పాత టీవీలో భారీ నగదు చూసి...
కష్టార్జితం పొరపాటున చేయి జారిపోతే.. అది ఎప్పటికైనా మనచేతికి అంది తీరుతుందని అన‍్న పెద్దలమాట అక్షరాలా నిజమైన అరుదైన సంఘటన ఇది. ఎపుడో 30ఏళ్ల క్రితం దాచి పెట్టిన నోట్ల కట్టలు తిరిగి అనూహ్యంగా ఓ పెద్దాయన చెంతకు చేరాయి. దీంతో ఆశ్చర్యం, ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవడం ఆయన వంతు అయింది.
వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన వ్యక్తి (68) ఇంట్లో వాళ్లకి తెలియకుండా 30ఏళ్ల క్రితం సుమారు లక్ష కెనడా డాలర్లను టీవీ డబ్బాలో దాచి పెట్టాడు. కానీ ఆసంగతి మర్చిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ టీవీని ఓ స్నేహితుడికి కానుకగా ఇచ్చాడు. అలా.. అలా.. ఆ టీవీ చివరకి ఓ రీక్లింగ్ యూనిట్‌కు చేరడంతో కథ పెద్ద మలుపు తిరిగింది.
గత నెలలో రీసైక్లింగ్ ప్లాంట్ కి చేరిన ఈ టీవీ తెరిచిన కార్మికురాలు విస్తుపోయారు. 76,560 డాలర్లు( సుమారు రూ.67లక్షలు) విలువగల నోట్ల కట్టల్ని కొనుగొన్నారు. వెంటనే సమాచారాన్ని యాజమాన్యానికి చేరవేశారు. ఉత్తర టొరంటో, ఒంటారియా,బారీలోని ఎలక్ట్రానిక్స్ రీసైక్లింగ్ ప్లాంట్ జీప్ యజమాని వెంటనే పోలీసులను సంప్రదించింది. అలాగే తమ ఉద్యోగి నిజాయితీని ప్రశంసించింది.
అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన కుటుంబానికి వారసత‍్వంగా ఈ సొమ్మును అందించాలనుకున్న ఆయన డబ్బుతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా జతచేశాడట. వీటి ఆధారంగానే పోలీసులు నిజమైన యజమాని అడ్రస్ తెలుసుకొని సొమ్మును అతనికి అందజేశారు. 50 డాలర్ల నోట్ల కట్టలు చూసి పోలీసులకు సమాచారం అందించామని ప్లాంట్ జనరల్ మ్యానేజర్ రిక్ డే ఛాంప్స్ తెలిపారు.