womens jobs
-
వొడా–ఐడియా యాప్‌తో మహిళలకు ఉద్యోగావకాశాలు
ముంబై: జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ అప్నాతో కలిసి తమ యాప్ ద్వారా మహిళలకు ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టెలికం సంస్థ వొడాఫోన్–ఐడియా (వీఐ) తెలిపింది. దీని ద్వారా టీచర్ల నుంచి టెలీకాలర్లు, రిసెప్షనిస్టుల వరకూ వేల సంఖ్యలో పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే, టెలీ–కాలర్లు కాద ల్చుకునే మహిళలకు రూ. 5,000 డిస్కౌంటుతో ప్లేస్మెంట్ గ్యారంటీ శిక్షణ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తున్నామని వివరించింది. అటు ఎన్గురుతో కలిసి 50 శాతం డిస్కౌంటుతో ఇంగ్లీష్ శిక్షణా కోర్సులనూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు మార్చి 14 వరకూ వీఐ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. -
పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై మహిళల ఆసక్తి
న్యూఢిల్లీ: అవసరాల రీత్యానే కాకుండా ఆర్థిక స్వాతంత్య్రం కోసం కూడా ఉద్యోగాలు చేయాలనుకునే మహిళల సంఖ్య పెరుగుతోంది. తీవ్ర పోటీతో కూడుకున్న జాబ్ మార్కెట్లో తమకంటూ గుర్తింపు సాధించుకోవాలని వారు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా శ్రమతో కూడుకున్నవి, నైట్ షిఫ్టులు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నారు. 2022లో ట్రెండ్స్‌కి సంబంధించి ఉద్యోగాలు, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం ’అప్నా’ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం పార్ట్ టైమ్ ఉద్యోగాలకు మహిళల నుంచి వచ్చిన దరఖాస్తులు 67 శాతం పెరిగాయి. అదే సమయంలో ఫుల్ టైమ్ ఉద్యోగాలకు వచ్చిన అప్లికేషన్లు 34 శాతమే పెరిగాయి. అటు నైట్ షిఫ్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న మహిళల సంఖ్య 60 శాతం పెరిగింది. శ్రమ ఎక్కువగా ఉండే డెలివరీ, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫ్యాక్టరీ వర్కర్లు, డ్రైవర్ల ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 34 శాతం పెరిగినట్లు అప్నాడాట్‌కో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. పేటీఎం, జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ వంటి కంపెనీలు తమ కార్యాలయాల్లో సిబ్బందిపరమైన వైవిధ్యాన్ని పాటించేందుకు మహిళల కోసం అత్యధికంగా ఉద్యోగాలను పోస్ట్ చేశాయి. హైదరాబాద్, చెన్నైలాంటి పెద్ద నగరాలతో పాటు ఇండోర్‌లాంటి చిన్న పట్టణాల్లోనూ పోస్టింగ్‌లు 28 శాతం పెరిగినట్లు అప్నా నివేదిక పేర్కొంది. -
అందరి తీర్పూ ఆమె ఉద్యోగంపైనే!
రన్నింగ్ రేస్ ట్రాక్ సిద్ధంగా ఉంది. పోటీదారులందరూ పరుగుకు సిద్ధంగా ఉన్నారు. విజిల్ వినిపించగానే వింటి నుంచి వదిలిన బాణంలా దూసుకుపోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరికంటే ముందు లక్ష్యాన్ని చేరాలనే కసి వారందరిలో సమానంగా ఉంది. ఉన్నట్లుండి... ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు... ఉరకడానికి సిద్ధంగా ఉన్న ఓ అథ్లెట్ కాలికి ఓ బంధనం చుట్టుకుంది. అయినా పట్టించుకోకుండా పరుగు మొదలు పెట్టినప్పటికీ కాలు తేలికగా నేలను తాకడం లేదు. బరువుగా కదులుతోంది. మనసులో అలజడి. మెదడు నిండా ప్రశ్నలు... ఆందోళన పెరిగిపోతోంది. పోటీ నుంచి తప్పుకోవడమా లేక పోటీదారుల జాబితాలో ఆఖరున నిలబడడమా? ఎటూ తేల్చుకోలేని నిస్సహాయత. ఇదీ ఉద్యోగం చేస్తున్న సగటు మహిళ పరిస్థితి. ఎల్కేజీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అబ్బాయిలతో సమానంగా దీటుగా తన ఉనికిని నిలబెట్టుకుంటున్న మహిళ... తల్లి కావడం కోసం కెరీర్లో రాజీ పడక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరడం ప్రైవేట్ రంగంలో అంత సులువుగా ఏమీ జరగడం లేదు. ఆ విరామాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బిడ్డ పెరిగిన తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరిన మహిళలకు కూడా తమ ఉద్యోగం నిత్యపోరాటం దినదినగండంగానే ఉంటోంది. ఇంట్లో ఏ అవసరం వచ్చినా అందరి కళ్లూ ‘ఆమె ఉద్యోగం’ వైపే మళ్లుతాయి. ‘ఉద్యోగం మానేయచ్చు కదా’ ఉచిత సలహాల పర్వం మొదలవుతుంది. ఏది మంచి పరిష్కారం? రజని ఓ పెద్ద ప్రైవేట్ స్కూల్లో టీచర్. భర్త కూడా ఉద్యోగి. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ కాలేజ్కొచ్చారు. అత్తగారికి వయసు రీత్యా అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. హాస్పిటల్లో చేర్చి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకువచ్చారు. పరామర్శకు వచ్చిన బంధువులందరిదీ ఒకటే సలహా. ఇంట్లో అందరూ ఉద్యోగాలకు, చదువులకు వెళ్లి పోతే ఎలాగ! ఆమెకు తోడుగా ఒకరు ఇంట్లో ఉంటే మంచిది కదా! మంచిదే... ఆ ఒకరు ఎవరు? అందరి తీర్పూ ‘ఆమె ఉద్యోగం’ మీదనే. ‘ఉదయం నేను అన్నీ అమర్చి వెళ్తాను. అత్తమ్మను రోజంతా చూసుకోవడానికి ఒక డొమెస్టిక్ అసిస్టెంట్ లేదా నర్సును పెట్టుకుంటాను. నేను ఉద్యోగం మానడం కంటే మరొకరికి ఉద్యోగం కల్పించడం మంచి పరిష్కారమేమో కదా... ఆలోచించండి’ అని చెప్పి చూసింది రజని. ఆ పరిష్కారం ఎవరికీ నచ్చడం లేదు. ఎవరి ముఖంలోనూ ప్రసన్నత లేదు. మారు మాట్లాడకుండా ఉద్యోగం మానేసింది రజని. నాలుగు నెలలకు అత్తగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్దామంటే స్కూల్లో తన ఉద్యోగం తన కోసం ఎదురు చూస్తూ ఉండదు. అప్పటికీ ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాసు చెప్పడానికి సిద్ధమై వెళ్లింది. ‘అకడమిక్ ఇయర్ మధ్యలో అలా మానేశారు. పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి కదా వేరే టీచర్ని అపాయింట్ చేశాం. ఎవరైనా మానేసినప్పుడు ‘అవసరమైతే’ తెలియచేస్తాం’ అన్నారు ప్రిన్సిపల్... ఇక మీరు వెళ్లవచ్చు అనే అర్థాన్ని ధ్వనింపచేస్తూ. ‘ఆ అవసరం’ రాకపోవచ్చనే భావం కూడా అవగతమైంది రజనికి. ప్రసూతి విరామాన్ని స్వీకరించడానికి, ఆ మేరకు కెరీర్లో వెనుకబాటును స్వాగతించడానికి మాతృత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కోడలి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉద్యోగంలో కొనసాగడానికి, మల్టీటాస్కింగ్‌కి కూడా తాను సిద్ధమే. కానీ ఈ నిర్ణయం ఒప్పనే వాళ్లేరి? రజనిలాగ ఎందరో! ఇది ఒక్క రజని సమస్య మాత్రమే కాదు. సాఫ్ట్వేర్, ఇతర కార్పొరేట్ రంగాలలో మహిళలకు కూడా దాదాపుగా ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కుటుంబ కారణాలరీత్యా ఉద్యోగం మానేసిన వాళ్లు తిరిగి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం చిన్న సవాల్ కాదు. అన్ని రకాల అడ్డంకులనూ ఎదుర్కొని కేవలం 27 శాతం మహిళలు మాత్రమే తిరిగి ఉద్యోగినులవుతున్నారు. వారిలో పదహారు శాతం మాత్రమే కొత్త ఉద్యోగాన్ని తన సమర్థతకు దీటుగా సంపాదించుకోగలుగుతున్నారు. మిగిలిన వాళ్లు దొరికిన ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఒక కోణం మాత్రమే. నాణేనికి మరో వైపు పరిశీలిస్తే అంతులేని ఆందోళన కలుగుతోంది. కుటుంబ అవసరాల కారణంగా ఉద్యోగం మానేసినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో కనీసంగా మనిషిగా కూడా చూడడం లేదనే ఆవేదనతో కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు. చివరికి వైవాహిక బంధాన్ని వదులుకోవడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు న్యాయవాది పార్వతి. చేజార్చుకుంటే కష్టమే! ‘‘నా క్లయింట్ ఒకావిడ ఉన్నత చదువులు చదివింది. భార్యాభర్తలు యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెను ఉద్యోగం మానేయమని భర్త నుంచి ఒత్తిడి మొదలైంది. ‘అతడి తల్లిదండ్రులు ఆరు నెలల పాటు యూఎస్‌లో ఉండడానికి వస్తున్నారు. వాళ్లను సౌకర్యంగా చూసుకోవడం కోసం భార్యను ఉద్యోగం మానేయమని’ అతడి డిమాండ్. ‘అంత చదివి ఉద్యోగంలో కీలక స్థాయికి చేరిన దశలో ఉద్యోగం మానేస్తే తిరిగి ఇలాంటి ఉద్యోగం తెచ్చుకోవడం సాధ్యం కాద’నేది ఆమె వాదన. ఒకవేళ ఆమె భర్త ఒత్తిడికి తలొగ్గి ఉద్యోగం మానేస్తే... ఆరు నెలల తర్వాత ఆమె తిరిగి వెళ్లేసరికి ఆమె ఉద్యోగం ఆమె కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. సంస్థలు కూడా ఆమెకిచ్చే జీతంతో ఇద్దరు జూనియర్లను చేర్చుకోవచ్చని లెక్కలు వేసుకుంటాయి. మహిళలు మగవాళ్లతో సమానంగా చదువుతున్నారు, ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. అయితే ఆ ఉద్యోగాన్ని కొనసాగించడంలో మాత్రం మన భారతీయ సమాజంలో ఆమెకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. ఫ్యామిలీ కౌన్సిలర్లు, లాయర్లను సంప్రదిస్తున్న మహిళలే అందుకు ఉదాహరణ’’ అంటారామె. ‘ఆమెను ఉద్యోగం చేయనిస్తున్నాం కదా’ అని తమ విశాలత్వాన్ని చాటుకునే భర్తలకు కొదవలేదు. అలాగే తాము ఎప్పుడు మానేయమంటే అప్పుడు మానేయడమే ఆమె ముందున్న ఆప్షన్ అనే ధోరణికి కూడా కొదవలేదు. చివరికి ‘ఆమె ఉద్యోగం’ ఆమెది కాకుండా పోతోంది. చట్టం అందరికీ ఒక్కటే! కానీ... మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961లో వచ్చింది. అప్పుడు పన్నెండు వారాల వేతనంతో కూడిన సెలవు ఉండేది. తర్వాత 26 వారాలకు పొడిగించింది ప్రభుత్వం. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగినులకు మాత్రమే అమలవుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఎక్కువ కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రానివే ఉంటున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో యాభై మంది ఉద్యోగులున్న సంస్థ మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తుంది. దాంతో అనేక చిన్న చిన్న కంపెనీలు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. ఈ పరిస్థితి ఆ కంపెనీల్లో పని చేసే మహిళలకు పెద్ద సమస్యగా మారుతోంది. డెలివరీ తర్వాత, కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగంలో విరామం తీసుకున్న వాళ్లు ఆ తర్వాత కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది. – పార్వతి, న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
నేడు సమైక్య గర్జన
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమబాట పడుతున్నారు. బుధవారం కడప స్టేట్‌గెస్ట్‌హౌస్‌లో మహిళా ఉద్యోగులు సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు నడుంబిగించాలని నిర్ణయించారు. గురువారం ఉదయం 9.30గంటలకు కోటిరెడ్డి సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. అలాగే మానవహారాలు, అమరజీవి పొట్టిశ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద నివాళులు అర్పించాలని నిర్ణయించారు. భవిష్యత్తులో కూడా మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేందుకు వీలుగా జిల్లా మహిళా ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘానికి ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి అధ్యక్షురాలిగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి ఉపాధ్యక్షులుగా, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అసోసియేట్ అధ్యక్షులుగా, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ప్రతిభా భారతి కార్యదర్శిగా, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రమాదేవి సంయుక్త కార్యదర్శిగా, స్టెప్ సీఈఓ మమత ట్రెజరర్‌గా, మరో 13 మంది కార్యనిర్వాహక సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.