పెళ్లయిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారట!
పెళ్లయిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారట!
Published Mon, Dec 19 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM
ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవడం మహిళలకు చాలా కష్టం అనుకుంటాం కదూ. కానీ, పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారట. ఈ విషయం ఇటీవలే విడుదల చేసిన 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలిసింది. పెళ్లి కాని వాళ్లు కేవలం 21 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే.. పెళ్లయిన వాళ్లలో మాత్రం 41 శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారట. పెళ్లికాని వాళ్లు యువతులు కావడంతో వాళ్ల తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు పంపడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఇంకా స్కూళ్లు లేదా కాలేజీలలో చదువుకుంటున్నారు. అలాగే.. రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నవాళ్లు తమకు పిల్లలు తక్కువ మంది ఉంటేనే మేలని భావిస్తున్నారు, అందులోనూ కనీసం ఒక కొడుకు ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. ఇక ఉద్యోగం చేయని మహిళల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదట. వాళ్లు కేవలం తమ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవుతున్నారని, ఉద్యోగాలు చేయని మహిళల కంటే వీళ్లు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తేలింది.
దశాబ్దం క్రితం పిల్లలను కనగల వయసులో ఒక్కో మహిళకు సగటున 3.3 మంది పిల్లలు పుడుతుంటే, ఇప్పుడు అది 2.9కు పడిపోయింది. ఇది ఉద్యోగాలు చేసేవాళ్లకు సంబంధించినది. చేయని వాళ్లలో మాత్రం ఇది 3.1గానే ఉంది. లింగనిష్పత్తి మాత్రం రెండు వర్గాల్లోనూ బాగానే పడిపోయింది. 2001లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యిమంది బాలురకు 912 మంది బాలికలుండగా, ఇప్పుడది 901కి పడిపోయింది. ఉద్యోగాలు చేయనివారి విషయంలో అది 901 నుంచి 894కి తగ్గింది. మహిళలకు గర్భంలో ఉన్నది ఆడపిల్లలని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
Advertisement
Advertisement