వైద్యానికి డబ్బులు డిమాండ్
-
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన అనాథ వృద్ధురాలు
-
డీసీహెచ్‌ఎస్ విచారణ
-
ఉచితంగా వైద్యసేవలందిస్తామని వైద్యుల హామీ
-
లంచాల కోసం పీడిస్తే చర్యలు: డీసీహెచ్‌ఎస్
కోల్‌సిటీ: గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడానికి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ అనాథ వృద్ధురాలు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసింది. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల నిర్వహణ సమన్వయకర్త(డీసీహెచ్‌ఎస్) అశోక్‌కుమార్ ఆస్పత్రిలో మంగళవారం విచారణ జరిపారు. సూరం లక్ష్మి అనే వృద్ధురాలిని ఆమె భర్త నారాయణ చాలాకాలం క్రితం వదిలేశాడు. వీరికి సంతానంలేదు. లక్ష్మి కొంతకాలంగా తిలక్‌నగర్‌లోని శ్రీధర్మశాస్త్ర నిత్యన్నదాన వేదికలో ఆశ్రయం పొందుతోంది. ఈ నెల 25న ఆశ్రమంలో గిన్నెలు తోముతున్న క్రమంలో కాలుజారి కిందపడింది. దీంతో కుడికాలు విరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయలేమని, అవసరమయ్యే రాడ్ కోసం రూ.10వేలు ఇస్తేనే ఆపరేషన్ చేస్తామని ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపిస్తూ లక్ష్మి బంధువులు సోమవారం కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ విచారణ జరపాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు.
డబ్బులు డిమాండ్ చేయలేదు: డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి
బాధితురాలిని పరిశీలించిన డీసీహెచ్‌ఎస్ మంగళవారం బాధితురాలి బంధువులు, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో సమస్యపై చర్చించారు. వృద్ధురాలికి ఉచితంగా ఆపరేషన్ చేస్తానని చెప్పానని, రాడ్ తీసుకురావడానికి రూ.5వేలవరకు ఖర్చు అవుతుందని మాత్రమే వారికి సలహా ఇచ్చానని డాక్టర్ వివరణ ఇచ్చారు. తను డబ్బులు ఎవరినీ డిమాండ్ చేయలేదని తెలిపారు.
ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాం
వృద్ధురాలి కాలుకు ఉచితంగా ఆపరేషన్ చేయడంతోపాటు అవసరమైన రాడ్‌ను కూడా ఆస్పత్రి నిధుల నుంచి కొనుగోలు చేసి తెప్పిస్తామని డీసీహెచ్‌ఎస్ స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూపరింటెండెంట్ సూర్యశ్రీని ఆదేశించారు. ఉచితంగా ఆపరేషన్ చేయిస్తే చాలంటూ బంధువులు విజ్ఞప్తి చేశారు.
లంచాల కోసం పీడిస్తే చర్యలు
ఆస్పత్రికి వైద్యం కోసం వస్తున్న పేదల నుంచి లంచాల కోసం వస్తే చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎస్ అశోక్‌కుమార్ హెచ్చరించారు. డబ్బుల కోసం రోగులను వేధిస్తున్నారని ఈ నెల 14న ‘ఖని’ ధర్మాస్పత్రిలో రాబందులు’ అనే కథనం ‘సాక్షి’లో ప్రచురితమైంది. దీనిపైనా డీసీహెచ్‌ఎస్ విచారణ జరిపారు. ప్రసవం కోసం వచ్చిన అనూష అనే గర్భిణి కుటుంబ సభ్యుల నుంచి రూ.వెయ్యి డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలకు వైద్య సిబ్బంది నుంచి వివరణ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునారవృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.