న్యూఢిల్లీ: తన శిశువుకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని మాక్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి చెప్పినట్లు తండ్రి ఆశిష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నొప్పులు రావడంతో తన భార్య వర్ష(20)ను నవంబర్ 27న మాక్స్ ఆస్పత్రికి తీసుకెళ్లామని కడుపులోని ఇద్దరు శిశువులు బతికే అవకాశాలు 10 నుంచి 15 శాతం మాత్రమే ఉన్నట్లు తొలుత వైద్యులు తెలిపారన్నారు. రూ.35వేల విలువచేసే మూడు ఇంజెక్షన్లు ఇస్తే చిన్నారులు బతికే అవకాశం 30 శాతం ఉంటుందని వైద్యులు తనతో చెప్పారన్నారు.
ఇంతలో ఒక శిశువు మరణించగా, మరో శిశువుకు ప్రాణాపాయం తప్పేవరకు ఆస్పత్రిలో చికిత్స అందించడానికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయమై తాను కుటుంబ సభ్యులతో చర్చిస్తుండగానే రెండో చిన్నారి కూడా చనిపోయినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఆస్పత్రి సిబ్బంది శిశువుల మృతదేహాలను పాలిథిన్ సంచిలో తల్లిదండ్రులకు అప్పగించగా, వారిని ఖననం చేసే సమయంలో ఒకరు ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించడంతో వెంటనే మరో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment