treetment
-
ఆమె బతుకును ఎంచుకుంది
జీవించడంలో ఉన్న ఆనందం మరణించడంలో లేదు అంటుంది డాక్టర్ మహాలక్ష్మి. ఇటీవల గృహిణులు క్షణికావేశంలో ఆత్మహత్యలను ఎంచుకుంటున్నప్పుడు మహాలక్ష్మి వంటివారి జీవితం సరైన స్ఫూర్తి అనిపిస్తుంది. 26 ఏళ్ల వయసులో యాసిడ్ దాడికి లోనైన ఈ మైసూర్ వైద్యురాలు జీవించడాన్నే తన మార్గంగా ఎంచుకుంది. కోవిడ్ పేషెంట్స్‌కు వైద్యం చేస్తూ తను జీవించి ఉండటానికి ఒక అర్థాన్ని కూడా చెబుతోంది. ఇంతకన్నా ఏం కావాలి? మైసూర్ ప్రభుత్వాస్పత్రిలో రోజుకు 50 నుంచి 60 మంది పేషెంట్స్‌ను ఓపిలో చూస్తుంది డాక్టర్ మహాలక్ష్మి. కోవిడ్ కాలం వచ్చాక ఆమె కోవిడ్ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తూ గత సంవత్సరకాలంగా ప్రాణాలు కాపాడుతోంది. ‘నేను బతికి ఉండటం వల్లే వారిని బతికించగలుగుతున్నాను’ అంటుంది ఆమె. అవును... జీవితంలో ఆత్మహత్య చేసుకోవడానికి కావలసిన అన్ని కారణాలు ఆమె దగ్గర ఉన్నాయి. కాని ఆమె చావును కాకుండా బతుకును ఎంచుకుంది. బతుకులోనే అందం, ఆనందం, పరమార్థం ఉన్నాయని నిశ్చయించుకుంది. బతికి సాధించాలనేది ఆమె తత్త్వం. ఇవాళ కొంతమంది గృహిణులు చిన్న చిన్న కారణాలకే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలతో సహా విపరీతమైన నిర్ణయాలను తీసుకోవడం కనిపిస్తూ ఉంది. అలాంటి ఆలోచనలు ఉన్నవారు ప్రతికూలతలను ఎదుర్కొనే మనోబలాన్ని పెంచుకోవాలని అంటుంది మహాలక్ష్మి. 2001లో యాసిడ్ దాడి మైసూర్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసిన మహాలక్ష్మి తన 26వ ఏట ఒక అద్దె ఇంటి లో క్లినిక్ మొదలెట్టింది. దాని యజమాని చిక్క బసవయ్య ఆమెను లైంగికంగా వేధించడం మొదలెట్టాడు. అది భరించలేని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చి క్లినిక్ ఖాళీ చేసి వేరే చోట ప్రారంభించింది. ఇది చూసి ఓర్వలేని చిక్కబసవయ్య జనవరి 11, 2001న ఆమె క్లినిక్ మూసి ఇంటికి వెళుతుండగా ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. ఆ యాసిడ్ దాడి సరిగ్గా ఒక 60 సెకన్లలో ముగిసి ఉంటుంది. కాని అది ఆమె జీవితాన్నే మార్చేసింది. 25 సర్జరీలు ‘ముఖం వికారంగా ఉంటే ఈ సమాజంలో ఆదరణ ఉండదు. అటువంటివారు నాలుగు గోడల మధ్య మగ్గిపోవాల్సిందే. కాని నేనలా ఉండదలుచుకోలేదు. 25 సర్జరీలు చేయించుకుని ఎంతవరకు ముఖాన్ని సరి చేసుకోగలనో అంత చేయించుకున్నాను. ఆ సమయంలో డిప్రెషన్ చుట్టుముట్టింది. బతుకు మీద ఆశ సన్నగిల్లింది. కాని బతకాలనే నిశ్చయించుకున్నాను. నేను నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూ ఈ కష్టాన్ని మర్చిపోవాలని అనుకున్నాను. వైద్యవృత్తి అభ్యసించిన నేను నా మానసిక భౌతిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చో గట్టిగా ఆలోచించాను. నిజానికి యాసిడ్ దాడిలో గాని ఇతర ఏ ఆరోగ్య సమస్యల్లోగాని జీవిత సమస్యల్లో గాని మానసిక బలమే ముఖ్యం అని గ్రహించాను. ఆ మనసును గట్టి చేసుకుంటే మనం కష్టాలు దాటొచ్చు. నేను అదే చేశాను’ అంటుంది మహాలక్ష్మి. 2001లో ఆమెపై దాడి జరిగితే 2005లో సెషన్స్ కోర్టు ఆధారాల్లేవని నిందితుణ్ణి వదిలిపెట్టింది. కాని మహాలక్ష్మి హైకోర్టులో పోరాడింది. 2012లో హైకోర్టు చిక్కబసవయ్యకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘అంతవరకూ నేను కేసు ను గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగింది’ అంటుంది మహాలక్ష్మి. చదువే శరణ్యం ‘స్త్రీలు బాగా చదువుకోవాలి. జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ఎదిరించాలంటే మన దగ్గర చదువు ఉండాలి. అప్పుడే మనం మరింత ధైర్యంగా ఉండగలం. అంతేకాదు మనకు జరిగే ఎటువంటి అన్యాయం పైన అయినా పోరాటం చేయగలం. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి’ అంటుంది మహాలక్ష్మి. ‘నేను జీవితంలో ఎన్నడూ నిరాశను దగ్గరకు రానిచ్చేలా ఉండకూడదు అని నిశ్చయించుకున్నాను. ఆశతో ఉంటే అన్నీ మారుతాయి’ అంటుంది మహాలక్ష్మి. సవాళ్లను ఎదుర్కొనే సందర్భాలు వస్తే మానసిక స్థయిర్యంతో ఎదుర్కొనాలి తప్ప మరణాన్ని ఆశ్రయించకూడదని మహాలక్ష్మి జీవితం గట్టిగా చెబుతోంది. స్త్రీలు బాధితులయ్యి తల దించుకునే పరిస్థితి సమాజంలో ఉంటుంది. కాని మన పైన పీడన చేసేవారే తల దించుకునేలా చేయాలి. అందుకు సమాజంలో మార్పు రావాలి. -
కోవిడ్‌పై కొత్త ఆయుధం!
వాషింగ్టన్: కోవిడ్ చికిత్సకు వాడుతున్న రెమిడెస్విర్ మందు రూపురేఖలు మార్చేందుకు అమెరికన్ కంపెనీ గిలియాడ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాడుల్లోకి నేరుగా ఎక్కించడం కాకుండా నెబ్యులైజర్ సాయంతో ఊపిరి ద్వారా శరీరాలోకి ప్రవేశించేలా చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. తద్వారా రెమిడెస్‌విర్‌ను ఆసుపత్రుల్లోనే అందించాల్సిన అవసరం తప్పిపోతుంది. కోవిడ్–19 చికిత్సకు ప్రస్తుతానికి ఏ మందు అందుబాటులో లేని నేపథ్యంలో ఎబోలా వైరస్ చికిత్సకు ఉపయోగించిన రెమిడెస్విర్, జలుబు కోసం తయారైన ఫావిపిరవిర్‌లను ప్రయోగాత్మకంగా వాడుతున్న విషయం తెలిసిందే. తీవ్రస్థాయి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో రెమిడెస్‌విర్‌ను ఇవ్వాలన్నది ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి. ఆస్తమా లక్షణాలను మందగింప జేసేందుకు వాడే నెబ్యులైజర్ ద్వారా రెమిడెస్‌విర్‌ను అందించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో ఇచ్చే మందు సక్రమంగా పనిచేస్తుందా? ఆశించిన ఫలితాలు ఇస్తుందా? లేదా? అన్నది పరిశీలిచేందుకు గిలియాడ్ తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టింది. సుమారు 60 మంది రోగులకు కొత్త పద్ధతిలో మందు అందించి పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చేరాల్సినంత స్థాయిలో అనారోగ్యం లేనివారిపై జరిగే ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతానికే నేరుగా మందు వెళుతుందని తద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు గిలియాడ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెర్దాడ్ పార్సే తెలిపారు. -
త్వరగానే కోలుకుంటా
