వికారాబాద్ జిల్లా విద్యాధికారి జి.రేణుకాదేవి
ఒకప్పుడు బాలికలకు చదువెందుకులే అనే భావన అధికంగా ఉండేదని, ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా వరకు మారిందని వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి అన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే వృత్తివిద్యా కోర్సుల ద్వారా.. అమ్మాయిల ఉపాధి అవకాశాలకు బాటలు వేయాలని సూచించారు. ప్రతీఒక్కరి ఎదుగుదలలో చదువుదే ప్రథమ స్థానమని స్పష్టంచేశారు. మహిళా సాధికారతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి, వికారాబాద్ : ‘మాది మహబూబ్‌నగర్ జిల్లాలోని గండేడ్ మండలం మహ్మదాబాద్. జిల్లాల పునర్విభజనకు ముందు ఈ గ్రామం వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలో ఉండేది. తల్లిదండ్రులు సరళాదేవి, ఆంజనేయులు. ఇద్దరూ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ పొందారు. నా విజయంలో వీరితో పాటు మా అన్నయ్య పాత్ర ఎంతో ఉంది. పదో తరగతి వరకు మా ఊరిలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో చదివా. ఇంటర్, డిగ్రీ మహబూబ్‌నగర్‌లో పూర్తిచేశా. ప్రభుత్వ ఎంబీఎస్ కాలేజీలో డిగ్రీ అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో లా, పీజీ చదివా. న్యాయవాద విద్యను అభ్యసించే సమయంలోనే (2007లో) గ్రూప్– 1 పరీక్ష రాయగా ఉద్యోగం వచ్చింది. దీంతో బొంరాస్‌పేట్‌లో ఎంపీడీఓగా విధుల్లో చేరా. అనంతరం డిప్యూటీ ఈఓ పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఉద్యోగం చేస్తూనే పరీక్ష రాశా. 2009లో డిప్యూటీ ఈఓ ఎంపికయ్యా. మొదటి పోస్టింగ్ జనగాంలో.. ఇక్కడే ఎనిమిది సంవత్సరాలకు పైగా పనిచేశాను. అనంతరం గత సంవత్సరం పదోన్నతిపై వికారాబాద్ జిల్లా విద్యాధికారిగా వచ్చా.
ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి..
మహిళలకు అన్నింటికన్నా విద్య ప్రధానం. ఆ తర్వాత ఆర్థిక స్వావలంబనకు అవసరమైన వసతులను ప్రభుత్వం కల్పించాలి. సాంకేతికపరమైన అంశాల్లో సమాజం అతివేగంగా పురోభివృద్ధి సాధిస్తోంది. ఇలాంటి అంశాల్లో మహిళలకు అవకాశాలు ఉండేలా చూడాలి. పాఠశాలలు, కళాశాల స్థాయిల్లోనే బాలికలకు వృత్తి విద్యాకోర్సుల్లో తర్ఫీదునివ్వాలి. దీంతో స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. చదువులేని మహిళలకు కూడా కొన్ని రంగాల్లో ఆసక్తి, నైపుణ్యం ఉంటుంది. ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహించాలి. ఒకప్పుడు బాలిలకు చదువెందుకులే.. అనే భావన ఉండేది ప్రస్తుతం చాలా మార్పు వచ్చింది. ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, తదితర ఒకేషనల్ కోర్సులు విరివిగా ప్రవేశపెడితే మహిళలు ఆర్థికంగా ప్రగతి సాధించడానికి ఎంతో దోహద పడుతుంది. చాపలు అల్లడం, చీరలు నేయడం తదితర స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు కల్పించాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో అభివృద్ధి చెందడానికి మహిళలకు అవకాశం కల్పించాలి. బాలికల కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బా విద్యాలయాలు మంచి ఫలితాలు రాబడుతున్నాయి. బాలికల పాఠశాలలో టైలరింగ్, ఒకేషనల్ కోర్సులు ఏర్పాటుచేస్తే బాగుంటుంది. జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నా.
ఒకేచోట అవకాశం ఇవ్వాలి
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు సంబంధించి భార్యాభర్తలకు (వర్కింగ్ ఉమెన్) ఒకేచోట పనిచేసేలా అవకాశం కల్పించాలి. లేదంటే పిల్లల పోషణ భారం, ఇంటిపని వర్కింగ్ ఉమెన్‌పైనే అధికంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకేచోట పనిచేస్తే పని ఒత్తిడిని ఇరువురు పంచుకునే వీలుంటుంది. దీనికి సంబంధించి జీవోలు ఉన్నా సక్రమంగా అమలు కావడంలేదు’.-జి.రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment