
15 మంది ఎన్నారైలకు బ్రిటన్ పురస్కారం
విద్యావేత్త ఆశా ఖేమ్కాకు దక్కిన ‘డామేహుడ్’
లండన్: నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాణి చేతుల మీదుగా అందుకొనే ప్రతిష్టాత్మక ‘డామే కమాండర్ ఆఫ్ ది ఆర్డర్’ (డీబీఈ-డామేహుడ్) పురస్కారానికి ప్రముఖ విద్యావేత్త ఆశా ఖేమ్కా సహా 15 మంది ప్రవాస భారతీయులు ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషితో బ్రిటన్ పురోభివృద్ధికి తోడ్పడిన వారిని సత్కరించేందుకు 1917లో డీబీఈని ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం, బ్రిటన్ రాణి పుట్టినరోజు సందర్భాల్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఈసారి మొత్తం 1,195 మంది ఎంపిక కాగా వారిలో 610 మంది మహిళలే (51 శాతం). ఇలా పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు ఈ పురస్కారానికి ఎంపికకావడం ఇదే ప్రథమం. ప్రముఖ నటీమణులు ఏంజెలా లాన్స్‌బరీ, పెనెలోప్ కెయిత్, వింబుల్డన్ చాంపియన్ ఆండీ ముర్రే, ఇంగ్లండ్ సాకర్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు బెక్‌హామ్ ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.
బీహార్ నుంచి...
బీహార్‌లో 1950లో జన్మించిన ఆశాకు 15 ఏళ్ల వయసులోనే వివాహమైంది. తన భర్త, ముగ్గురు పిల్లలతో కలసి 1975లో బ్రిటన్‌కు వెళ్లారు. సంస్కృతి, భాషాపరమైన అడ్డంకులను అధిగమించి విద్యాభ్యాసం కొనసాగించారు. ఇంగ్లిష్‌పై పూర్తిగా పట్టు సాధించిన ఆమె 1980లో టీవీలో బోధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి యువతకు విద్య, ఉపాధి, శిక్షణపై దృష్టి పెట్టారు. అలాగే బ్రిటన్‌లోని 33 కాలేజీలను భారత్‌లోని కళాశాలలతో అనుసంధానం చేసి, ఇరు దేశాల విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.