సాక్షి, కామారెడ్డి : వారు అందరిలా సరదాగా ఆనందంగా గడిపినవాళ్లే.. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించినవారే.. కానీ విధి వంచితులయ్యారు.. ప్రమాదాల బారిన పడి వెన్ను విరిగి మంచాన పడ్డారు. ఏళ్ల తరబడిగా మంచంపై జీవచ్ఛవాల్లా బతుకుతూ నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. వైద్యం కోసం నెలకు రూ.5 వేలపైనే ఖర్చవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సేవలు చేసేవారు లేక కొందరు.. వైద్యానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇంకొందరు మానసికంగా కుంగిపోతున్నారు. తమను సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. వివిధ ప్రమాదాల్లో ఇలా వెన్ను విరిగి అష్టకష్టాలు పడుతున్నవారు రాష్ట్రంలో 4 వేల పైచిలుకు ఉన్నట్లు అంచనా.
బంగ్లా పైనుంచి పడి..
కామారెడ్డిలో వివేకానందకాలనీకి చెందిన శోభ(40), సిద్ధరాంరెడ్డి దంపతులు. వారికి ఒక కుమారుడు. 2000 అక్టోబర్ 17న శోభ బంగ్లాపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైంది. దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. భర్తే నిత్యం సపర్యలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు.
ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే..
వెన్నెముక పనిచేయక మంచానికే పరిమితమైన వారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారే ఉన్నారు. విద్యుత్ స్తంభాలు, భవనాలు, తాటిచెట్లపై నుంచి కింద పడి వెన్నుముక విరిగినవారూ ఉన్నారు. వీరంతా తిరిగి కోలుకోవడం దాదాపు కష్టమే. జీవితాంతం మరొకరిపై ఆధారపడాల్సిందే. ఈ దుస్థితికి తోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో చిత్రవధ అనుభవిస్తున్నారు. చాలా మందికి కనీసం వీల్‌చైర్‌లు లేవు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటే వీల్‌చైర్‌పై కూర్చోబెడితే ఓ గంటో, రెండు గంటలో కుర్చీపై అటూ ఇటూ కొంత తిరగగలుగుతారు. కానీ ఆర్థిక స్తోమత లేని ఎందరో వాటిని కొనలేక మంచాలకే పరిమితమవుతున్నారు. 24 గంటలు మంచంపైనే ఉండటం వల్ల రకరకాల పుండ్లు పడి మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మలమూత్ర విసర్జన స్పృహ కూడా తెలియని స్థితిలో బాధపడుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షఫీ హైమద్‌ఖాన్ (49) జర్నలిస్టుగా పనిచేసేవారు. 2001 జనవరి 13న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుముక విరిగింది. 589 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు భార్య అన్ని సపర్యలు చేస్తూ ఆయన్ను కాపాడుకుంటోంది. ఒత్తిడిని అధిగమించిన షఫీ ఆత్మస్థైర్యంతో బతుకుతున్నారు. నలుగురికి ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి దాకా 70 మంది వెన్నెముక బాధితులను కలిసి వారిలో ధైర్యం నూరిపోశారు.
మామిడి కాయలు తెంపబోయి..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన నర్సాపురం పెద్ద లింగం(45)కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన 2009లో మామిడి కాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. కానీ ఆయన భార్య లక్ష్మి ముంబైలోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లింది. రూ.2 లక్షల వరకు ఖర్చయ్యాయి. అక్కడ రూ.5 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో.. నిస్సహాయంగా ఇంటికి తిరిగివచ్చారు. ఆయనకు కూడా నడుము కింది భాగం స్పర్శను కోల్పోయింది. భార్యే సేవలు చేస్తోంది.
సర్కారుపైనే ఆశ..
వెన్ను బాధితులు కేవలం మందులకే నెలకు రూ.2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి అదనంగా వాటర్‌బెడ్, కుషన్, యూరినల్ బ్యాగులు, సర్జికల్ స్పిరిట్, సర్జికల్ టేప్, యాంటీబయాటిక్ పౌడర్లు, కాటన్, తదితరాలన్నీ కొనుగోలు చేయాలి. మొత్తంగా సరాసరిగా నెలకు రూ.5 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. సీఎం కేసీఆర్ ఎందరినో ఆదుకుంటున్నారని, తమపైనా దృష్టి సారించాలని వీరు అభ్యర్థిస్తున్నారు. వాటర్‌బెడ్‌లు, వీల్‌చైర్‌లు, వాటర్ కుషన్‌లు, మందులు, సామగ్రి, కుటుంబ పోషణకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచితంగా మందులు, వైద్యం అందించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment