షాకింగ్: జైలుకు నిప్పు, 150మంది ఖైదీలు పరారీ
రియోడిజనిరో: బ్రెజిల్ లో మరోషాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. సావోపోలో రాష్ట్రంలోని బౌరు జైలులో ఖైదీలు రెచ్చిపోయారు. ఖైదీల అంతర్గత పోరు ఆవరణలో బీభత్సం సృష్టించింది. ఖైదీల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. దీంతో జైలు లో కొంత భాగానికి నిప్పుపెట్టారు. అనంతరం జైలు గోడల్ని బద్దలు కొట్టి కనీసం 150మంది ఖైదీలు పారిపోయారు.
అయితే దేశంలోని ఇతర ప్రాంతాల్లో జైళ్లలో హింసాత్మక సంఘటనలకు దీనికి ఎలాంటి సంబంధంలేదని మిలటరీ పోలీస్ అధికారులు ప్రకటించారు. కఠినమైన క్రమశిక్షణ మూలంగానే ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారిలో 100 మంది తిరిగి పట్టుకున్నట్టు జైళ్ల శాఖ అధికారులు చెప్పారు.
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేశంలోని జైళ్లలో అల్లర్లు, ఘర్షణలు చెలరేగాయి. వీటిలో130 మందికిపైగా ఖైదీలు హత్యకు గురయ్యారు. మరోవైపు ఈ ఘటనల్లో అధికారుల ఆరోపణలను పరిశీలకులు వ్యతిరేకించారు. జైళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంవలనే తరచూ ఘర్షణలు చెలరేగుతున్నాయని విమర్శిస్తున్నారు.
కాగా బ్రెజిల్ లోని ఇతర జైళ్లతో పోలిస్తే సంఖ్య పరంగా బౌరు జైల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజా వార్తా సంస్థ ఏజెన్శియా బ్రసిల్ ప్రకారం, బౌరు జైలును 1,124 అనువుగా రూపొందించగా 1,427 ఖైదీలు ప్రస్తుతం ఉన్నారు.