కవితాగానం చేయించారు.

విజ్ఞాన నేస్తాలు..

హుస్నాబాద్‌రూరల్‌ : పుస్తకాలు చదువడంతో విజ్ఞానం పెరుగుతుంది. పుస్తక పఠనం ద్వారనే మానసిక ఏకాగ్రత కలుగుతుంది. పుస్తకాలే ఏవరూ లేని సమయంలో నేస్తాలుగా నిలుస్తాయి. మెదడును అలోచింపచేసే శక్తి పుస్తక పఠనం ద్వారనే లభిస్తుందని కవి, రచయిత, గాయకుడు ముక్కెర సంపత్‌ అభిప్రాయపడుతున్నారు. గ్రంథాలయల వల్ల అనేకమంది పుస్తకాలు చదివి కవులు, రచయితలు అయ్యారు. పుస్తకాలే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే మార్గాన్ని చూపిస్తాయి, పుస్తకాలలోని ప్రతి వాక్యము మంచి అర్థాన్నిస్తాయి.

ఇప్పుడు సెల్‌ఫోన్‌లు రావడంతో యువత పుస్తకాలు దూరమవుతున్నారు. గ్రంథాలయల ఏర్పాటు చేస్తే అనేక మంది పుస్తక ప్రియులకు ఆనంద నిలయాలుగా విలసిల్లుతాయి. వృద్ధాప్యంలోని అనేక మంది పుస్తక పఠనం ద్వారా మనశాంతి కలుగుతుంది. ఊరూర గ్రంథాలయలు ఉంటే ఊరంతా విజ్ఞానాన్ని పంచుతాయి.

– ముక్కెర సంపత్, కవి, రచయిత

మంచి మిత్రుడితో సమానం..

హుస్నాబాద్‌ : ఒక మంచి పుస్తకం మంచి మిత్రుడితో సమానమని హుస్నాబాద్‌ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెల్ది శ్రీనివాస్‌ అంటున్నారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుకున్నాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటికి ప్రతిరోజు ఉదయం గ్రంథాలయానికి వెళ్లి దినపత్రికలు, పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకున్నాను. శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎలాంటిదో, మానసిక ఆరోగ్యానికి, బుద్ధి వికాసానికి పుస్తకపఠనం అలాంటిది.

ప్రతిపుస్తకం ఒక గురువు మాదిరిగా అనేక మంచి విషయాలను  తెలియజేయడమే కాకుండా మనకు సరైనమార్గం వైపు పయనింపజేస్తుంది. నెహ్రూ, మండేల, అంబేడ్కర్, కలాం, గాంధీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్, వివేకానంద లాంటి ప్రముఖుల పుస్తకాలు మనలో నైతిక విలువలు పెంపొందించబడుతాయి. అంతే కాకుండా దేశభక్తి, సేవాగుణం, కష్టపడి పనిచేసే తత్వాన్ని పెంపొంది స్తాయి.

నేను ఎక్కువగా వివేకానంద పుస్తకాలు చదువుతాను. ముఖ్యంగా లేవండోయ్‌ మెల్కోనండి, ధీర యువతకు, స్మృతివనంలో వివేకానంద, ప్రభోదరత్నాకరం మొదలగేనవి ఎంతోగానో తనను ప్రభావితం చేశాయి. దీంతో జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఆసక్తి, ప్రేరణ కలిగింది. ఆ క్రమంలోనే ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించాను. వివేకానంద పుస్తకాలే నా జీవితానికి దిక్సూచిలా పని చేశాయి.

- వెల్ది శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, హుస్నాబాద్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement