భయానికి ఇక చోటు లేదు | Sonali Bendre on her cancer surgery | Sakshi
Sakshi News home page

భయానికి ఇక చోటు లేదు

Published Sun, Mar 3 2019 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sonali Bendre on her cancer surgery - Sakshi

సోనాలీ బింద్రే

సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్‌ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది షాకింగ్‌ మూమెంట్స్‌లో ఇదొకటి. క్యాన్సర్‌ అని తెలియగానే సోనాలీ ఎంత షాకయ్యారో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అంతే షాక్‌కి గురయ్యారు. ఎంత గొప్ప సమస్యను దాటగలిగితే అంత గొప్ప హీరో అయినట్టు, హీరోయిన్‌ సోనాలి క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని.. పోరాడి గెలిచి సూపర్‌ హీరోయిన్‌గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. క్యాన్సర్‌ చికిత్స జరుగుతున్నంత కాలం సోషల్‌ మీడియా ద్వారా విషయాలను షేర్‌ చేశారు. తాజాగా ‘ఇండియా టుడే కాంక్లేవ్‌ 2019’ కార్య క్రమంలో సోనాలి మనసు విప్పి, చాలా విషయాలు చెప్పారు. అవి ఆమె పోరాట పటిమను తెలియజేశాయి. సోనాలి మాటల్లో ఆ విశేషాలు..

క్యాన్సర్‌ను దాచదలచుకోలేదు
క్యాన్సర్‌ ఉందని తెలియగానే నా చుట్టూ వినిపించింది ఒక్కటే.. ‘నీ లైఫ్‌స్టైల్‌ చాలా బాగుంటుంది. నీకెందుకు ఇలా జరిగింది?’ అని. న్యూయార్క్‌లో సైకియాట్రిస్ట్‌తో మాట్లాడేంత వరకూ నా వల్లే క్యాన్సర్‌ వచ్చిందేమో అనే భ్రమలో నేను కూడా ఉండిపోయా. ‘‘నాకేం జరుగుతుందో నాకు అర్థం కావడంలేదు. నేను నెగటివ్‌ పర్సన్‌ని కాదు. నాది చాలా పాజిటివ్‌ లైఫ్‌ స్టైల్‌. ఒకవేళ నెగటివ్‌ ఆలోచనలు ఉన్నా కూడా వాటిని లోలోపలే దాచేసి బయటకు ఏం జరగనట్టు నటించేదాన్నా? నాకు అర్థం కావడంలేదు’’ అని సైకియాట్రిస్ట్‌తో చెప్పా.


ఆ రోజు ఆయనిచ్చిన సమాధానమే నాకు స్ఫూర్తి మంత్రాలయ్యాయి. క్యాన్సర్‌ను ఎదుర్కోగలన నే ఆశను పెంచాయి. ‘‘సోనాలీ.. క్యాన్సర్‌ అనేది జీన్స్‌ వల్ల కానీ వైరస్‌ వల్ల కానీ వస్తుంది. ఆలోచనల వల్ల కాదు. ఒకవేళ ఆలోచనలే క్యాన్సర్‌ బారినపడేట్టు చేసి లేదా క్యాన్సర్‌ నయం అయేట్టు చేస్తాయంటే, మాకంటే (సైకియాట్రిస్ట్‌) ధనవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మేం ఆలోచనలతో వ్యవహరించేవాళ్లం కదా’’ అని చెప్పారాయన. అప్పుడు క్యాన్సర్‌కి కారణం నేను కాదనే భ్రమలో నుంచి బయటపడ్డా.

అ నిమిషం నా మీద నుంచి కొన్ని వందల కేజీల బరువును మాటలతో తుడిచేసినట్టు అనిపించింది. క్యాన్సర్‌ను ఎదుర్కోగలను అనే నమ్మకం ఏర్పడింది. మనమేం తప్పు చేశామని ఆలోచించడం ఆపేశాను. అన్ని క్యాన్సర్‌లు ఒకలా ఉండవు. దాన్ని నయం చేసే ఫార్ములా ఒక్కో శరీరానికి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది క్యాన్సర్‌ వచ్చిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టాలని అనుకుంటారో అర్థం అయ్యేది కాదు. నేను దాచిపెట్టదలచుకోలేదు. నాకు ఇలా జరిగింది అని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని, భరోసాని కలిగించాయి

ఆ కారణమేంటో కనుక్కుంటా!
‘లైఫ్‌లో మళ్లీ పని చేస్తానో లేదో’ అని ఆలోచించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పడానికి ఇప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్‌ అవ్వను. నెక్ట్స్‌ ఏం చేయబోతున్నానో నాకు కచ్చితంగా తెలియదు. సినిమాల్లో నటిస్తానా? తెలియదు. కానీ నేను చేయాల్సిన పని మాత్రం కచ్చితంగా ఉందని నాకు అనిపిస్తోంది. లేకపోతే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు కదా. నేను మళ్లీ మామూలు మనిషి కావడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏంటో కనుక్కుంటా.


ఏడవకూడదని ప్రామిస్‌ చేసుకున్నా
ఎన్నో హెయిర్‌ ఆయిల్స్‌ని ప్రమోట్‌ చేశాను. కానీ నా హెయిర్‌ని నేను కోల్పోయాను. ఇంటి నుంచి బయటికు అడుగుపెట్టిన ప్రతిసారీ మన ఆ పాత హెయిర్‌ మనకు లేదు అనే ఫీలింగ్‌ వస్తుంది. ఆ భావన కాసేపే. జుత్తు సంగతి ఎలా ఉన్నా నా కనుబొమ్మలు మళ్లీ మామూలుగా అయినందుకు ఆ దేవుడికి కృజ్ఞతలు తెలపాలి. కళ్లకు పెట్టుకున్న ‘మస్కరా’ కరిగిపోతుంది కాబట్టి మనం ఏడవకూడదని నాకు నేను ప్రామిస్‌ చేసుకున్నా. ఇప్పుడు నేను చెబుతున్నవి చిన్న విషయాలే కావొచ్చు కానీ వాటి ప్రభావం చాలా ఉంటుంది. నిజానికి నేను మస్కరా పెట్టుకుని చాన్నాళ్లయింది. ఇప్పుడు మళ్లీ పెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది.

నా బ్రాండ్‌ అయిపోయింది
నటిగా నా కెరీర్‌లో ఎన్నో బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించాను. గ్లామర్‌ ఫీల్డ్‌లో లుక్సే ప్రధానం. సొసైటీలో కూడా కదా? నా కెరీర్‌ అంతా దాని చుట్టూనే తిరుగుతుంది. నాకు క్యాన్సర్‌ అని తెలుసుకున్నాక నా ప్రపంచం తల్లకిందులైంది. నా టీమ్‌ను పిలిచాను. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నాను అనే విషయాన్ని పంచుకున్నాను. ‘ఆరోగ్యకరమైన ఉత్పత్తులకు  ఇన్ని రోజులు అంబాసిడర్‌గా చేశాను. ఇప్పుడు నా బ్రాండ్‌ అయిపోయింది. నేను చికిత్స కోసం విదేశాలు వెళ్తున్నాను. చికిత్స తాలూకు పరిణామాలేంటో కూడా సరిగ్గా తెలియదు’ అని చెప్పా. వాళ్లంతా నాతో ఉంటానన్నారు, ఉన్నారు కూడా. జాలి, దయ నాకెట్టి పరిస్థితుల్లోనూ వద్దని వాళ్లతో స్ట్రిక్ట్‌గా చెప్పాను. వాటిని నేనస్సలు నమ్మను.


ఫ్యామిలీయే సపోర్ట్‌
నాకున్న పెద్ద సపోర్ట్‌ సిస్టమ్‌ నా ఫ్యామిలీయే. నా భర్త గోల్డీ బెహల్, సోదరి రూప నాకు చాలా సపోర్ట్‌గా నిలిచారు. ధైర్యం పంచారు. నాకు క్యాన్సర్‌ అని నిర్ధారణ అయినప్పుడు మా అబ్బాయి రణ్‌వీర్‌ స్కూల్‌ ట్రిప్‌లో ఉన్నాడు. వాడిని ఇంటికి పంపించకుండా నా దగ్గర (హాస్పటల్‌) కొన్ని రోజులు ఉంచాం. వాడి దగ్గర విషయం దాచలేదు. వాణ్ని మేమలా పెంచలేదు. నా వ్యాధి విషయం చెప్పగానే ‘ఇది కొంచెం టఫ్‌ టైమ్‌. కానీ మేం నీతో కలిసే ఉంటాం’ అని చెప్పాడు. నాకు కీమోథెరపీ చేసినప్పుడు ‘‘నీ శరీరం మొత్తం బ్లడ్, ట్యూబ్స్‌ ఉంటాయి అనుకున్నాను, మామూలుగానే ఉందే’’ అన్నాడు రణ్‌వీర్‌.

భర్త గోల్డీ బెహల్‌తో...

మానసిక బాధే కష్టం
చికిత్స జరిగినంత కాలం సాఫీగా సాగిపోయిందంటే నేను అబద్ధం చెబుతున్నట్టే. ఈ ప్రయాణంలో చాలా నొప్పి కూడా దాగుంది. సర్జరీ జరిగిన తర్వాత లైఫ్‌ చాలా టఫ్‌గా గడిచింది. నా శరీరం మీద ఆపరే షన్‌ తాలూకా 20 అంగుళాల మచ్చ ఉండిపోయింది. ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లే ముందు మా సిస్టర్‌ నన్ను కౌగిలించుకుంది. ‘మరీ అంత డ్రామా వద్దు. మళ్లీ తిరిగొస్తాను’ అని చెప్పా. కానీ ఎక్కడో ‘నా అబ్బాయికి, మా ఫ్యామిలీకి నేను ఉండనేమో?’ అనే ఆలోచనే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఆపరేషన్‌ జరిగి బయటకు రాగానే ‘నేను బతికే ఉన్నాను. శారీరక బాధ బాధే. ఆ బాధ సుదీర్ఘం కాదు. కానీ శారీరక బాధ కన్నా మానసిక బాధ మరింత బాధాకరం. అది మనిషిని కుంగదీస్తుంది’ అనిపించింది.

సోదరి రూపాతో...


కుమారుడు రణ్‌వీర్‌తో...


ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తా
ఇంతకు మునుపు ఏదైనా పని చేస్తున్నప్పుడు భయంగా అనిపిస్తే అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయం పోయింది. ఇంక నా జీవితంలో భయానికి చోటు లేదు. భయపడటమే మరిచానని నా ప్రయాణాన్ని చూసి తెలుసుకున్నాను. నటిగా నాకు తెలియని, ఎటువంటి పరిచయాలు లేని ఒక ఇండస్ట్రీకు వచ్చాను. సాధారణ మహారాష్ట్ర మిడిల్‌ క్లాస్‌ అమ్మాయి బాలీవుడ్‌లో హీరోయిన్‌ అవ్వాలనుకోవడం చాలా పెద్ద కల. చాలా కష్టంతో కూడుకున్న కల.

నా కల గురించి తెలుసుకొని మా ఇంట్లోవాళ్లు షాక్‌ అయ్యారు. కానీ అలాంటి పెద్ద కల కనడానికి నేను భయపడలేదు, నా సామర్థ్యాన్ని సందేహించలేదు. కానీ వాళ్లెందుకు భయపడ్డారో అన్న విషయం మేం తల్లిదండ్రులం అయ్యాక తెలుసుకున్నాను. బిడ్డల భవిష్యత్తు పట్ల ఏ తల్లిదండ్రికైనా కొన్ని భయాలు ఉంటాయి. అయితే నేను, నా భర్త గోల్డీ ఎలాంటి భయాలు లేకుండా జీవించాలనుకుంటున్నాం. సంతోషమైన విషయమేంటంటే నేనింకా బతికే ఉన్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈ ప్రపంచానికి థ్యాంక్స్‌ చెప్పకుండా ఉండలేను.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement