
70శాతం ఉద్యోగినులు ఫిర్యాదు చేయడంలేదట!
న్యూఢిల్లీ: 'పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013' అమల్లోకి వచ్చినప్పటీకి దేశ వ్యాప్తంగా లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య మాత్రం గణనీయంగా లేదట. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి సగానికిపైగా ఉద్యోగినులు ముందుకు రావడంలేదని ఓ సర్వేలో తేలింది. ఫిర్యాదు తదనంతర పరిణామాలకు భయపడి 70శాతం మహిళలు ఫిర్యాదు చేయడంలేదని తేలింది. ముఖ్యంగా యజమాని లేదా పై అధికారి వేధింపులను మౌనంగా భరించడానికే మొగ్గు చూపుతున్నారని తేలింది. ది ఇండియన్ బార్ అసోసియేషన్ 2017లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి.
ఒకవైపు మారుతున్న ఆర్థిక అవసరాల రీత్యా మహిళలుకూడా ఉద్యోగాల చేయాల్సి పరిస్థితి.మరోవైపు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థల కార్యాలయాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఉద్యోగినుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే ఉద్యోగినులపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో ఆశించినంతగా మార్పు రాలేదని సర్వేలో తేలింది.
మరోవైపు కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి 2014 , 2015 సంవత్సరాల్లో ఆఫీసు ఆవరణల్లో లైంగిక వేధింపుల కేసులు రెట్టింపు అయ్యాయని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య 57-119కి పెరిగినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. అలాగే 2015 లో ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపు కేసులు 2014లో 469 కేసులతో పోలిస్తే 51శాతం పెరిగాయి.
కాగా దేశంలో 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత లైంగిక వేధింపుల నిరోధకచట్టాన్నికేంద్రం తీసుకొచ్చింది. మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఫిక్కీ లాంటి సంస్థలు గతంలోనే సూచించాయి. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.