500 కంపెనీలను ఆహ్వానించాం | 500 companies have been invited -ktr | Sakshi
Sakshi News home page

500 కంపెనీలను ఆహ్వానించాం

Published Tue, Aug 18 2015 12:37 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

500 కంపెనీలను ఆహ్వానించాం - Sakshi

500 కంపెనీలను ఆహ్వానించాం

మంత్రి కేటీఆర్ వెల్లడి
ఉపాధి కల్పన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం
చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహానికి చర్యలు
‘అమెజాన్’ ద్వారా రాష్ట్ర ఉత్పత్తుల అమ్మకం


న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఫార్చ్యూన్ మ్యాగజీన్ గుర్తించిన 500 కంపెనీలను ఆహ్వానించినట్లు ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం జరిగిన ఫార్చ్యూన్-500 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెట్టుబడుల ప్రోత్సాహంతో రాష్ట్రాభివృద్ధితో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, కేంద్రం కూడా పరిశీలిస్తోందన్నారు. చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకు చేయూతనివ్వాల్సిన అవసరముందని, ఆ దిశగా చర్యలు చేపడతామని వివరించారు. అమెజాన్ ఆన్‌లైన్ మార్కెటింగ్ కంపెనీతో కలసి రాష్ట్రంలో ఉత్పత్తయ్యే వస్తువులు, కళాకృతులను ప్రపంచానికి అందిస్తామని తెలిపారు. తద్వారా దళారి వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ముందుకు వెళ్లడమే తమ లక్ష్యమని, రూ.10వేల కోట్ల పెట్టుబడులకు సుమారు 50 సంస్థలకు నేరుగా అనుమతులిచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో విధానాలు కాగితంపై కాకుండా అమలులో ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత త్రీవంగా ఉండేదని, పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేసిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మాత్రం గృహ, పరిశ్రమలు, వ్యవసాయావసరాలకు తగ్గట్టుగా విద్యుత్ అందించిందని, వచ్చే ఏడాది 9 గంటల పాటు రైతులకు విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఐటీ రంగంలో హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ డ్రైవర్‌కు ఏపీ సీఐడీ నోటీసులపై ప్రశ్నించగా.. ఎవరు తప్పు చేసినా అందరికీ చట్టం వర్తిస్తుందని, ఎవరూ తప్పించుకోలేరని బదులిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement