స్వేచ్ఛా వాయువులకు 69 ఏళ్లు
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి విశాఖ సాగరతీరం వేదిక
తెలంగాణలో గోల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలు
రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి వేర్వేరుగా వేడుకలు
సాక్షి, స్కూల్ ఎడిషన్: ‘నీ ధర్మం.. నీ సంఘం.. నీ దేశం.. నువు మరవొద్దు.. జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు..’ అన్నాడో సినీ కవి. భరతమాతను దాస్యశృంఖలాల నుంచి విడిపించడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్రుణప్రాయంగా అర్పించారు. వారందరినీ సదా స్మరించుకుంటూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. నేడు భారత 69వ స్వాతంత్య్ర దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా జరిగాయి. ఏపీలో విశాఖపట్నంలోని సాగరతీరం ఈసారి వేదిక కాగా, తెలంగాణలో గతేడాది మాదిరిగానే గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
విప్లవ వీరులను స్మరించుకుందాం..
‘విప్లవం నా జన్మ హక్కు’ అంటూ తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా మారి తిరుగుబాటు చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, స్వతంత్ర భారతావని కోసం ఉరికొయ్యను ముద్దాడి వీరమరణం పొందిన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, తన రచనలతో విప్లవ జ్యోతి రగిలించిన గురజాడ అప్పారావు, టంగుటూరి వీరేశలింగం పంతులు, బ్రిటిష్ వారిని హడలెత్తించిన కడప కోటిరెడ్డి, తేనేటి విశ్వనాథం, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య, గౌతు లచ్చన్న, కొమురం భీమ్, సరోజినీ నాయు డు, ఎన్‌జీ రంగా, సురవరం ప్రతాపరెడ్డి... ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర పుటల్లో వందలాది మంది తెలుగు వీరులున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాట్లు..
రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి కర్నూలు జిల్లాలో గతేడాది జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. అయితే ఈ సారి విశాఖ సాగరతీరంలోని బీచ్‌రోడ్డు, విశ్వప్రియ ఫంక్షన్ హాలు పక్కన ఈ వేడుకలు జరిపారు.
తెలంగాణలో..
గతేడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో స్వాతంత్య్ర వేడుకలు చారిత్రక కట్టడం గోల్కొండ కోటపై నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గోల్కొండ కోటపైనే త్రివర్ణపతాకం ఆవిష్కరించారు.