చివరి స్టెప్‌ వరకూ పోరాడతా | Sonali Bendre diagnosed with cancer | Sakshi

చివరి స్టెప్‌ వరకూ పోరాడతా

Jul 5 2018 12:24 AM | Updated on Apr 3 2019 6:23 PM

Sonali Bendre diagnosed with cancer - Sakshi

సోనాలి బింద్రే

‘చెప్పమ్మ.. చెప్పమ్మ.. చెప్పేసెయంటుంది ఓ ఆరాటం’, ‘దాయి దాయి దామ్మా..’ ‘నువ్వు నువ్వు.. నువ్వూ.. నువ్వూ’.. ఈ పాటలు వింటున్నప్పుడు కళ్ల ముందు సోనాలి బింద్రే ముగ్ధ మనోహర రూపం కనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ బుధవారం ఓ షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సోనాలి సోషల్‌ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఇది చదివిన ఆమె అభిమానులు తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఆమె తన మనోభావాలను ఈ విధంగా వ్యక్తపరిచారు.

‘‘కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మన ముందుకొస్తుంది. రీసెంట్‌గా క్యాన్సర్‌ ఉన్నట్టు తెలుసుకున్నాను. ఏదో చిన్న నొప్పి అని హాస్పిటల్‌కి వెళ్తే టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్‌లో క్యాన్సర్‌ అని తెలిసింది. ఇలాంటిది ఒకటి జరుగుతుందని అసలు ఊహించలేదు. నా ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులు నాకు కావాల్సినంత ప్రేమను, సపోర్ట్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాను. ప్రతి స్టెప్‌లోనూ ఫైట్‌ చేయగలను అనే నమ్మకాన్ని నా ఆప్తులు క్రియేట్‌ చేశారు. నాకున్న ధైర్యం (ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌)ని చూసుకొని ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు సోనాలి.

2002లో హిందీ దర్శక–నిర్మాత గోల్డీ బెహల్‌ని పెళ్లి చేసుకున్నారు సోనాలి. ఆ తర్వాత చిరంజీవి ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ (2004)లో నటించారు. హీరోయిన్‌గా సోనాలి చేసిన చివరి సినిమా ఇదే. ఆ తర్వాత మరాఠీలో ‘అగ్‌ బాయీ అరేచ్చా’, హిందీలో ‘వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై దొబారా’ (2013) చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. ప్రస్తుతం ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్రేమ్‌బాజ్‌’ అనే హిందీ టీవీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అనుకోని ఈ సంఘటన వల్ల ఈ షోని ఆమె డిస్‌కంటిన్యూ చేయాల్సి వస్తుంది. క్యాన్సర్‌ మహమ్మారి నుండి సోనాలి పూర్తిగా బయటపడి, ఆరోగ్యంగా ఇండియా తిరిగి రావాలని ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement