హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల జనవరి 3వ తేదీ నుంచి మెదక్ జిల్లాలో పరామర్శ యాత్ర చేయనున్నారని తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఆపార్టీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్, భిక్షపతి విలేకర్లతో మాట్లాడుతూ... పరామర్శయాత్రలో భాగంగా జిల్లాలో మొత్తం 13 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారని తెలిపారు. మెదక్ జిల్లాలో మొత్తం మూడు రోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర సాగుతుందని పేర్కొన్నారు.
జనవరి 5వ తేదీతో మెదక్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ముగియనుందన్నారు. ఆ తర్వాత అంటే జనవరి 6వ తేదీన నిజామాబాద్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ జిల్లాలో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారని వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో పరామర్శ యాత్ర పూర్తయిందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో పరామర్శయాత్ర ప్రారంభమవుతుందని వారు తెలిపారు.
కడప కలెక్టరేట్లో అంబేద్కర్ విగ్రహం కూల్చడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు శివకుమార్, నల్యా సూర్యప్రకాశ్, భిక్షపతి స్పందించారు. ఈ ఘటన దారుణమని వారు అభివర్ణించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ను అరెస్ట్ చేయాలని వారు రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తొలగించిన విగ్రహం స్థానంలో మరో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. దళితుల్ని అణచివేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కుట్రకు పాల్పడ్డారని వారు విమర్శించారు.