అమెరికాలోని వాషింగ్టన్ నేవీయార్డులో సాయుధుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనలో నలుగురు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారని నేవీ ఇన్స్టలేషన్స్ కమాండ్ విభాగంలో పబ్లిక్ ఎఫైర్స్ డైరెక్టర్ కెప్టెన్ ఎడ్ బక్లాటిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
గాయపడ్డవారిలో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. వాషింగ్టన్ డీసీకి ఆగ్నేయంగా ఉన్న నేవల్ సీ సిస్టమ్స్ కమాండ్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. కాల్పులు ప్రారంభమైన కొద్దిసేపటికే సెక్యూరిటీ ఏజెంట్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కమాండ్ వద్ద దాదాపు 3వేల మంది పనిచేస్తుంటారు. అమెరికా నౌకాదళానికి చెందిన నౌకలు, జలాంతర్గాముల నిర్వహణ వ్యవహారాలన్నింటినీ ఇక్కడే చూస్తుంటారు. సంఘటన వివరాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా రక్షణ శాఖ వర్గాలు వివరించాయి.