బాలీవుడ్ యాక్టర్ రిషీ కపూర్ అనారోగ్య సమస్యలతో అమెరికాలో వైద్య చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బాలీవుడ్లో వార్తలొచ్చినప్పటికీ కపూర్ ఫ్యామిలీ మాత్రం వాటిని కొట్టిపారేసింది. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని షేర్ చేసుకున్నారు రిషీ. ‘‘ప్రస్తుతం చికిత్స జరుగుతోంది. త్వరలోనే కోలుకుంటాను. చికిత్స పూర్తి కాగానే ఇండియా వచ్చేస్తాను. ఎందుకంటే ఈ ప్రక్రియ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. చాలా ఓపిక కావాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఏ సినిమాను అంగీకరించదలచుకోలేదు. కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను’’ అన్నారు. -
చివరి స్టెప్ వరకూ పోరాడతా
‘చెప్పమ్మ.. చెప్పమ్మ.. చెప్పేసెయంటుంది ఓ ఆరాటం’, ‘దాయి దాయి దామ్మా..’ ‘నువ్వు నువ్వు.. నువ్వూ.. నువ్వూ’.. ఈ పాటలు వింటున్నప్పుడు కళ్ల ముందు సోనాలి బింద్రే ముగ్ధ మనోహర రూపం కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బుధవారం ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇది చదివిన ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు. ‘‘కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మన ముందుకొస్తుంది. రీసెంట్గా క్యాన్సర్ ఉన్నట్టు తెలుసుకున్నాను. ఏదో చిన్న నొప్పి అని హాస్పిటల్‌కి వెళ్తే టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్ అని తెలిసింది. ఇలాంటిది ఒకటి జరుగుతుందని అసలు ఊహించలేదు. నా ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు నాకు కావాల్సినంత ప్రేమను, సపోర్ట్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ప్రతి స్టెప్‌లోనూ ఫైట్ చేయగలను అనే నమ్మకాన్ని నా ఆప్తులు క్రియేట్ చేశారు. నాకున్న ధైర్యం (ఫ్యామిలీ, ఫ్రెండ్స్)ని చూసుకొని ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు సోనాలి. 2002లో హిందీ దర్శక–నిర్మాత గోల్డీ బెహల్ని పెళ్లి చేసుకున్నారు సోనాలి. ఆ తర్వాత చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ (2004)లో నటించారు. హీరోయిన్గా సోనాలి చేసిన చివరి సినిమా ఇదే. ఆ తర్వాత మరాఠీలో ‘అగ్ బాయీ అరేచ్చా’, హిందీలో ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై దొబారా’ (2013) చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. ప్రస్తుతం ‘ఇండియాస్ బెస్ట్ డ్రేమ్బాజ్’ అనే హిందీ టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అనుకోని ఈ సంఘటన వల్ల ఈ షోని ఆమె డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. క్యాన్సర్ మహమ్మారి నుండి సోనాలి పూర్తిగా బయటపడి, ఆరోగ్యంగా ఇండియా తిరిగి రావాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. -
జేజెమ్మకు కేరళలో చికిత్స
తమిళసినిమా: అరుంధతి చిత్రంతో ప్రత్యేక ముద్ర వేసుకుని జేజెమ్మగా అభిమానుల జేజేలు అందుకున్న నటి అనుష్క. ఆ చిత్రం తరువాత ఈ యోగా సుందరి జీవితమే మారిపోయింది. అదే వరుసలో రుద్రమదేవి, బాహుబలి వంటి చారిత్రక కథా చిత్రాల్లో అద్భుత నటనను ప్రదర్శించిన అనుష్క ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు. ఇది ఈ బ్యూటీ అభిమానులకు నిరుత్సాహానిచ్చే విషయమే. అవకాశాలు లేక, వచ్చిన వాటిని అంగీకరించక ఇలాంటి పరిస్థితి అన్న ప్రశ్నకు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయమై అనుష్క నుంచి సరైన బదులు రావడం లేదు.అయితే ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం బరువు పెరిగిన ఈ బ్యూటీ ఆ తరువాత దాన్ని తగ్గించుకోవడానికి చాలా తంటాలే పడాల్సి వచ్చిందన్నది నిజం. ఎట్టకేలకు బరువు తగ్గి స్లిమ్‌గా తయారైందనే ప్రచారం జరుగుతోంది. అయినా ఇప్పటి వరకూ కొత్త చిత్రాన్ని అంగీకరించలేదు. అయితే తను చాలాకాలంగా నటిస్తున్న భాగమతి చిత్రాన్ని ఇటీవలే పూర్తి చేసుకుంది. చిత్రాన్ని జనవరితో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరగుతున్నట్లు సమాచారం. అనుష్కను నడుము నెప్పి చాలా కాలంగా వెంటాడుతోందట. అది తగ్గడానికి పలువురు పలు రకాల సలహాలు ఇచ్చారట. కొందరు ఆయుర్వేద చికిత్స ఉత్తమమని సూచించారట. ప్రస్తుతం అనుష్క కేరళలో నడుము నొప్పికి చికిత్స పొందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అయితే ఇందులో వాస్తవం ఎంతన్నది తెలియాల్సి ఉంది.కాగా అనుష్కను అజిత్‌కు జంటగా విశ్వాసం చిత్రంలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఒక ప్రచారం జరగుతోంది. అయితే చిత్ర వర్గాలు మాత్రం హీరోయిన్ విషయంలో గోప్యం పాటిస్తున్నారు. దీంతో అనుష్క నూతన చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. -
చికిత్సకు రూ.50 లక్షలు అవుతుందన్నారు!
న్యూఢిల్లీ: తన శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని మాక్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చెప్పినట్లు తండ్రి ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నొప్పులు రావడంతో తన భార్య వర్ష(20)ను నవంబర్ 27న మాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లామని కడుపులోని ఇద్దరు శిశువులు బతికే అవకాశాలు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉన్నట్లు తొలుత వైద్యులు తెలిపారన్నారు. రూ.35వేల విలువచేసే మూడు ఇంజెక్షన్లు ఇస్తే చిన్నారులు బతికే అవకాశం 30 శాతం ఉంటుందని వైద్యులు తనతో చెప్పారన్నారు. ఇంతలో ఒక శిశువు మరణించగా, మరో శిశువుకు ప్రాణాపాయం తప్పేవరకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయమై తాను కుటుంబ సభ్యులతో చర్చిస్తుండగానే రెండో చిన్నారి కూడా చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది శిశువుల మృతదేహాలను పాలిథిన్ సంచిలో తల్లిదండ్రులకు అప్పగించగా, వారిని ఖననం చేసే సమయంలో ఒకరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే మరో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. -
వెన్ను విరిగి.. జీవచ్ఛవాల్లా..!!
సాక్షి, కామారెడ్డి : వారు అందరిలా సరదాగా ఆనందంగా గడిపినవాళ్లే.. సొంతకాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించినవారే.. కానీ విధి వంచితులయ్యారు.. ప్రమాదాల బారిన పడి వెన్ను విరిగి మంచాన పడ్డారు. ఏళ్ల తరబడిగా మంచంపై జీవచ్ఛవాల్లా బతుకుతూ నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నారు. వైద్యం కోసం నెలకు రూ.5 వేలపైనే ఖర్చవుతుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సేవలు చేసేవారు లేక కొందరు.. వైద్యానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఇంకొందరు మానసికంగా కుంగిపోతున్నారు. తమను సర్కారే ఆదుకోవాలని కోరుతున్నారు. వివిధ ప్రమాదాల్లో ఇలా వెన్ను విరిగి అష్టకష్టాలు పడుతున్నవారు రాష్ట్రంలో 4 వేల పైచిలుకు ఉన్నట్లు అంచనా. బంగ్లా పైనుంచి పడి.. కామారెడ్డిలో వివేకానందకాలనీకి చెందిన శోభ(40), సిద్ధరాంరెడ్డి దంపతులు. వారికి ఒక కుమారుడు. 2000 అక్టోబర్ 17న శోభ బంగ్లాపై నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిపోయింది. వెన్నుపూస విరిగి మంచానికే పరిమితమైంది. దాదాపు రూ.5 లక్షలు ఖర్చు చేసినా లాభం లేకపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. భర్తే నిత్యం సపర్యలు చేస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లోనే.. వెన్నెముక పనిచేయక మంచానికే పరిమితమైన వారిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారే ఉన్నారు. విద్యుత్ స్తంభాలు, భవనాలు, తాటిచెట్లపై నుంచి కింద పడి వెన్నుముక విరిగినవారూ ఉన్నారు. వీరంతా తిరిగి కోలుకోవడం దాదాపు కష్టమే. జీవితాంతం మరొకరిపై ఆధారపడాల్సిందే. ఈ దుస్థితికి తోడు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో చిత్రవధ అనుభవిస్తున్నారు. చాలా మందికి కనీసం వీల్చైర్లు లేవు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటే వీల్‌చైర్‌పై కూర్చోబెడితే ఓ గంటో, రెండు గంటలో కుర్చీపై అటూ ఇటూ కొంత తిరగగలుగుతారు. కానీ ఆర్థిక స్తోమత లేని ఎందరో వాటిని కొనలేక మంచాలకే పరిమితమవుతున్నారు. 24 గంటలు మంచంపైనే ఉండటం వల్ల రకరకాల పుండ్లు పడి మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు మలమూత్ర విసర్జన స్పృహ కూడా తెలియని స్థితిలో బాధపడుతున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన షఫీ హైమద్‌ఖాన్ (49) జర్నలిస్టుగా పనిచేసేవారు. 2001 జనవరి 13న జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుముక విరిగింది. 589 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇప్పుడు భార్య అన్ని సపర్యలు చేస్తూ ఆయన్ను కాపాడుకుంటోంది. ఒత్తిడిని అధిగమించిన షఫీ ఆత్మస్థైర్యంతో బతుకుతున్నారు. నలుగురికి ధైర్యం చెబుతున్నారు. ఇప్పటి దాకా 70 మంది వెన్నెముక బాధితులను కలిసి వారిలో ధైర్యం నూరిపోశారు. మామిడి కాయలు తెంపబోయి.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన నర్సాపురం పెద్ద లింగం(45)కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఆయన 2009లో మామిడి కాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. బతకడం కష్టమని వైద్యులు చెప్పారు. కానీ ఆయన భార్య లక్ష్మి ముంబైలోని జేజే ఆస్పత్రికి తీసుకెళ్లింది. రూ.2 లక్షల వరకు ఖర్చయ్యాయి. అక్కడ రూ.5 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో.. నిస్సహాయంగా ఇంటికి తిరిగివచ్చారు. ఆయనకు కూడా నడుము కింది భాగం స్పర్శను కోల్పోయింది. భార్యే సేవలు చేస్తోంది. సర్కారుపైనే ఆశ.. వెన్ను బాధితులు కేవలం మందులకే నెలకు రూ.2 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి అదనంగా వాటర్‌బెడ్, కుషన్, యూరినల్ బ్యాగులు, సర్జికల్ స్పిరిట్, సర్జికల్ టేప్, యాంటీబయాటిక్ పౌడర్లు, కాటన్, తదితరాలన్నీ కొనుగోలు చేయాలి. మొత్తంగా సరాసరిగా నెలకు రూ.5 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోంది. సీఎం కేసీఆర్ ఎందరినో ఆదుకుంటున్నారని, తమపైనా దృష్టి సారించాలని వీరు అభ్యర్థిస్తున్నారు. వాటర్‌బెడ్‌లు, వీల్చైర్లు, వాటర్ కుషన్లు, మందులు, సామగ్రి, కుటుంబ పోషణకు సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉచితంగా మందులు, వైద్యం అందించాలని కోరుతున్నారు. -
నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు
బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం వైద్యసేవలందించని ఆస్పత్రులు ఆందోళనలో రోగులు కరీంనగర్ హెల్త్ : జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందకపోవడంతో చేసేదేమిలేక తిరుగుముఖం పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం బిల్లులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బిల్లులు మంజూరు చేయాలని నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి విన్నవించినా స్పందన కరువైంది. దీంతో ఈనెల 1 నుంచి ఆయా ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. జిల్లాలో 22 ఆస్పత్రులు జిల్లాలో 22 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. ఆయా హాస్పిటల్స్‌కు దాదాపు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లుల విషయమై మూడు నెలల క్రితం నెట్వర్క్ హాస్పిటల్స్ సేవలు నిలిపివేశాయి. ఆ సమయంలో రూ.200కోట్లు ఇస్తామని, పది రోజుల్లో మొత్తం చెల్లిస్తామనిౖ వెద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం రూ.250కోట్లు విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న అసోసియేషన్‌కు స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు సేవలు నిలిపివేశారు. బిల్లులు తమ ఖాతాల్లో పడేవరకు సేవలందించేది లేదని నెట్వర్క్ హాస్పిటల్స్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. 20 శాతం మంది ఆరోగ్యశ్రీ సేవలు జిల్లాలో దాదాపు 20 శాతం మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారు ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు అర్హులు. జిల్లాలోని 22 ఆస్పత్రుల్లో ప్రతిరోజు 10 మంది వరకు ఓపీ, ఇద్దరు ఎమర్జెన్సీ సేవలు పొందుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 20 ఓపీలు, నలుగురికి వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవే.. జిల్లాలో 22 నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు, ప్రతిమ మెడికల్ కళాశాల, అమృత నర్సింగ్ హోమ్, భూంరెడ్డి, వెంకటేశ్వర కిడ్నీ సెంటర్, సరోజిని హాస్పిటల్, సుశృత క్యాన్సర్, అపోలో రీచ్, పబ్బా సూపర్‌స్పెషాలిటీ, సూర్య నర్సింగ్‌హోమ్, మ్యాక్స్‌క్యూర్, శ్రీలక్ష్మి, ఆదర్శ ఆస్పత్రులు ఉన్నాయి. జగ్యితాల, గోదావరిఖని, సిరిసిల్లల్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జమ్మికుంటలోని శ్రీరామ మల్టీస్పెషాలిటీ, జగిత్యాలలోని గీతా ఆర్థోపెడిక్ అండ్ మెటర్నిటీ నర్సింగ్‌హోమ్, అమృత త్రినేత్ర మల్టీస్పెషాలిటీ, పెద్దపల్లి విజయ హాస్పిటల్, మెట్‌పల్లిలోని సాయి సంజీవనిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. ఇబ్బందిగా ఉంది – నేదూరి నర్సయ్య, చింతలఠాణ(సిరిసిల్ల) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో వైద్యం చేయలేమని, మందులు ఇవ్వమని డాక్టర్ అంటున్నాడు. పేదలకు ఎంతో ఉపయోగపడే ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండొద్దు. బిల్లులు చెల్లించి వైద్యసేవలు అందేలా చూడాలి. ఇంత నిర్లక్ష్యమా? – రాము,రోగి బంధువు, పెద్దపల్లి పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు. హాస్పిటల్స్‌కు బిల్లులు మంజూరు చేసి వైద్యం అందేలా చూడాలి. ఎంతో దూరం నుంచి వస్తే వైద్యసేవలందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. కొన్ని ఆస్పత్రుల్లో.. – డాక్టర్ నాగశేఖర్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. అక్కడికి పంపించి వైద్యసేవలు అందించేలా చూస్తున్నాము. ప్రస్తుతం సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు. -
వైద్యానికి డబ్బులు డిమాండ్
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అనాథ వృద్ధురాలు డీసీహెచ్ఎస్ విచారణ ఉచితంగా వైద్యసేవలందిస్తామని వైద్యుల హామీ లంచాల కోసం పీడిస్తే చర్యలు: డీసీహెచ్ఎస్ కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడానికి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ అనాథ వృద్ధురాలు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సమన్వయకర్త(డీసీహెచ్ఎస్) అశోక్‌కుమార్ ఆస్పత్రిలో మంగళవారం విచారణ జరిపారు. సూరం లక్ష్మి అనే వృద్ధురాలిని ఆమె భర్త నారాయణ చాలాకాలం క్రితం వదిలేశాడు. వీరికి సంతానంలేదు. లక్ష్మి కొంతకాలంగా తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర నిత్యన్నదాన వేదికలో ఆశ్రయం పొందుతోంది. ఈ నెల 25న ఆశ్రమంలో గిన్నెలు తోముతున్న క్రమంలో కాలుజారి కిందపడింది. దీంతో కుడికాలు విరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేమని, అవసరమయ్యే రాడ్ కోసం రూ.10వేలు ఇస్తేనే ఆపరేషన్ చేస్తామని ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపిస్తూ లక్ష్మి బంధువులు సోమవారం కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. డబ్బులు డిమాండ్ చేయలేదు: డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి బాధితురాలిని పరిశీలించిన డీసీహెచ్ఎస్ మంగళవారం బాధితురాలి బంధువులు, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో సమస్యపై చర్చించారు. వృద్ధురాలికి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పానని, రాడ్ తీసుకురావడానికి రూ.5వేలవరకు ఖర్చు అవుతుందని మాత్రమే వారికి సలహా ఇచ్చానని డాక్టర్ వివరణ ఇచ్చారు. తను డబ్బులు ఎవరినీ డిమాండ్ చేయలేదని తెలిపారు. ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాం వృద్ధురాలి కాలుకు ఉచితంగా ఆపరేషన్ చేయడంతోపాటు అవసరమైన రాడ్‌ను కూడా ఆస్పత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి తెప్పిస్తామని డీసీహెచ్ఎస్ స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూపరింటెండెంట్ సూర్యశ్రీని ఆదేశించారు. ఉచితంగా ఆపరేషన్ చేయిస్తే చాలంటూ బంధువులు విజ్ఞప్తి చేశారు. లంచాల కోసం పీడిస్తే చర్యలు ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేదల నుంచి లంచాల కోసం వస్తే చర్యలు తీసుకుంటామని డీసీహెచ్ఎస్ అశోక్‌కుమార్ హెచ్చరించారు. డబ్బుల కోసం రోగులను వేధిస్తున్నారని ఈ నెల 14న ‘ఖని’ ధర్మాస్పత్రిలో రాబందులు’ అనే కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపైనా డీసీహెచ్ఎస్ విచారణ జరిపారు. ప్రసవం కోసం వచ్చిన అనూష అనే గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి రూ.వెయ్యి డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు వైద్య సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వైద్యం చేయనందుకు డాక్టర్ని కాల్చిచంపాడు
డెహ్రాడూన్: అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడికి చికిత్స చేయడానికి నిరాకరించిన డాక్టర్ ను ఓ వ్యక్తి కాల్చిచంపిన ఘటన ఉత్తరాఖండ్ లోని ఉద్ధవ్ సింగ్ నగర్ లో చోటు చేసుకుంది. సీనియర్ ఎస్పీ అనంత్ శంకర్ తక్ వాలే కథనం ప్రకారం.. నగరానికి చెందిన మానిక్ రాఠీ కుమారుడు (ఏడాదిన్నర వయసు) అతిసార వ్యాధితో బాధపడుతున్నాడు. మానిక్ రాఠీ తన కుమారుడిని తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యునిగా పని చేస్తున్న ఎస్ కే సింగ్ ఇంటికి వెళ్లాడు. తన కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యం చేయమని కోరాడు. ఆ డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరించడంతో ఇతర వైద్యులను సంప్రదించాడు. అప్పటికే కొడుకు మృతిచెందడంతో మానిక్ రాఠీ ఆగ్రహించాడు. ఎస్ కే సింగ్ ను తుపాకీతో కాల్చి చంపాడు. గతంలో రాఠీపై ఆర డజను కేసులున్నాయని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని అనంత్ శంకర్ తెలిపారు.