న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ వివేక్ రాయ్ ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నిపంది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్న వైద్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కళ్ళముందే బాధితులు పిట్టల్లా రాలిపోతోంటే..తట్టుకోలేక కన్నీరు పెడుతున్నారు. ఇంతిటి విషాదకర పరిస్థితుల్లో ఒక వైద్యుడు ఏకంగాప్రాణాల్నే తీసుకోవడం కలకలం రేపింది. రెండు నెలల గర్భిణీగా ఉన్న భార్య పరిస్థితిని సైం మర్చిపోయి ఉసురుకున్న వైనం మహమ్మారి సృష్టిస్తున్న విలయానికి అద్దం పడుతోంది.
తాజాగా ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ కు చెందిన డాక్టర్ వివేక్ రాయ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. వివేక్ రాయ్ ఢిల్లీలోని మాళవీయనగర్ లో నివాసం ఉంటూ సౌత్ ఢిల్లీకి చెందిన మ్యాక్స్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వివేక్ రాయ్ మనోవేదనకు గురైనట్లు తోటి వైద్యులు తెలిపారు. గత ఏడాది నవంబరులో ఈయన వివాహం చేసుకోగా, ప్రస్తుతం ఈయన భార్య రెండు నెలల గర్భవతి. రాయ్ అకాలమరణంతో ఆయన కుటుంబ సభ్యులుతీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
ఎప్పటిలాగా ఆస‍్పత్రిలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన వివేక్ రాయ్ తన బెడ్ రూమ్‌లో చీరతో సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వివేక్ ఎంతకీ ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మాళవీయ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వివేక్ రాయ్ ఇంటి డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడగా గదిలో విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సౌత్ డీసీపీ అతుల్ కుమార్ ఠాకూర్ మాట్లాడుతూ 'వివేక్ రాయ్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో అతని ఇంటికి వెళ్లాం. అక్కడ బెడ్ రూమ్ గదిలో చీరతో ఉరివేసుకొని కనిపించారు. డాక్టర్ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇంట్లో సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో తన సన్నిహితులు, కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాసిన ఓ లేఖ దొరికింది. అనంతరం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కుటుంబసభ్యలకు అందించాం’అని అన్నారు.
కాగా భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ రికార్డు స్థాయిలో విజృంభిస్తుండడంతో ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. తాము ట్రీట్మెంట్ ఇచ్చిన బాధితులు కళ్లముందు ప్రాణాలు కోల్పోతుంటే అసహాయులై కృంగిపోతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు.ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం కరోనా సోకడం వల్లే సుమారు 800 మంది డాక్టర్లు ప‍్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment