నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు | stoped arogyasri services | Sakshi
Sakshi News home page

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

Published Tue, Oct 4 2016 9:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:22 PM

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు - Sakshi

నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు

  • బిల్లులు మంజూరు చేయని ప్రభుత్వం
  • వైద్యసేవలందించని ఆస్పత్రులు
  • ఆందోళనలో రోగులు
  • కరీంనగర్‌ హెల్త్‌ : జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందకపోవడంతో చేసేదేమిలేక తిరుగుముఖం పడుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం బిల్లులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బిల్లులు మంజూరు చేయాలని నెట్‌వర్క్‌ హాస్పిటల్‌ అసోసియేషన్‌ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డికి విన్నవించినా స్పందన కరువైంది. దీంతో ఈనెల 1 నుంచి ఆయా ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. 
    జిల్లాలో 22 ఆస్పత్రులు
    జిల్లాలో 22 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. ఆయా హాస్పిటల్స్‌కు దాదాపు రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది. బిల్లుల విషయమై మూడు నెలల క్రితం నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ సేవలు నిలిపివేశాయి. ఆ సమయంలో రూ.200కోట్లు ఇస్తామని, పది రోజుల్లో మొత్తం చెల్లిస్తామనిౖ వెద్య ఆరోగ్యశాఖ మంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం రూ.250కోట్లు విడుదల చేసినట్లు ప్రచారంలో ఉన్న అసోసియేషన్‌కు స్పష్టమైన హామీ రాలేదు. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు సేవలు నిలిపివేశారు. బిల్లులు తమ ఖాతాల్లో పడేవరకు సేవలందించేది లేదని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. 
    20 శాతం మంది ఆరోగ్యశ్రీ సేవలు
    జిల్లాలో దాదాపు 20 శాతం మంది ఆరోగ్యశ్రీ సేవలు పొందుతున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉన్న వారు ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు అర్హులు. జిల్లాలోని 22 ఆస్పత్రుల్లో ప్రతిరోజు 10 మంది వరకు ఓపీ, ఇద్దరు ఎమర్జెన్సీ సేవలు పొందుతున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో 20 ఓపీలు, నలుగురికి వివిధ రకాల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.  
    నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ఇవే..
    జిల్లాలో 22 నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు, ప్రతిమ మెడికల్‌ కళాశాల, అమృత నర్సింగ్‌ హోమ్, భూంరెడ్డి, వెంకటేశ్వర కిడ్నీ సెంటర్, సరోజిని హాస్పిటల్, సుశృత క్యాన్సర్, అపోలో రీచ్, పబ్బా సూపర్‌స్పెషాలిటీ, సూర్య నర్సింగ్‌హోమ్, మ్యాక్స్‌క్యూర్, శ్రీలక్ష్మి, ఆదర్శ ఆస్పత్రులు ఉన్నాయి.  జగ్యితాల, గోదావరిఖని, సిరిసిల్లల్లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జమ్మికుంటలోని శ్రీరామ మల్టీస్పెషాలిటీ, జగిత్యాలలోని గీతా ఆర్థోపెడిక్‌ అండ్‌ మెటర్నిటీ నర్సింగ్‌హోమ్, అమృత త్రినేత్ర మల్టీస్పెషాలిటీ, పెద్దపల్లి విజయ హాస్పిటల్, మెట్‌పల్లిలోని సాయి సంజీవనిలో ఆరోగ్య శ్రీ సేవలు అందుతున్నాయి. 
    ఇబ్బందిగా ఉంది
    – నేదూరి నర్సయ్య, చింతలఠాణ(సిరిసిల్ల)
    ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడంతో వైద్యం చేయలేమని, మందులు ఇవ్వమని డాక్టర్‌ అంటున్నాడు. పేదలకు ఎంతో ఉపయోగపడే ఆరోగ్యశ్రీ సేవలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండొద్దు. బిల్లులు చెల్లించి వైద్యసేవలు అందేలా చూడాలి.  
     
    ఇంత నిర్లక్ష్యమా?
     – రాము,రోగి బంధువు, పెద్దపల్లి 
    పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదు. హాస్పిటల్స్‌కు బిల్లులు మంజూరు చేసి వైద్యం అందేలా చూడాలి. ఎంతో దూరం నుంచి వస్తే వైద్యసేవలందకపోవడంతో ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి.
     
    కొన్ని ఆస్పత్రుల్లో..
    – డాక్టర్‌ నాగశేఖర్, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌
    కొన్ని నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. అక్కడికి పంపించి వైద్యసేవలు అందించేలా చూస్తున్నాము. ప్రస్తుతం సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement