అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే! | Women Back to Work After Career Breaks in India | Sakshi
Sakshi News home page

అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!

Published Sun, Apr 17 2022 12:15 AM | Last Updated on Sun, Apr 17 2022 12:15 AM

Women Back to Work After Career Breaks in India - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రన్నింగ్‌ రేస్‌ ట్రాక్‌ సిద్ధంగా ఉంది. పోటీదారులందరూ పరుగుకు సిద్ధంగా ఉన్నారు. విజిల్‌ వినిపించగానే వింటి నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాలనే కసి వారందరిలో సమానంగా ఉంది. ఉన్నట్లుండి... ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు... ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఓ అథ్లెట్‌ కాలికి ఓ బంధనం చుట్టుకుంది. అయినా పట్టించుకోకుండా పరుగు మొదలు పెట్టినప్పటికీ కాలు తేలికగా నేలను తాకడం లేదు. బరువుగా కదులుతోంది. మనసులో అలజడి. మెదడు నిండా ప్రశ్నలు... ఆందోళన పెరిగిపోతోంది. పోటీ నుంచి తప్పుకోవడమా లేక పోటీదారుల జాబితాలో ఆఖరున నిలబడడమా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇదీ ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ పరిస్థితి.  
 
ఎల్‌కేజీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు అబ్బాయిలతో సమానంగా దీటుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న మహిళ... తల్లి కావడం కోసం కెరీర్‌లో రాజీ పడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ప్రైవేట్‌ రంగంలో అంత సులువుగా ఏమీ జరగడం లేదు. ఆ విరామాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బిడ్డ పెరిగిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా తమ ఉద్యోగం నిత్యపోరాటం దినదినగండంగానే ఉంటోంది. ఇంట్లో ఏ అవసరం వచ్చినా అందరి కళ్లూ ‘ఆమె ఉద్యోగం’ వైపే మళ్లుతాయి. ‘ఉద్యోగం మానేయచ్చు కదా’ ఉచిత సలహాల పర్వం మొదలవుతుంది.
 
ఏది మంచి పరిష్కారం?
రజని ఓ పెద్ద ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌. భర్త కూడా ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజ్‌కొచ్చారు. అత్తగారికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్‌లో చేర్చి మంచి ట్రీట్‌మెంట్‌ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చారు. పరామర్శకు వచ్చిన బంధువులందరిదీ ఒకటే సలహా. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్లి పోతే ఎలాగ! ఆమెకు తోడుగా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా! మంచిదే... ఆ ఒకరు ఎవరు? అందరి తీర్పూ ‘ఆమె ఉద్యోగం’ మీదనే.

‘ఉదయం నేను అన్నీ అమర్చి వెళ్తాను. అత్తమ్మను రోజంతా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్‌ అసిస్టెంట్‌ లేదా నర్సును పెట్టుకుంటాను. నేను ఉద్యోగం మానడం కంటే మరొకరికి ఉద్యోగం కల్పించడం మంచి పరిష్కారమేమో కదా... ఆలోచించండి’ అని చెప్పి చూసింది రజని. ఆ పరిష్కారం ఎవరికీ నచ్చడం లేదు. ఎవరి ముఖంలోనూ ప్రసన్నత లేదు. మారు మాట్లాడకుండా ఉద్యోగం మానేసింది రజని. నాలుగు నెలలకు అత్తగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్దామంటే స్కూల్లో తన ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తూ ఉండదు.

అప్పటికీ ఏ క్లాస్‌ ఇస్తే ఆ క్లాసు చెప్పడానికి సిద్ధమై వెళ్లింది. ‘అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో అలా మానేశారు. పిల్లలకు సిలబస్‌ పూర్తి కావాలి కదా వేరే టీచర్‌ని అపాయింట్‌ చేశాం. ఎవరైనా మానేసినప్పుడు ‘అవసరమైతే’ తెలియచేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్‌... ఇక మీరు వెళ్లవచ్చు అనే అర్థాన్ని ధ్వనింపచేస్తూ. ‘ఆ అవసరం’ రాకపోవచ్చనే భావం కూడా అవగతమైంది రజనికి. ప్రసూతి విరామాన్ని స్వీకరించడానికి, ఆ మేరకు కెరీర్‌లో వెనుకబాటును స్వాగతించడానికి మాతృత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కోడలి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగంలో కొనసాగడానికి, మల్టీటాస్కింగ్‌కి కూడా తాను సిద్ధమే. కానీ ఈ నిర్ణయం ఒప్పనే వాళ్లేరి?
 
రజనిలాగ ఎందరో!

ఇది ఒక్క రజని సమస్య మాత్రమే కాదు. సాఫ్ట్‌వేర్, ఇతర కార్పొరేట్‌ రంగాలలో మహిళలకు కూడా దాదాపుగా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కుటుంబ కారణాలరీత్యా ఉద్యోగం మానేసిన వాళ్లు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చిన్న సవాల్‌ కాదు. అన్ని రకాల అడ్డంకులనూ ఎదుర్కొని కేవలం 27 శాతం మహిళలు మాత్రమే తిరిగి ఉద్యోగినులవుతున్నారు.

వారిలో పదహారు శాతం మాత్రమే కొత్త ఉద్యోగాన్ని తన సమర్థతకు దీటుగా సంపాదించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక కోణం మాత్రమే. నాణేనికి మరో వైపు పరిశీలిస్తే అంతులేని ఆందోళన కలుగుతోంది. కుటుంబ అవసరాల కారణంగా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో కనీసంగా మనిషిగా కూడా చూడడం లేదనే ఆవేదనతో కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. చివరికి వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు న్యాయవాది పార్వతి.
 
చేజార్చుకుంటే కష్టమే!

‘‘నా క్లయింట్‌ ఒకావిడ ఉన్నత చదువులు చదివింది. భార్యాభర్తలు యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను ఉద్యోగం మానేయమని భర్త నుంచి ఒత్తిడి మొదలైంది. ‘అతడి తల్లిదండ్రులు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉండడానికి వస్తున్నారు. వాళ్లను సౌకర్యంగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయమని’ అతడి డిమాండ్‌. ‘అంత చదివి ఉద్యోగంలో కీలక స్థాయికి చేరిన దశలో ఉద్యోగం మానేస్తే తిరిగి ఇలాంటి ఉద్యోగం తెచ్చుకోవడం సాధ్యం కాద’నేది ఆమె వాదన.

ఒకవేళ ఆమె భర్త ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగం మానేస్తే... ఆరు నెలల తర్వాత ఆమె తిరిగి వెళ్లేసరికి ఆమె ఉద్యోగం ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సంస్థలు కూడా ఆమెకిచ్చే జీతంతో ఇద్దరు జూనియర్‌లను చేర్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాయి. మహిళలు మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అయితే ఆ ఉద్యోగాన్ని కొనసాగించడంలో మాత్రం మన భారతీయ సమాజంలో ఆమెకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్‌లు, లాయర్‌లను సంప్రదిస్తున్న మహిళలే అందుకు ఉదాహరణ’’ అంటారామె.  

‘ఆమెను ఉద్యోగం చేయనిస్తున్నాం కదా’ అని తమ విశాలత్వాన్ని చాటుకునే భర్తలకు కొదవలేదు. అలాగే తాము ఎప్పుడు మానేయమంటే అప్పుడు మానేయడమే ఆమె ముందున్న ఆప్షన్‌ అనే ధోరణికి కూడా కొదవలేదు. చివరికి ‘ఆమె ఉద్యోగం’ ఆమెది కాకుండా పోతోంది.  

చట్టం అందరికీ ఒక్కటే! కానీ...
మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 1961లో వచ్చింది. అప్పుడు పన్నెండు వారాల వేతనంతో కూడిన సెలవు ఉండేది. తర్వాత 26 వారాలకు పొడిగించింది ప్రభుత్వం. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే అమలవుతున్నాయి. ప్రైవేట్‌ రంగంలో ఎక్కువ కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రానివే ఉంటున్నాయి. ప్రైవేట్‌ సెక్టార్‌లో యాభై మంది ఉద్యోగులున్న సంస్థ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. దాంతో అనేక చిన్న చిన్న కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఈ పరిస్థితి ఆ కంపెనీల్లో పని చేసే మహిళలకు పెద్ద సమస్యగా మారుతోంది. డెలివరీ తర్వాత, కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగంలో విరామం తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది.  
– పార్వతి, న్యాయవాది

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement