working women
-
నెల్లూరులోని అన్నా క్యాంటీన్లకు తాగుబోతుల బెడద
-
నేను మంచి తల్లినా కాదా?! మామాఎర్త్ సీఈఓ పోస్టు వైరల్
ఒకప్పుడు ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అయ్యేవారు. అరకొర చదువులు చదివించి.. చిన్న వయసులోనే పెళ్లి చేసి అత్తరింటికి పంపిచేశారు. అమ్మాయిలకు పెద్ద చదువులు చెప్పించడం, ఉద్యోగాలకు పంపడం అన్న మాటే లేదు. కానీ రోజులు, పరిస్థితులు మారాయి. నేటి కాలంలో మగవారితో సమానంగా చదువుతున్నారు అమ్మాయి. ఇటు ఉద్యోగాలు కూడా చేస్తూ తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు పెళ్లి అయ్యాక ఓ వైపు ఇంటిని చూసుకుంటూ మరోవైపు ఉద్యోగం చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే కొన్నిసార్లు వ్యక్తిగత, వృత్తిపరమైన బాధ్యతలను రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. సగటు వర్కింగ్ విమెన్‌కు ఉండే సవాళ్లు తాజాగా బ్యూటీ బ్రాండ్ మామాఎర్త్ సహ-వ్యవస్థాపకురాలు, సీఈఓ గజల్ అలఘ్కు కూడా ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఆమె చేసిన ఓ భావోద్వేగ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గజల్ తన కొడుకును తొలిరోజు పాఠశాలకు తీసుకెళ్లాలని అనుకుంది. కానీ తనకున్న పనుల వల్ల అది సాధ్యపదడలేదు. దీంతో ఆమె ఎంతో బాధపడిపోయింది. కుమారుడితో కలిసి మొదటి రోజు పాఠశాలకు వెళ్లకపోడంతో ‘నేను చెడ్డ తల్లినా?’ అనే ప్రశ్న తన మదిలో మెదిలినట్లు చెప్పుకొచ్చింది. చివరికి తన కొడుకును వాళ్ల నానమ్మతో స్కూల్‌కు పంపినట్లు పేర్కొంది. ‘నా కుమారుడిని తొలి రోజు పాఠశాలకు తీసుకెళ్లడానికి కుదర్లేదు. అప్పుడు ను మంచి తల్లిని కాదా? అనే ప్రశ్న నా మదిలో మెదిలింది. ఆ సమయంలో చాలా ఏడ్చా. బాధ పడ్డా. ధైర్యం తెచ్చుకొని వాళ్ల నాన్నమ్మతో స్కూల్‌కి పంపించా. మీరు ఎంత కోరుకున్నా కొన్నిసార్లు సెలవు తీసుకోవడం కుదదు. అది ఎంత విలువైనది అయినా సరే. అలా మొదటిరోజు స్కూల్‌కు వెళ్లేందుకు కుమారుడు చూపిన ఉత్సాహం, చిరునవ్వు, కన్నీళ్లు, పాఠశాల్లో అడుగు పెట్టగానే ఉపాధ్యాయులు, పిల్లల్ని చూసి కలిగే ఆందోళన.. ఇవన్నీ చూడలేకపోయా’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేశారు. అదేవిధంగా తన కుటుంబ సపోర్ట్‌ను కూడా అలఘ్ ఈ పోస్టులో వివరించారు. నేను, వరుణ్ అలగ్, కుమారుడు అగస్త్య, మా అత్త ఐదేళ్ల కిత్రం ఉమ్మడి కుటుంబంలో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు నాలుగుతరాల వాళ్లంతా ఒకే ఇంట్లోనే ఉంటున్నాం. ఉద్యోగం చేస్తున్న ప్రతిఒక్కరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. సొంతవాళ్లే కావాలనేం లేదు. దగ్గరి బంధువులు, అర్థం చేసుకునే స్నేహితులున్నా పర్లేదు. అయితే, ప్రతీ విషయంలోనూ లాభాలు, నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది పిల్లలకు అద్భుతమైన వాతావరణం. తల్లులు కెరీర్ లక్ష్యాలను పక్కనపెట్టకుండా.. ప్రేమ, రక్షణ అందించే ప్రదేశం’ అంటూ సుదీర్ఘ మైన పోస్ట్ రాసుకొచ్చారు. -
ట్రెండ్ మార్చిన వర్కింగ్ ఉమెన్స్.. బంగారంపై తగ్గిన ఇంట్రెస్ట్
బంగారమంటే ఇష్టపడని స్త్రీలు దాదాపు ఉండరనేది వాస్తవం.. అయితే టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో వర్కింగ్ ఉమెన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీరిలో చాలామంది తమ సంపాదనను గోల్డ్ కొనడం కంటే కూడా మంచి లాభాలను అందించే రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 23 నుంచి 45 సంవత్సరాల మహిళలలో 40 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, మరో 40% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత చూపుతున్నారని బ్యాంక్ బజార్ ఆస్పిరేషన్ ఇండెక్స్ అధ్యయనంలో వెల్లడించింది. కొందరు మహిళలు బంగారం కొనడం వంటివి పక్కన పెట్టి రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసి తమ పోర్ట్‌ఫోలియోలను విస్తరించుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. వర్కింగ్ ఉమెన్స్ ఆర్థిక రంగంలో మంచి అవగాహన పొందుతున్నారని, ఎప్పటికప్పుడు కొత్త పెట్టుబడులను గురించి ఆరా తీస్తూనే ఉన్నారని స్పష్టమవుతోంది. నిజానికి బంగారంలో పెట్టె పెట్టుబడి కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మరింత లాభాలను అందిస్తాయని, అలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తాయి. ఇదీ చదవండి: ఇంకా తగ్గిపోయిన బంగారం, వెండి - ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే? మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల్లో 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టినప్పుడు 12 నుంచి 15 శాతం పొటెన్షియల్ రిటర్న్స్ లభిస్తాయి. అయితే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, తప్పకుండా వాటిని గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. -
Health: మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్..
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. శరీర నిర్మాణపరంగా వారి మూత్రవ్యవస్థ నిర్మితమైన తీరు వల్ల వారిలో ఈ సమస్యలు, ఇన్ఫెక్షన్లు అధికం. దీనికి తోడు బయటకు వెళ్లి ఆఫీసుల్లో పనిచేసే మహిళల్లో (వర్కింగ్ ఉమెన్)లో... వారికి ఉండే కొన్ని పరిమితుల వల్ల ఇన్ఫెక్షన్లు, మరికొన్ని ఇతర సమస్యలు పెరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందో తెలిపే కథనం. సాధారణ మహిళలైన గృహిణులకూ (హోమ్ మేకర్స్‌కూ), బయటికి వెళ్లి పనిచేసే మహిళలకూ (వర్కింగ్ ఉమెన్కూ) కొన్ని తేడాలు ఉంటాయి. వర్కింగ్ ఉమన్ నీళ్లు తక్కువగా తాగడం, అలాగే మూత్రానికి వెళ్లాల్సిన అవసరమొచ్చినా చాలాసేపు ఆపుకోవడం ఈ రెండు పనులూ చాలా ఎక్కువగా చేస్తుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి... 1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... ఈ మూత్ర విసర్జన సమస్యలు మళ్లీ రెండు రకాలు. ►మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. ►రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక నొప్పి రావడం. ఇక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా రావచ్చు. ఎందుకీ సమస్యలు : మొదటి కారణం సాధారణంగా వర్కింగ్ ఉమెన్... మూత్రవిసర్జనను తప్పించుకోడానికి నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. నిర్వహణ బాగుండే పెద్ద పెద్ద ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ బాగుండకపోవడం, కొన్ని చోట్ల మరీ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు. రెండో కారణం ఇక ఎంతగా మూత్రవిసర్జన చేయాల్సి వచ్చినా రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనను ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా బిగబట్టడం వల్ల పెద్దగా సమస్యలేవీ రావుగానీ... అదే పని పదేపదే చాలాకాలం పాటు కొనసాగుతున్నప్పుడు మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఎలాంటి సమస్యలొస్తాయంటే... మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ (యూటీఐ) అంటారు. ఈ సమస్య ఎలా వస్తుందంటే... శరీరం తనలోని వ్యర్థాలను శుభ్రపరిచాక... వాటిని మూత్రం రూపంలో ఓ కండర నిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతుంది. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి. చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుకుంటే... అక్కడ చాలా పరిమాణంలో మూత్రం చాలాసేపు నిల్వ ఉండిపోతుంది. ఇలా దీర్ఘకాలం పాటు నిల్వ ఉంటే బ్యాక్టీరియా వృద్ధిచెంది... దాని కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని... ‘పర్సిస్టెంట్ బ్యాక్టీరియూరియా’ లేదా ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. కిడ్నీల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. దీన్ని కొంచెం సీరియస్ సమస్యగా పరిగణించాల్సి ఉంటుంది. లక్షణాలు మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ విసర్జనకు వెళ్లాలనిపించడం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిర్ధారణ పరీక్షలు... సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య పదే పదే వస్తుంటే మాత్రం అందుకు కారణాలు నిర్ధారణ చేసుకోవడం కోసం కొన్ని పరీక్షలూ చేయిస్తుంటారు. సీయూఈ, యూరిన్ కల్చర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి), సిస్టోస్కోప్ (యూటీఐ). అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు అవసరమవుతాయి. చికిత్స యూరినరీ ఇన్ఫెక్షన్లకు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతోనూ, అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు. -డాక్టర్ లలిత, సీనియర్ కన్సల్టెంట్, యూరో గైనకాలజిస్ట్ చదవండి: అందమైన అమ్మాయి.. ఆమె ఓ డాక్టర్! టీనేజ్ అఫైర్‌ను గుర్తు చేసుకుని.. చివరికి Muscle Cramps: గుగ్గిల వృక్షం.. ఈ జిగురుతో కీళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు! రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!
రన్నింగ్ రేస్ ట్రాక్ సిద్ధంగా ఉంది. పోటీదారులందరూ పరుగుకు సిద్ధంగా ఉన్నారు. విజిల్ వినిపించగానే వింటి నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాలనే కసి వారందరిలో సమానంగా ఉంది. ఉన్నట్లుండి... ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు... ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఓ అథ్లెట్ కాలికి ఓ బంధనం చుట్టుకుంది. అయినా పట్టించుకోకుండా పరుగు మొదలు పెట్టినప్పటికీ కాలు తేలికగా నేలను తాకడం లేదు. బరువుగా కదులుతోంది. మనసులో అలజడి. మెదడు నిండా ప్రశ్నలు... ఆందోళన పెరిగిపోతోంది. పోటీ నుంచి తప్పుకోవడమా లేక పోటీదారుల జాబితాలో ఆఖరున నిలబడడమా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇదీ ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ పరిస్థితి. ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అబ్బాయిలతో సమానంగా దీటుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న మహిళ... తల్లి కావడం కోసం కెరీర్లో రాజీ పడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ప్రైవేట్ రంగంలో అంత సులువుగా ఏమీ జరగడం లేదు. ఆ విరామాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బిడ్డ పెరిగిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా తమ ఉద్యోగం నిత్యపోరాటం దినదినగండంగానే ఉంటోంది. ఇంట్లో ఏ అవసరం వచ్చినా అందరి కళ్లూ ‘ఆమె ఉద్యోగం’ వైపే మళ్లుతాయి. ‘ఉద్యోగం మానేయచ్చు కదా’ ఉచిత సలహాల పర్వం మొదలవుతుంది. ఏది మంచి పరిష్కారం? రజని ఓ పెద్ద ప్రైవేట్ స్కూల్లో టీచర్. భర్త కూడా ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజ్కొచ్చారు. అత్తగారికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్లో చేర్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చారు. పరామర్శకు వచ్చిన బంధువులందరిదీ ఒకటే సలహా. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్లి పోతే ఎలాగ! ఆమెకు తోడుగా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా! మంచిదే... ఆ ఒకరు ఎవరు? అందరి తీర్పూ ‘ఆమె ఉద్యోగం’ మీదనే. ‘ఉదయం నేను అన్నీ అమర్చి వెళ్తాను. అత్తమ్మను రోజంతా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్ అసిస్టెంట్ లేదా నర్సును పెట్టుకుంటాను. నేను ఉద్యోగం మానడం కంటే మరొకరికి ఉద్యోగం కల్పించడం మంచి పరిష్కారమేమో కదా... ఆలోచించండి’ అని చెప్పి చూసింది రజని. ఆ పరిష్కారం ఎవరికీ నచ్చడం లేదు. ఎవరి ముఖంలోనూ ప్రసన్నత లేదు. మారు మాట్లాడకుండా ఉద్యోగం మానేసింది రజని. నాలుగు నెలలకు అత్తగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్దామంటే స్కూల్లో తన ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తూ ఉండదు. అప్పటికీ ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాసు చెప్పడానికి సిద్ధమై వెళ్లింది. ‘అకడమిక్ ఇయర్ మధ్యలో అలా మానేశారు. పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి కదా వేరే టీచర్ని అపాయింట్ చేశాం. ఎవరైనా మానేసినప్పుడు ‘అవసరమైతే’ తెలియచేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్... ఇక మీరు వెళ్లవచ్చు అనే అర్థాన్ని ధ్వనింపచేస్తూ. ‘ఆ అవసరం’ రాకపోవచ్చనే భావం కూడా అవగతమైంది రజనికి. ప్రసూతి విరామాన్ని స్వీకరించడానికి, ఆ మేరకు కెరీర్లో వెనుకబాటును స్వాగతించడానికి మాతృత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కోడలి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగంలో కొనసాగడానికి, మల్టీటాస్కింగ్‌కి కూడా తాను సిద్ధమే. కానీ ఈ నిర్ణయం ఒప్పనే వాళ్లేరి? రజనిలాగ ఎందరో! ఇది ఒక్క రజని సమస్య మాత్రమే కాదు. సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ రంగాలలో మహిళలకు కూడా దాదాపుగా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కుటుంబ కారణాలరీత్యా ఉద్యోగం మానేసిన వాళ్లు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చిన్న సవాల్ కాదు. అన్ని రకాల అడ్డంకులనూ ఎదుర్కొని కేవలం 27 శాతం మహిళలు మాత్రమే తిరిగి ఉద్యోగినులవుతున్నారు. వారిలో పదహారు శాతం మాత్రమే కొత్త ఉద్యోగాన్ని తన సమర్థతకు దీటుగా సంపాదించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక కోణం మాత్రమే. నాణేనికి మరో వైపు పరిశీలిస్తే అంతులేని ఆందోళన కలుగుతోంది. కుటుంబ అవసరాల కారణంగా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో కనీసంగా మనిషిగా కూడా చూడడం లేదనే ఆవేదనతో కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. చివరికి వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు న్యాయవాది పార్వతి. చేజార్చుకుంటే కష్టమే! ‘‘నా క్లయింట్ ఒకావిడ ఉన్నత చదువులు చదివింది. భార్యాభర్తలు యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను ఉద్యోగం మానేయమని భర్త నుంచి ఒత్తిడి మొదలైంది. ‘అతడి తల్లిదండ్రులు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉండడానికి వస్తున్నారు. వాళ్లను సౌకర్యంగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయమని’ అతడి డిమాండ్. ‘అంత చదివి ఉద్యోగంలో కీలక స్థాయికి చేరిన దశలో ఉద్యోగం మానేస్తే తిరిగి ఇలాంటి ఉద్యోగం తెచ్చుకోవడం సాధ్యం కాద’నేది ఆమె వాదన. ఒకవేళ ఆమె భర్త ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగం మానేస్తే... ఆరు నెలల తర్వాత ఆమె తిరిగి వెళ్లేసరికి ఆమె ఉద్యోగం ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సంస్థలు కూడా ఆమెకిచ్చే జీతంతో ఇద్దరు జూనియర్లను చేర్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాయి. మహిళలు మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అయితే ఆ ఉద్యోగాన్ని కొనసాగించడంలో మాత్రం మన భారతీయ సమాజంలో ఆమెకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు, లాయర్లను సంప్రదిస్తున్న మహిళలే అందుకు ఉదాహరణ’’ అంటారామె. ‘ఆమెను ఉద్యోగం చేయనిస్తున్నాం కదా’ అని తమ విశాలత్వాన్ని చాటుకునే భర్తలకు కొదవలేదు. అలాగే తాము ఎప్పుడు మానేయమంటే అప్పుడు మానేయడమే ఆమె ముందున్న ఆప్షన్ అనే ధోరణికి కూడా కొదవలేదు. చివరికి ‘ఆమె ఉద్యోగం’ ఆమెది కాకుండా పోతోంది. చట్టం అందరికీ ఒక్కటే! కానీ... మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో వచ్చింది. అప్పుడు పన్నెండు వారాల వేతనంతో కూడిన సెలవు ఉండేది. తర్వాత 26 వారాలకు పొడిగించింది ప్రభుత్వం. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎక్కువ కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రానివే ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో యాభై మంది ఉద్యోగులున్న సంస్థ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. దాంతో అనేక చిన్న చిన్న కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఈ పరిస్థితి ఆ కంపెనీల్లో పని చేసే మహిళలకు పెద్ద సమస్యగా మారుతోంది. డెలివరీ తర్వాత, కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగంలో విరామం తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది. – పార్వతి, న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది
నలుగురితో నారాయణ గుంపులో గోవిందా అనుకుంటూ సమస్యలతో సర్దుకుపోవడం అందరూ చేసే పని. కానీ ఆ మహిళా అలా చేయలేదు. సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఊరూరా తిరుగుతూ టేపుతో కొలతలు తీసుకుంది.. ఆఫీసులో చీపురు పట్టి ఊడ్చింది.. చివరకు అనుకున్నది సాధించింది. దేశ వ్యాప్తంగా లక్షల మంది మహిళలు ఏళ్ల తరబడి సర్దుకుపోతున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఒకప్పుడు ఇళ్లకే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. రోడ్డు పక్కన కూరగాయల షాపు మొదలుపెడితే కార్పొరేట్ ఆఫీసులో పెద్ద పనుల వరకు చక్కబెడుతున్నారు. కిక్కిరిసిన సిటీ బస్సులతో పాటు ఫ్లైట్లలో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూడా వెళ్తున్నారు. ఇలా వర్క్‌కి వెళ్తున్న మహిళలు బయట ఎదుక్కొంటున్న సమస్యకి పరిష్కారంగా ఓ స్టార్టప్ ప్రాణం పోసుకుంది. కంఫర్ట్ ఎక్కడ ? ఆయుషి గుడ్వాని ఢిల్లీలో సంపన్న కుటుంబానికి చెందిన యువతి. ఆర్థికంగా లోటు లేకపోయినా కట్టుబొట్టు విషయంలో సంప్రదాయం పాటించాలని కోరుకునే కుటుంబం నుంచి వచ్చింది. బీటెక్ పూర్తి చేసిన వెంటనే ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ వెంటనే 2008లో మెక్‌కెన్సీ కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగం సంపాదించింది. సంప్రదాయ చుడీదార్ లేదా చీరకట్టులో ఆఫీస్‌కి వెళితే పెన్ను, ఫోను, పర్సు, ఐడీ కార్డు, ఫైల్స్ ఇలా అన్ని చేతితోనే పట్టుకుని పని చేయాల్సి వచ్చేది. అయితే ఫారిన్ టూర్లకు వెళ్లేప్పుడు అక్కడి దుస్తులే ప్రిఫర్ చేసేది. స్టార్టప్‌కి బీజం ఫారిన్ టూర్లలో ధరించే వర్క్ కల్చర్‌కి తగ్గట్టుగా ఉండేవి. అయితే ఆ బట్టలు ఇండియాలో ప్రతీ రోజు ధరించడం ఇబ్బందిగానే ఉంటుంది. విదేశాల్లో లభించే వర్క్ వేర్ అంతా అక్కడి కల్చర్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందుతాయి. ఇక్కడి వేడి వాతావరణ పరిస్థితులకు లోకల్ కల్చర్‌కి అవి పూర్తిగా నప్పవు. కానీ ఇండియాలో ఆఫీసులకు వెళ్లేందుకు మహిళలకు వర్క్ వేర్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇంట్లో ధరించే చీరకట్టు, చుడీదార్ వంటి సంప్రదాయ దుస్తులు తప్ప సరైన ప్రత్యామ్నాయం అందుబాటులో లేవు. 120 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ఆటో డ్రైవర్ల నుంచి కార్పొరేట్ కంపెనీ సీఈఓలుగా లక్షల మంది మహిళలు వివిధ పనుల్లో ఉంటే వారి కోసం ప్రత్యేకంగా వర్క్ వేర్ లేకపోవడం పెద్ద లోటని ఆయుషి గుడ్వానీకి గుర్తించింది. ఉద్యోగానికి రాం రాం అసలే ఐఐఎం స్టూడెంట్ దానికి బ్యాక్‌గ్రౌండ్ బీటెక్ చదివింది ఆయుషి. ఓ సమస్య దాని వెంటే ఓ అవకాశం కనిపిస్తుంటే ఊరుకుంటుందా? వెంటనే తల్లిదండ్రులు వద్దని వారిస్తున్నా వినకుండా చేస్తున్న బంగారంలాంటి ఉద్యోగానికి 2015లో రాజీనామా చేసింది. చేతిలో ఉన్న సేవింగ్ మనీతో వర్క్ వేర్ మీద మనసు లగ్నం చేసింది. టేపు చేతబట్టి విదేశాల్లో ఒకే భాష ఒకే తరహా మనుషులు ఉంటారు. కానీ భారత్ పరిస్థితి దానికి భిన్నం, విభిన్న వాతావరణ పరిస్థితులు, భిన్న శరీర ఆకృతులు కలిసిన మనుషులు ఇక్కడున్నారు. వీరి తగ్గట్టుగా బట్టలను డిజైన్ చేయడం అతి పెద్ద సవాల్‌గా మారింది ఆయుషికి. కానీ పట్టు వదల్లేదు. ధైర్యం కోల్పోలేదు. ఒక్కతే బ్యాగులో చిన్న సైజు టేపు పెట్టుకుని ఆఫీసులు, అపార్ట్మెంట్లు, వీధుల వెంట తిరిగింది. వేయి మందికి పైగా మహిళల దగ్గర నుంచి కొలతలు తీసుకుంది. ఇలా ఏడాది పాటు శ్రమించి వాటి సాయంతో టెక్నాలజీ సాయంతో ఓ అల్గారిథం తయారు చేసింది. దాని ఆధారంగా మూడు భిన్న సైజుల్లో డ్రెస్సులు రూపొందిస్తే అవి ఇండియన్లకు నప్పుతాయనే నమ్మకానికి వచ్చింది. ఆన్‌లైన్‌తో మొదలు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ సేవ్ చేసిన మనీ అంతా ఏడాది పాటు రీసెర్చ్‌కే అయిపోయింది. ఉన్న కొద్ది పాటు డబ్బులతో వర్క్ వేర్ తయారు చేసింది. వాటిని ఫాబుల్ స్ట్రీట్ పేరుతో ఆన్లైన్లో 2016లో అమ్మకానికి పెట్టింది. కొత్త బ్రాండ్ ప్రచారం చేసేందుకు డబ్బులు చాలక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా వంటి షోషల్ మీడియా ఫ్టాట్ఫామ్స్నే ఆమె నమ్ముకుంది. అప్పటికే ఆమెకు ఉన్న పరిచయాలతో తన స్నేహితులు, పరిచయస్తులకు తన డిజైన్స్ చూపించింది. అక్కున చేర్చుకున్నారు ఆఫీస్‌లో వర్క్ చేసుకునేందుకు అనువుగా ఉంటూ ఫ్యాషనబుల్ ఇక్కడి సెంటిమెంట్స్‌ని హర్ట్ చేయని ఫాబుల్ స్ట్రీట్ స్టైల్‌ను వర్కింగ్ విమెన్ అక్కున చేర్చుకున్నారు. ఏళ్ల తరబడి ఇంటి వాతావరణానికి అనువైన సంప్రదాయ దుస్తుల్లోనే ఇంటి బయట నెట్టుకొస్తున్న వర్కింగ్ క్లాస్ విమెన్‌కి ఆయుషి చేసిన డిజైన్స్ వరంలా తోచాయి. స్టైల్, కంఫర్ట్, క్వాలిటీ అందించే ఈ బట్టలను ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆదరించారు. హ్యాండ్స్ ఫ్రీ బయట పనుల్లో ఉండే మగవారికి అవసరాలకు తగ్గట్టుగా షర్ట్, ప్యాంట్స్లకు జేబులు ఉంటాయి. కానీ మహిళలకు ఆ సౌకర్యం లేదు. ఏమైనా చేతిలో పట్టుకోవాల్సిందే లేదా బ్యాగును వెంట తెచ్చుకోవాల్సిందే. ఈ ఇబ్బందులు తొలగించేందుకు రూమీ పాకెట్స్‌ను పరిచయం చేసింది. ఇలా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ విమెన్ వర్కింగ్ వేర్ ఫ్యాషన్‌కి కొత్త బాటలు వేసింది. రెండేళ్లకే ఫ్యాబుల్స్ట్రీట్ మార్కెట్లో దూసుకుపోతున్న తీరుతో ఒక్కసారిగా వెంచర్ క్యాపిటలిస్టులు ఆయుషిని సంప్రదించారు. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన స్టార్టప్‌లో మూడేళ్లకే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీంతో కంపెనీ మరింతగా విస్తరించి వర్కింగ్ వేర్‌తో పాటు యాక్సెసరీస్ సైతం పరిచయం చేసింది. అన్నీ తానై ఎంఎన్సీ కంపెనీలో ఏడేళ్ల పాటు ఎగ్జిక్యూటివ్ హోదాలో అన్ని సౌకర్యాలను వదులుకుని తాను పడ్డ ఇబ్బందులు, తాను చూసిన అవకాశాల కోసం పట్టుదలగా పోరాడింది ఆయుషి గుడ్వానీ. తొలిసారిగా ఫాబుల్ స్ట్రీట్ స్థాపించినప్పుడు ఆఫీసు ఊడ్చే పని దగ్గర నుంచి వాటర్ క్యాన్ మార్చే వరకు అన్నీ పనులు ఒక్కతే చేసుకుంది. ఒంటరిగా స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడు వందల మందికి ఉపాధి ఇవ్వడమే కాదు లక్షల మంది మహిళలకు వర్కింగ్ ప్లేస్‌లో ధరించేందుకు కంఫర్ట్ ఇచ్చే ఫ్యాషనబుల్ డ్రెస్‌లను అందుబాటులోకి తెచ్చింది. సోషల్ ఇంజనీరింగ్ నిజానికి ఫాబుల్ స్ట్రీట్ బ్రాండ్ ప్రీమియం వర్కింగ్ విమెన్ వేర్ కేటగిరిలో దుస్తులను విక్రయిస్తోంది. ఇండియాలో వివిధ పనుల్లో ఉన్న చాలా మంది మహిళలు ఈ దుస్తులు కొనలేకపోవచ్చు. కానీ ఆయుషి పరిచయం చేసిన చుడిదార్ ప్యాకెట్స్, స్ట్రెచ్ , వివిధ డిజైన్ల కాపీలు ఇప్పుడు సాధారణ మార్కెట్లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది వర్కింగ్విమెన్ వీటిని ఉపయోగిస్తున్నారు. బిటెక్ చదివిన ఆయుషీ తనకు తెలియకుండానే చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఎక్సపెరిమెంట్ సక్సెస్ అయ్యింది. ఆమెకు మంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చింది. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి: కలిసొచ్చిన కరోనా!.. బిలియనీర్స్ లిస్ట్‌లో రాధాకృష్ణన్ దమానీ -
ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు
మార్చి 8 శ్రామిక మహిళల పోరాటానికి సంకేతం. 19వ శతాబ్దంలో న్యూయార్క్ నగరంలో సమాన వేతనానికి, పది గంటల పనికోసం మహిళల పోరాటాలు, త్యాగాల ఫలితంగా 1910లో మార్చి 8కి అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తింపు వచ్చింది. వివిధ సందర్భాల్లో మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రష్యాలో జార్ చక్రవర్తి ఆగడాలకు వ్యతిరేకంగా రొట్టె కోసం 1917 విప్లవ కాలంలో మార్చి 8న పెట్రోగార్డ్లో వేలాది మహిళలు బ్యానర్లతో ప్రదర్శన చేశారు. మహిళలు బుర్ఖా వేసుకోకుండా బయటకు రాకూడదని 1970లో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖోమేని మార్చి 7న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేలాది మహిళలు ప్రదర్శనలు జరిపారు. 2018 మార్చి 8న 170 దేశాల సమన్వయంతో అంతర్జాతీయంగా మహిళల సమ్మె జరిగింది. హింసకు, ఇంకా అనేక రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఎనిమిది రకాల డిమాండ్లతో రోడ్లన్నీ నిండిపోయాయి. మన దేశంలో 2012లో ఢిల్లీ రాజధాని నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా పోరాటంలో మహిళలు, పురుషులతో సమానంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అమరులైనారు. 1970లో నాటి ఉత్తరప్రదేశ్‌లోని అడవులను పారిశ్రామికవేత్తల నుంచి రక్షించడానికి దశౌలీ గ్రామ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో 2,500 చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. మహిళలు చెట్లను హత్తుకొని కాపాడటం వల్ల దీనికి ‘చిప్కో’ ఉద్యమమనే పేరు వచ్చింది. 1995లో హరియాణాలోని ఖాప్ పంచాయతీ ఒక కుటుంబానికి శిక్ష వేసే క్రమంలో పన్నెండేళ్ల బాలికను అత్యాచారం చేయాలనే తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని వెయ్యి మంది మహిళలు సంఘటితంగా ఉద్యమించారు. మణిపూర్‌లో 2004లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా ముప్పైమంది మహిళలు నగ్నంగా ఇంఫాల్‌లో నిరసన ప్రదర్శన చేశారు.1992లో సారా వ్యతిరేక ఉద్యమం చరిత్ర సృష్టించింది. 1991లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల మహిళలపై మరింత భారం పడింది. సామ్రాజ్యవాద సంస్కృతి కొత్త రూపాలలో మహిళలపై హింసను పెంచింది. రోజూ 88 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో రాజస్తాన్‌లో 6,000, యూపీలో 3,165 అత్యాచార సంఘటనలు జరిగితే, రికార్డు కెక్కనివి ఎన్నో. 2019లో నమోదైన 32,033 అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 18 శాతం నమోదైనాయి. బాధితుల్లో 11 శాతం దళిత మహిళలే. 2017 డిసెంబర్లో భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవ పోరాటం, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని వేలాది ముస్లిం మహిళల షాహిన్‌బాగ్ పోరాటం, నేటి కోట్లాది రైతుల పోరాటం దేశ చరిత్రలో 3 ప్రధాన పోరాటాలు. 40 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి నిరుద్యోగిత చేరింది. డీమానిటైజేషన్, జీఎస్టీ అసంఘటిత రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కుటుంబ భారాన్ని మోయలేక మహిళలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. భరించినంత కాలం మహిళలపై భారం పడుతూనే ఉంటుంది. మన ముందున్నది రైతాంగ వ్యవసాయ కార్మిక మహిళా ఉద్యమం. కార్పొరేట్ హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని రంగాల మహిళలు మార్చి 8 స్ఫూర్తితో చేయి చేయి కలిపి అడుగులు వేయడమే కర్తవ్యం. – అనిత, చైతన్య మహిళా సంఘం -
పని ప్రదేశాల్లో అతివలకు అండగా..
సాక్షి, ఖమ్మం: సమాజంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలు చేసే మహిళలకు ఇంకా ఎక్కువ సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలా పని ప్రదేశాల్లో వేధింపులను గుర్తించి మహిళలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు అంతర్గత కమిటీలను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేధింపులను నివారించటానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు కార్యాలయాల్లో అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు పలువురి ఫిర్యాదులు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆసుపత్రుల తదితర చోట్ల సుమారు 10వేల మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్లు అధికారుల అంచనా. పని ప్రదేశాల్లో వీరిని పురుష ఉద్యోగులు వివక్షకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొందరు మహిళా ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన సంఘటనలున్నాయి. మరికొంత మంది వేధింపులకు గురవుతున్నా విన్నవించుకునేందుకు ధైర్యం చేయలేని పరిస్థితి ఉంది. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కమిటీ నిర్వహణ ఇలా.. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలల్లో పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్న చోట కమిటీలు ఏర్పాటుచేసుకోవాలి. దీనిలో అనుభవం కలిగిన అధికారిని కమిటీ చైర్మన్‌గా నియమిస్తారు. మండలాల్లోని కార్యాలయాల్లో నియమించిన కమిటీ సభ్యుల నుంచి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సహచర ఉద్యోగుల నుంచి వేధింపులు, ఒత్తిడులు ఎదురైతే కమిటీ సమావేశమై చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలి. ఒక వేళ సంబంధిత ఉద్యోగులు అప్పటికీ వేధింపులు మానుకోకపోతే కమిటీ సభ్యులు అంతా చర్చించి అతనిపై చర్యలు తీసుకుంటారు. ఈ కమిటీలు ఏర్పాటు చేయటం వల్ల మహిళా ఉద్యోగులకు వేధింపులు అరికట్టటానికి అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల, ఏదైనా పది మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తుంటే తప్పనిసరిగా కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. లేనిపక్షంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కమిటీ ఏర్పాటు చేయకుంటే జరిమానా మహిళా ఉద్యోగినిలు 10మంది కంటే ఎక్కువగా ఉండి.. అక్కడ మహిళలకు సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయకుంటే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. కమిటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల రూ.50వేలు జరిమానా విధించనున్నారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసే కమిటీల నియామకంపై తాత్సారం చేయవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అవగాహన సదస్సులు బాలికలు, యువతులు, విద్యార్థినులు, మహిళలపై వేధింపులు అధికంగా ఉంటున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడితే కలిగే నష్టాలు, కేసులు, చట్టాల గురించి పోలీస్ శాఖాధికారులు షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలు, ప్రయాణ ప్రాంగణాలపై షీ టీమ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మహిళలపై దాడులు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు, చిన్న పిల్లల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడం వల్ల జిల్లాలోని పోకిరీల ఆగడాలకు కొంత అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి పది మంది మహిళా ఉద్యోగినిలు ఉంటే తప్పకుండా కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన ఆదేశాలు మాకు అందాయి. కమిటీ ఏర్పాటు చేయని పక్షంలో రూ.50వేల జరిమానా విధించాలని మార్గదర్శకాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మా శాఖ కార్యాలయంలో కమిటీ ఏర్పాటు చేశాం. క్షేత్రస్థాయిలో సైతం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం. –మదన్మోహన్, ఖమ్మం డీఈఓ -
ఐసీఐసీఐ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మహిళా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉద్యోగినులకు అన్లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఉచిత బీమా క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లు లాంటి అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఉద్యోగినులతోపాటు, గృహ వ్యాపారాన్ని నడుపుతున్న, స్వయం ఉపాధి పొందుతున్న విద్యావేత్తలు, వృత్తి నిపుణులైన మహిళలకు ఈ ఖాతా తెరిచే అవకాశం కల్పిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అడ్వాంటేజ్ ఉమన్ ఔరా సేవింగ్స్ అకౌంట్’ పేరుతో ఉద్యోగినులకు ప్రత్యేక ఖాతాను అందిస్తోంది. ఈ అకౌంట్ తీసుకున్న వారికి డెబిట్ కార్డ్ వాడకంపై నెలకు రూ.750 క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే ఏటీఎం లావాదేవీలు పూర్తిగా ఉచితం. లాకర్ చార్జీలపై 50 శాతం డిస్కౌంట్, గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజులో డిస్కౌంట్. ద్విచక్ర వాహనాలపై వంద శాతం రుణ మంజూరీ వంటి అనేక ఆఫర్లను ఈ ఖాతా ద్వారా పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. అంతేకాదు 10-40లక్షల రూపాయల దాకా ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అటు ఇల్లు, ఇటు ఆఫీసు వ్యవహారాలను సంపూర్ణ సమతుల్యంతో నిర్వహిస్తున్న ఉద్యోగినులకు సలాం చేస్తున్నామని, ఇలాంటి మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక ఖాతాను అందుబాటులోకి తెచ్చామని ఐసీఐసీఐ బ్యాంకు రిటైల్ లయబిలిటీస్ గ్రూప్ హెడ్ ప్రణవ్ మిశ్రా తెలిపారు. #JustIn: #ICICIBank launches first ever account exclusively for working women in India, christened, ‘Advantage Woman Aura Savings Account’. #ICICIBankAWASA pic.twitter.com/AZHMeaKY8i — ICICI Bank (@ICICIBank) December 12, 2018 -
'ఆమెకు' అద్దె ఇల్లు కష్టమే!
మన నగరం మహిళలకు సేఫ్ ప్లేస్. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు ఈ విషయంలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భద్రత విషయంలోహైదరాబాద్ తొలి స్థానంలో నిలవగా... పుణె, బెంగళూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కానీ ఒంటరి మహిళలకు మాత్రం నగరంలో ఇల్లు దొరకడం కష్టంగా మారింది. ‘నెస్ట్అవే’ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. సాక్షి, సిటీబ్యూరో : ఈవ్ టీజింగ్ ఇబ్బందులున్నా, అక్కడక్కడా ఒంటరి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా... ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మహిళలకు అత్యంత సురక్షితమైనదని తేలింది. ఆన్లైన్ రెంటల్ కంపెనీ నెస్ట్అవే చేసిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీనితో పాటు ఉద్యోగం చేసే ఒంటరి మహిళలు వారు నివసిస్తున్న నగరాలకు సంబంధించి మరికొన్ని అంశాల్లోనూ ఈ సర్వేఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అభిప్రాయాల సేకరణ కోసం వేర్వేరు నగరాల్లోని వేర్వేరు ప్రాంతాలతో పాటు మన నగరంలోని మాదాపూర్, శంషాబాద్, గచ్చిబౌలి ప్రాంతాలలో నివసించే మహిళా ఉద్యోగులను ఎంచుకున్నారు. అద్దె తక్కువున్నా..దొరకడం కష్టమే.. ఇతర నగరాలతో పోలిస్తే అద్దె ఇల్లు కోసం హైదరాబాద్‌లో మహిళలు చాలా కష్టపడాల్సి వస్తోందని సర్వే తెలిపింది. మిగిలిన మెట్రోలతో పోలిస్తే అద్దెలు నగరంలో కొంత మేర తక్కువే అయినప్పటికీ... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు అందుబాటులో ఉండడం లేదు. ఇక అన్ని రకాలుగా తమకు నప్పే ఇల్లు కోసం అవసరానికి మించి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇంటి అద్దె వ్యయమే తమకు ఎక్కువగా ఉన్నట్టు నగర మహిళలు అభిప్రాయపడ్డారు. తమ నెల జీతాల్లో నుంచి సగానికిపైగా ఇంటి అద్దెలకు వెచ్చిస్తున్నామని అంటున్నారు. భద్రతకే ఓటు... ఇంటిని ఎంచుకోవడంలో అందుబాటులో అద్దెలు, వసతులు, రాకపోకలకు సులువుగా ఉండడం తదితర పక్కకునెట్టి, భద్రతకే మహిళలు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఇల్లు అద్దెకు లభించే ప్రాంతం సురక్షితమైనదిగా భావిస్తే తాము పనిచేసే చోటుకి 5 నుంచి 10 కి.మీ వరకు దూరమైనా సరే తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రాథామ్యాల నేపథ్యంలో పురుషుల నెలవారీ అద్దె సగటు (రూ.6,900) కన్నా మహిళల నెలవారీ సగటు అద్దె (రూ.7,250) ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఏదేమైనా... ఒంటరి మహిళకు అద్దె ఇల్లు దొరకడం నగరంలో అంత సులభం కాదని సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు అభిప్రాపడ్డారు. రకరకాల కారణాలను చెబుతూ ఇంటి యజమానులు తమకి ఇల్లు నిరాకరిస్తున్నారని ఒంటరి మహిళలు వాపోతున్నారు. -
విద్యతోనే వికాసం
ఒకప్పుడు బాలికలకు చదువెందుకులే అనే భావన అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా వరకు మారిందని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే వృత్తివిద్యా కోర్సుల ద్వారా.. అమ్మాయిల ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలని సూచించారు. ప్రతీఒక్కరి ఎదుగుదలలో చదువుదే ప్రథమ స్థానమని స్పష్టంచేశారు. మహిళా సాధికారతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి, వికారాబాద్ : ‘మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని గండేడ్ మండలం మహ్మదాబాద్. జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఉండేది. తల్లిదండ్రులు సరళాదేవి, ఆంజనేయులు. ఇద్దరూ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ పొందారు. నా విజయంలో వీరితో పాటు మా అన్నయ్య పాత్ర ఎంతో ఉంది. పదో తరగతి వరకు మా ఊరిలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో చదివా. ఇంటర్, డిగ్రీ మహబూబ్‌నగర్‌లో పూర్తిచేశా. ప్రభుత్వ ఎంబీఎస్ కాలేజీలో డిగ్రీ అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో లా, పీజీ చదివా. న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలోనే (2007లో) గ్రూప్– 1 పరీక్ష రాయగా ఉద్యోగం వచ్చింది. దీంతో బొంరాస్‌పేట్‌లో ఎంపీడీఓగా విధుల్లో చేరా. అనంతరం డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఉద్యోగం చేస్తూనే పరీక్ష రాశా. 2009లో డిప్యూటీ ఈఓ ఎంపికయ్యా. మొదటి పోస్టింగ్ జనగాంలో.. ఇక్కడే ఎనిమిది సంవత్సరాలకు పైగా పనిచేశాను. అనంతరం గత సంవత్సరం పదోన్నతిపై వికారాబాద్ జిల్లా విద్యాధికారిగా వచ్చా. ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి.. మహిళలకు అన్నింటికన్నా విద్య ప్రధానం. ఆ తర్వాత ఆర్థిక స్వావలంబనకు అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించాలి. సాంకేతికపరమైన అంశాల్లో సమాజం అతివేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. ఇలాంటి అంశాల్లో మహిళలకు అవకాశాలు ఉండేలా చూడాలి. పాఠశాలలు, కళాశాల స్థాయిల్లోనే బాలికలకు వృత్తి విద్యాకోర్సుల్లో తర్ఫీదునివ్వాలి. దీంతో స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చదువులేని మహిళలకు కూడా కొన్ని రంగాల్లో ఆసక్తి, నైపుణ్యం ఉంటుంది. ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. ఒకప్పుడు బాలిలకు చదువెందుకులే.. అనే భావన ఉండేది ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, తదితర ఒకేషనల్ కోర్సులు విరివిగా ప్రవేశపెడితే మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించడానికి ఎంతో దోహద పడుతుంది. చాపలు అల్లడం, చీరలు నేయడం తదితర స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలి. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి మహిళలకు అవకాశం కల్పించాలి. బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయాలు మంచి ఫలితాలు రాబడుతున్నాయి. బాలికల పాఠశాలలో టైలరింగ్, ఒకేషనల్ కోర్సులు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నా. ఒకేచోట అవకాశం ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సంబంధించి భార్యాభర్తలకు (వర్కింగ్ ఉమెన్) ఒకేచోట పనిచేసేలా అవకాశం కల్పించాలి. లేదంటే పిల్లల పోషణ భారం, ఇంటిపని వర్కింగ్ ఉమెన్పైనే అధికంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేస్తే పని ఒత్తిడిని ఇరువురు పంచుకునే వీలుంటుంది. దీనికి సంబంధించి జీవోలు ఉన్నా సక్రమంగా అమలు కావడంలేదు’.-జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి -
మహిళల ఆరోగ్యం కోసం..
సాక్షి, సిటీబ్యూరో: ఎంతో మంది నగర మహిళలు ఉద్యోగ వ్యాపకాల్లో తీరికలేని జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల బాగోగులు చూసుకుంటూ ఊపిరి సలపని షెడ్యూల్‌తో ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. మహిళల ఆరోగ్యమే సమాజ సౌభాగ్యంగా భావించిన ‘‘సాక్షి’ మీడియా గ్రూప్.. ‘నేను శక్తి’ పేరుతో జుహీ ఫెర్టిలిటీ సెంటర్‌తో కలిసి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 24న జేఎన్టీయూ సమీపంలోని మంజీరామాల్ వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ శిబిరంలో గైనిక్ కన్సల్టేషన్, రక్త పరీక్షలు (గ్రూప్, షుగర్), బీపీ చెకప్, బీఎండీ (ఎముకల దృఢత్వ పరీక్షలు) ఉచితంగా చేయనున్నారు. కేపీహెచ్‌బీలోని ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్ వద్ద మామోగ్రఫీపై 50 శాతం, ఐవీఎఫ్, లాప్రోస్కోపిక్ సర్జరీపై రూ.10 వేల రాయితీతో సేవలు అందించనున్నారు.అపాయింట్మెంట్ కోసం 95055 55020 నంబర్లో సంప్రదించవచ్చు. -
వర్కింగ్ హ్యూమన్
‘యు కెన్ డు’ అని ఆడవాళ్లను బయటికి పంపిస్తే సరిపోయిందా! ‘ఐ కెన్ డు ఇట్’ అని ఇంట్లో పూచికపుల్లను అటు తీసి ఇటైనా పెట్టాలి కదా ఈ మగవాళ్లు! ఇరవై ఐదేళ్ల క్రితం ఓ రోజు.. గిమీ రామెటీ కి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాలని ఐబీఎం బోర్డు రూములో ఆకస్మిక నిర్ణయం జరిగింది! రామెటీ అప్పటికే ఐబీఎంలో అత్యున్నతస్థాయి ఉద్యోగి. ‘‘ఇప్పటికిప్పుడు మీరు ఈ బాధ్యతను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారా మిస్ రామెటీ?’’ అని ఆమెను పిలిచి అడిగారు బోర్డు డైరెక్టర్లు. రామెటీ వెంటనే ‘ఎస్’ చెప్పలేదు. ‘‘ఇంటికి వెళ్లాక ఆలోచించుకుని చెబుతాను’’ అన్నారు. ఈ సంగతి తెలిసి, రామెటీ భర్త నివ్వెరపోయాడు! ‘‘అదే నీ ప్లేస్‌లో మగవాడెవరైనా ఉంటే అలా అనడు తెలుసా?’’ అన్నాడు. మర్నాడు ఆఫీసుకు వెళ్లి ఆ కీలకమైన కొత్త బాధ్యతను స్వీకరించారు రామెటీ. ఐబీఎం కంపెనీ ‘థింక్ ఫోరమ్’ కార్యక్రమానికి సోమవారం యు.ఎస్.నుండి ముంబై వచ్చినప్పుడు.. ‘అడ్వాన్సింగ్ ఉమెన్స్ లీడర్షిప్’ అనే అంశంపై మాట్లాడుతూ, ఆనాటి తన సందిగ్ధావస్థను గుర్తుచేసుకున్నారు రామెటీ. ప్రస్తుతం ఆమె ఐబీఎం చైర్మన్, ప్రెసిడెంట్, సీఈవో. 2012లో రామెటీ సీఈవో పదవిలోకి వచ్చినప్పుడు, ‘ఐబీఎం తొలి మహిళా సీఈవో’గా గుర్తింపు పొందారు. అయితే అది రామెటీకి ఇష్టం లేని గుర్తింపు. ‘నేనొక సీఈవోని. అంతే తప్ప మేల్ సీఈవోనో, ఫిమేల్ సీఈవోనో కాదు’ అని అనేవారు. అయితే కొద్దిరోజులకే తన అభిప్రాయాన్ని మార్చుకున్నారట రామెటీ. ‘‘రోల్ మోడల్‌గా ఉండటం ముఖ్యం అని నేను గ్రహించాను’’ అని తన తన ప్రసంగంలో చెప్పారు. రామెటీ భర్త, రామెటీకి ఇచ్చినట్లుగా.. ఇంట్లో మగవాళ్లు ఆడవాళ్లకు స్ఫూర్తిని, ప్రేరణను ఇవ్వగలరేమో కానీ.. ఇంటి పనుల్లో మనస్ఫూర్తిగా ఒక చెయ్యివేస్తారా అన్నది సందేహమే! ‘యు కెన్ డు’ అని ఆమెను బయటికి పంపిస్తే సరిపోయిందా? ‘ఐ కెన్ డు ఇట్’ అని ఇంట్లో పూచికపుల్లను అటు తీసి ఇటైనా పెట్టాలి కదా. అసలు ఆడవాళ్లు ఇంటిని, ఆఫీస్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎంత కష్టమో, ‘థింక్ ఫోరమ్’కి వచ్చిన ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ చెప్తుంటే.. కిరీటాలు మోస్తూ, కిచెన్‌లో పాత్రలు సర్దడం అంత తేలిక కాదనిపిస్తుంది. రామెటీ, కొచ్చర్.. ఇంకా కొంతమంది మహిళా చైర్మన్లు, సీఈవోలు కూర్చొని ఉన్నప్పుడు పిచ్చాపాటీగా ఈ విషయాలు వచ్చాయి. ‘‘మహిళ.. ఆఫీస్‌కి నూరు శాతం, ఇంటికి నూరుశాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే 200 శాతం ఇవ్వడం’’ అంటారు కొచ్చర్. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని యాడ్ చేసుకోవలసి ఉంటుంది. కంపెనీలు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా, ఇంట్లో కంపానియన్లు కూడా చక్కగా ఉంటేనే స్త్రీ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోడానికి అవకాశం కలుగుతుంది. అంటే.. స్ఫూర్తిని ఇవ్వడం ఒక్కటే కాకుండా, చేయూతనూ ఇవ్వాలి. చేయూత అనగానే మగాళ్లు భీతిల్లనక్కర్లేదు. తిండికి కాస్త లేట్ అయితే, ముఖం మాడ్చుకోకుండా ఉంటే చాలు. లేదా, ఆఫీస్ నుంచి ఆమె రావడం కాస్త ఆలస్యం అయితే, ఆలోపు ఇన్ని బియ్యం ఉడకేసి, పిల్లలకి తినిపించి పడుకోబెట్టినా చాలు. పెద్దపెద్ద కంపెనీల్లో పనిచేసే భార్యాభర్తలకి బియ్యం ఉడకేయడం, ఉల్లిపాయలు తరిగిపెట్టడం వంటివి ఉంటాయా అనుకోకండి. ఐబీఎంలో చేస్తున్నా, ఐసీఐసీఐలో చేస్తున్నా ఇల్లు ఇల్లే. మహిళ.. ఆఫీస్‌కి నూరు శాతం, ఇంటికి నూరుశాతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అంటే 200 శాతం ఇవ్వడం’’ – చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంక్ సీఈవో అదే నీ ప్లేస్‌లో మగవాడెవరైనా ఉంటే అలా అనడు తెలుసా?’’ అని విస్తుపోయాడు నా భర్త! – గిమీ రామెటీ, ఐ.బి.ఎం. సీఈవో -
70శాతం ఉద్యోగినులు ఫిర్యాదు చేయడంలేదట!
న్యూఢిల్లీ: 'పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013' అమల్లోకి వచ్చినప్పటీకి దేశ వ్యాప్తంగా లైంగిక వేధింపులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య మాత్రం గణనీయంగా లేదట. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి సగానికిపైగా ఉద్యోగినులు ముందుకు రావడంలేదని ఓ సర్వేలో తేలింది. ఫిర్యాదు తదనంతర పరిణామాలకు భయపడి 70శాతం మహిళలు ఫిర్యాదు చేయడంలేదని తేలింది. ముఖ్యంగా యజమాని లేదా పై అధికారి వేధింపులను మౌనంగా భరించడానికే మొగ్గు చూపుతున్నారని తేలింది. ది ఇండియన్ బార్ అసోసియేషన్ 2017లో నిర్వహించిన ఓ సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. ఒకవైపు మారుతున్న ఆర్థిక అవసరాల రీత్యా మహిళలుకూడా ఉద్యోగాల చేయాల్సి పరిస్థితి.మరోవైపు దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు, బహుళజాతి సంస్థల కార్యాలయాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటవుతున్న నేపథ్యంలో ఉద్యోగినుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అయితే ఉద్యోగినులపై లైంగిక వేధింపుల నిరోధానికి 2013లో కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో ఆశించినంతగా మార్పు రాలేదని సర్వేలో తేలింది. మరోవైపు కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి 2014 , 2015 సంవత్సరాల్లో ఆఫీసు ఆవరణల్లో లైంగిక వేధింపుల కేసులు రెట్టింపు అయ్యాయని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య 57-119కి పెరిగినట్టు ఈ లెక్కలు చెబుతున్నాయి. అలాగే 2015 లో ఇతర ప్రదేశాలలో లైంగిక వేధింపు కేసులు 2014లో 469 కేసులతో పోలిస్తే 51శాతం పెరిగాయి. కాగా దేశంలో 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరువాత లైంగిక వేధింపుల నిరోధకచట్టాన్నికేంద్రం తీసుకొచ్చింది. మానవ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే ముఖ్యంగా ఉద్యోగినుల్లో భద్రతా భావం పెరగాలని ఫిక్కీ లాంటి సంస్థలు గతంలోనే సూచించాయి. అలాగే పనిచేసే చోట లైంగిక వేధింపుల్ని అరికట్టేందుకు కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. -
పెళ్లయిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారట!
ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవడం మహిళలకు చాలా కష్టం అనుకుంటాం కదూ. కానీ, పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారట. ఈ విషయం ఇటీవలే విడుదల చేసిన 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలిసింది. పెళ్లి కాని వాళ్లు కేవలం 21 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే.. పెళ్లయిన వాళ్లలో మాత్రం 41 శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారట. పెళ్లికాని వాళ్లు యువతులు కావడంతో వాళ్ల తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు పంపడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఇంకా స్కూళ్లు లేదా కాలేజీలలో చదువుకుంటున్నారు. అలాగే.. రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నవాళ్లు తమకు పిల్లలు తక్కువ మంది ఉంటేనే మేలని భావిస్తున్నారు, అందులోనూ కనీసం ఒక కొడుకు ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. ఇక ఉద్యోగం చేయని మహిళల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదట. వాళ్లు కేవలం తమ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవుతున్నారని, ఉద్యోగాలు చేయని మహిళల కంటే వీళ్లు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తేలింది. దశాబ్దం క్రితం పిల్లలను కనగల వయసులో ఒక్కో మహిళకు సగటున 3.3 మంది పిల్లలు పుడుతుంటే, ఇప్పుడు అది 2.9కు పడిపోయింది. ఇది ఉద్యోగాలు చేసేవాళ్లకు సంబంధించినది. చేయని వాళ్లలో మాత్రం ఇది 3.1గానే ఉంది. లింగనిష్పత్తి మాత్రం రెండు వర్గాల్లోనూ బాగానే పడిపోయింది. 2001లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యిమంది బాలురకు 912 మంది బాలికలుండగా, ఇప్పుడది 901కి పడిపోయింది. ఉద్యోగాలు చేయనివారి విషయంలో అది 901 నుంచి 894కి తగ్గింది. మహిళలకు గర్భంలో ఉన్నది ఆడపిల్లలని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. -
వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్
బొటిక్, డిజైనర్ దుస్తులు అనగానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని అనుకోవడం సహజం. అయితే ఎకానమీ రేట్లలో, యూనిక్ దుస్తులు లభిస్తాయంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. అలా మహిళల డిజైనర్ దుస్తులను రీజనబుల్ ధరల్లో అందరికీ అందుబాటులోనికి తేవాలనే ప్రయత్నాలు నగరంలోని డిజైనర్లు మొదలుపెట్టారు. వినూత్న బ్రైడల్ ప్యాకేజీలు, కుర్తాలు, డిజైనర్ చీరలు, బ్లౌజ్‌లు, గాగ్రాలు, అనార్కలీలతో పాటు వర్కింగ్ వుమెన్ కోసం ప్రత్యేక వెరైటీలు రూపొందిస్తున్నారు. రోజువారీ నుంచి పెళ్లి దుస్తుల వరకు అన్నింటినీ అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వెరసి వెరైటీ డ్రెస్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా నగరం నిలుస్తోంది. వధువు పెళ్లి బట్టలతో పాటు వధువు కుటుంబ సభ్యుల దుస్తుల బాధ్యత అంతా ఒక ప్యాకెజ్లా అందించే ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్యాకేజ్‌లో వధువు తల్లితండ్రులు, తోబుట్టువులు ఇలా సభ్యుల సంఖ్య, అలాగే వారు ఎంచుకునే దుస్తుల డిజైన్లను బట్టి ప్యాకేజీలు ఉంటారుు. స్పెషల్ బ్లౌజెస్... డిజిటల్ ప్రింట్ ఉన్న మెటీరియల్‌తో స్టిచ్ చేసిన చూడీ స్లీవ్స్ బ్లౌజ్. చక్కటి కట్స్, ఫిట్టింగ్తో నేటి యువతను ఆకట్టుకునే ఈ ట్రెండీ బ్లౌజ్‌ని ప్లెరుున్ చీరలతోనే కాకుండా రకరకాల చీరలపై మ్యాచ్ చేసుకోవచ్చు. సింపుల్ వర్క్ చేసిన గ్రే కలర్ శారీకి హైనెక్‌తో వున్న రెడ్ కలర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపిస్తుంది. కట్‌దానా మెటీరియల్‌పై పూర్తిగా హ్యాండ్ వర్క్ చేసిన ఈ బ్లౌజ్‌ని పలు రకాల చీరలకే కాదు గాగ్రాలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎల్లో పసువు రంగులతో డై చేసిన చక్కటి నిట్ వర్క్ బ్లౌజ్. పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఫినిషింగ్ వున్న లేటెస్ట్ ట్రెండ్ బ్లౌజ్‌ని ఇలా హాఫ్ శారీలకు మాత్రమే కాక చీరలకు కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. డిజైనర్ చీరలు... బ్లౌజ్‌లు, కుర్తాలు, డ్రెస్సులతో పాటు డిజైనర్ చీరలు రూపొందిస్తున్నారు. కోటా మెటీరియల్‌ని ఆరెంజ్, బ్లూ రంగులతో డై చేసి అందమైన చీరలుగా వులుస్తున్నారు. కట్‌వర్క్ చేసిన చీర అంచులకు కుందన్, ముత్యాలను చేతితో కుట్టి చూడచక్కగా తయూరు చేస్తున్నారు. కలంకారీ వర్క్‌ని ఎక్కువగా లేటెస్ట్ దుస్తుల డిజైన్లలో వాడుతున్నారు. సహజమైన రంగులతో చేసే ఈ వర్క్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగువారి కోసం, తెలుగు వారికి నచ్చే దుస్తుల రూపకల్పన చేస్తుంటాం. ఏ ప్రాంతం వారికైనా వారి ప్రాంతం, వారి ఇష్టాఇష్టాలు బాగా తెలుస్తాయి. అలా నేటివిటీ, టేస్ట్‌తో పాటు వచ్చిన కస్టమర్ అభిరుచి, రూపురేఖలకు అనుగుణంగా దుస్తులు తయారు చేస్తాం. అలాగే మా సర్వీసులు ఎక్కువగా ఆన్లైన్ ద్వారా అందుబాటులో వున్నాయి. విదేశాల్లో, ఇతర నగరాల్లో వున్న వనితల అవసరాలకు తగిన విధంగా దుస్తులు రెడీ చేసి ఇస్తుంటాం. - లతాశ్రీ, లాష్ స్టూడియో -
సాయమడగండి... తప్పు లేదు!
వాయనం: ‘ఓ పక్క ఆఫీసులో చాకిరీ చేసి రావాలి... ఇంట్లో పనీ నేనే చేయాలి, నాకు మాత్రం విశ్రాంతి అవసరం లేదా?’... చాలామంది వర్కింగ్ ఉమన్ తరచుగా అనే మాట ఇది. భర్తతో సమానంగా భార్య సంపాదిస్తున్నా, భార్యతో సమానంగా భర్త ఇంటి పని చేయడం ఎక్కడో కానీ కనిపించదు. దానికి కారణాలు రెండు. ఇంటి పని చేయడం ఆడవాళ్ల బాధ్యత అని మగవాళ్లు అనుకోవడం, రెండోది... తనకు సాయం అవసరం అన్న విషయాన్ని భార్యలు భర్తలకు అర్థమయ్యేలా చెప్పలేకపోవడం. చాలామంది భార్యలు రెండు బాధ్యతలనూ నిర్వర్తించలేక అవస్తపడుతుంటారు. తమలో తామే కుమిలిపోతుంటారు తప్ప తమ అవస్థను భర్తకు అర్థమయ్యేలా చెప్పరు. దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? పైగా కొందరైతే... ఏం చేస్తాం, వాళ్లకు తప్పినా మనకు తప్పదు కదా అంటుంటారు. అదీ సరికాదు. ఇంటిని నిలబెట్టుకోవడం కోసం మీకు ఉద్యోగం చేయడం తప్పడం లేదు. అలాంటప్పుడు ఇంటి పనులు చేయడం అతడికి మాత్రం ఎందుకు తప్పుతుంది? ఈ సమస్యను తీర్చుకోవడం కచ్చితంగా ఇల్లాలి చేతిలోనే ఉంది. మీరు మౌనంగా చేసుకుంటూ పోతే, చేయగలుగుతోంది కదా అనుకుంటారు. అందుకే మీరెంత కష్టపడుతున్నారో, ఎంతగా అలసిపోతున్నారో వారికి వివరించండి. కాస్త పనిని పంచుకోమని అడగండి. మరీ వంటిల్లు శుభ్రం చేయడం, వంట చేయడం లాంటివి చేయలేకపోయినా... బట్టలు వాషింగ్ మెషీన్లో వేయడం, తీసి ఆరబెట్టడం, ఆరినవి మడత పెట్టడం, పక్కలు సర్దడం, పిల్లలను స్కూలుకు రెడీ చేయడం వంటివి వారు చేయగలరు కదా! అలాంటివి వారిని చేయమనండి. అది మానేసి వారంతట వారే వచ్చి మీకు సాయం చేసేయాలని మాత్రం చూడకండి. కొందరు చెప్పకుండానే అర్థం చేసుకుంటారు. కొందరు చెబితేగానీ గ్రహించరు. మీ భర్త మొదటి కోవకు చెందినవారైతే సమస్య లేదు. ఒకవేళ రెండో కోవకు చెందినవారైతే మాత్రం మీరు వారితో మాట్లాడి తీరాల్సిందే. అర్థమయ్యేలా చెప్పాల్సిందే. సంపాదించే బాధ్యతను ఎలా పంచుకున్నామో, ఇంటిని తీర్చిదిద్దుకునే బాధ్యతను కూడా అలానే పంచుకుందాం అని చెబితే మీవారు తప్పక అర్థం చేసుకుంటారు. అడగందే అమ్మయినా పెట్టదంటారు. ఆయన మాత్రం ఎలా చేసేస్తారు? కాబట్టి ధైర్యంగా మీవారిని సాయమడగండి... తప్పు లేదు! హాట్‌డాగ్స్... హాట్ హాట్‌గా! హాట్‌డాగ్... పాశ్చాత్య దేశాల్లో పుట్టి మన దేశ బేకరీల్లో తిష్ట వేసుక్కూచున్న స్నాక్ ఇది. పట్టణాల్లోనే కాదు, గ్రామాల్లో వారికి కూడా దీని రుచి పరిచయమై చాలా కాలమైంది. అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం పెద్ద పని. ఒకవేళ బయటి నుంచి తీసుకొద్దామన్నా ఇంటికొచ్చేసరికి చల్లారిపోతాయి. వాటిని వేడి చేయాలంటే మైక్రో అవన్ ఉండాలి. అది కొనాలంటే బోలెడు డబ్బులుండాలి. కానీ అంత పెట్టక్కర్లేకుండా పనైపోయే మార్గం ఒకటుంది! ఈ ఫొటోలో కనిపిస్తున్న యంత్రాన్ని హాట్‌డాగ్ టోస్టర్ అంటారు. చల్లారిపోయిన హాట్‌డాగ్స్‌ను చిటికెలో వేడి చేసేస్తుందిది. ఇది ఇంట్లో ఉంటే చక్కగా బన్స్, ఫిల్లింగ్స్ని తెచ్చి ఫ్రిజ్‌లో దాచి పెట్టుకోవచ్చు. పిల్లలు బడి నుంచి వచ్చాక, మీరు-మీవారు ఆఫీసుల నుంచి వచ్చాక అప్పటికప్పుడు వీటిని టోస్టర్లో పెట్టేస్తే... పది,పదిహేను నిమిషాల్లో వేగిపోతాయి. వేడి వేడిగా ఆరగించవచ్చు. పిక్నిక్స్కి వెళ్లినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని వెల రెండు వేల వరకూ ఉన్నా ఆన్లైన్ స్టోర్స్‌లో రూ.1775కే లభిస్తోంది! -
మహిళలు...మహరాణులు