census 2011
-
'ఆ' గ్రామాలు ఏమైనట్లు..!?
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో.. జిల్లా పునర్విభజనకు ముందున్న 24 గ్రామాలు ప్రస్తుతం జనాభా రికార్డుల్లో కనిపించడం లేదు. 2021 జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో 2011 సెన్సెస్‌ను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. జిల్లా జాబితాను పరిశీలించగా.. 8 మండలాల్లోని 24 గ్రామాల పేర్లు కనిపించకపోవడంతో కంగుతిన్నారు. దీనిపై జిల్లా అధికారులను నివేదిక కోరారు. జిల్లా ప్రణాళిక, గణాంక, రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డుల పరంగా గ్రామాలను మరోసారి నో టిఫై చేసి రాష్ట్ర సెన్సెన్ కార్యాలయానికి పంపిం చారు. జిల్లాల విభజన అనంతరం జనాభా రికార్డుల్లో కానరాకుండాపోయింది. 11 అక్టోబర్ 2016న జీవోనంబర్ 222 రెవెన్యూ ప్రకారం ఉమ్మడి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజన, మండలాలు, గ్రామాలు, జనాభా, సరిహద్దులు, తదితర వివరాలు రెవెన్యూ అధికారులు జిల్లాల వారిగా పొందపరిచారు. ఆ సమయంలో 2011 జనాభా లెక్కలో మంచిర్యాల జిల్లాలో ఉన్న 24 గ్రామాలు పేర్లు రికార్డుల్లో నమోదు కాకుండపోయాయి. దండేపల్లిలోని రోళ్లపహేడ్, చెన్నూర్ మండలం ఆదిలవార్పేట్, గుడ్డిరాంపూర్, కోనంపేట్, ఆముదాలపల్లి, కోటపల్లి మండలం ఆయపల్లి, చింతకుంట, ఆడకపల్లి, మందమర్రి మండలం లిమూర్, కాసిపేట మండలం దేవపూర్, నెన్నెల మండలంలోని పుప్పాలవనిపేట, సీతనగర్, కుంమ్మపల్లి, బధ్రపూర్, మంకపూర్,బోదపూర్, భగీరథ్పేట, సింగపూర్, తాండూర్ మండలంలో వెంకాయపల్లి, అనకపెల్లి, మదనపూర్, రాంపూర్, భీమిని మండలంలోని రాం పూర్, సాలిగాం గ్రామాలు పేర్లు గల్లంతయ్యా యి. విచిత్రమేమిటంటే.. ఇందులోని 20 గ్రామాల వరకు పేర్లు మాత్రమే ఉండగా.. అక్కడ జనంగానీ.. కనీసం ఇళ్లుగానీ లేవు. వ్యవసాయ భూములు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రామశివారుతో పేర్లు మాత్రం రెవెన్యూ రికార్డులో ఉంటున్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొ ంటున్నారు. ఏళ్ల క్రితం ఇక్కడ జనం ఉండే.. అంటున్నా.. ఇక్కడి జనం ఎక్కడికి వెళ్లారు..? మరి ఊరుపేరు మాత్రం ఎలా మిగిలింది..? 2011 జనాభా లెక్కలో ఆ గ్రామాల పేర్లు ఎలా వచ్చాయి..? అనేవి జవాబు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. ప్రస్తుతం జనాభా ఉన్న గ్రామాలు.. జిల్లా విభజన సమయంలో బెల్లంపలి రెవెన్యూ డివిజన్‌తోపాటు, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, దండేపల్లి, జన్నారం, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, వేమనపల్లి, భీమిని, మండలాలతోపాటు కొత్తగా హాజీపూర్, నస్పూర్, భీమారం, కన్నెపల్లి, మొత్తం 18 మండలాలు, 385 గ్రామాలతో జిల్లా ఆవిర్భవించింది. ఈ సమయంలో జిల్లా నుంచి 24 గ్రామాల పేర్లు గల్లంతు కాగా ఇందులో 20 గ్రామాలు కనుమరుగయ్యాయి. ఈ గ్రామాలలో నివసించే ప్రజలు సమీప గ్రామాలలో స్థిరనివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఇళ్లు, జనాభా లేకపోయినా రెవెన్యూ రికార్డులో గ్రామ శివార్లు కొనసాగుతున్నాయి. గతంలో అక్కడ ఆ గ్రామాలు ఉన్నట్లు ఇప్పటికీ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామాల్లోని గ్రామదేవతలు కనిపిస్తున్నాయి. మిగితా 4 గ్రామాలలో ప్రజలు ఇప్పటికే కొనసాగిస్తున్నారు. కాసిపేట మండలంలోని దేవపూర్‌లో అతిపెద్ద సిమెంట్ కర్మాగారం ఉంది. జిల్లావ్యాప్తంగా ఈ గ్రామం తెలియని వారు ఉండరు. సిమెంట్ కంపెనీపై ఆధారపడి కార్మికులు, ఇతరవర్గాలవారు, వ్యవసాయ కుటుంబాలు వేల సంఖ్యలో జీవిస్తున్నాయి. దీంతోపాటు గతంలో మందమర్రి మండలం ప్రస్తుతం ఇటీవల మున్సిపాలిటీగా ఆవిర్భవించిన క్యాతనపల్లి, కన్నెపల్లి మండలం సాలిగాం, భీమిని మండలంలోని రాంపూర్‌లో వేల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి. తమ గ్రామం పేరు లేకుండా పోవడమేంటని ఇక్కడి ప్రజలు అవాక్కవుతున్నారు. సవరించి పంపించాం.. జిల్లా సరిహద్దు, మండలాలలు, గ్రామాలు, జనాభా వివరాలు పంపించాం. ఆ సమయంలో కొన్ని గ్రామాల పేర్లు గల్లంతవడంతో పాటు తప్పుగా వచ్చాయి. గల్లంతయిన గ్రామాల పేర్లతో పాటు తప్పులను తిరిగి సవరించి రాష్ట్ర కార్యాలయానికి పంపించాం. సెన్సెస్ కార్యాలయం వారు కొత్త జాబితాలో నమోదు చేయనున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం గ్రామశివారుతో పేర్లు మాత్రమే ఉన్నాయి. -
దేశ భాషలందు చిక్కిపోతున్న తెలుగు...!
దేశంలోని అత్యధికులు సంభాషించే మాతృభాషల్లో తెలుగు మూడోస్థానం నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. తెలుగు స్థానాన్ని మరాఠి భర్తీచేసి మూడోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా గణనలో భాగంగా దేశంలోని మాతృభాషలకు సంబంధించి తాజాగా వెల్లడైన వివరాలను బట్టి ఈ అంశం వెల్లడైంది. మొత్తం జనాభాలో 96.71 శాతం మంది దేశంలో గుర్తించిన 22 భాషల్లో ఏదో ఒక భాషను తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మిగతా 3.29 శాతం మంది ఇతర భాషలను తమ భాషగా ఎంపికచేసుకున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 7.19 శాతం మంది (మొత్తం దేశజనాభాలో) తెలుగును తమ మాతృభాషగా ఎంచుకున్నారు. అదే 2011 లెక్కలకు వచ్చేప్పటికీ అది 6.93 శాతానికి తగ్గిపోయింది. అదేసమయంలో మరాఠి మాతృభాషగా ఎంపిక చేసుకున్న వారు 6.99 శాతం నుంచి 7.09 శాతానికి వృద్ధి చెందారు. ఈ విధంగా తెలుగును మరాఠి భాష అధిగమించింది. తెలుగు మాట్లాడేవారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హిందీ టాప్...సంస్కృతం లాస్ట్ దేశ జనాభాలో హిందీని మాతృభాషగా ఎంచుకుంటున్న వారు మాత్రం గణనీయంగా పెరిగారు. 2001 లెక్కల ప్రకారం 41.03 శాతమున్న వీరి సంఖ్య 2011 నాటికి 43.63 శాతానికి పెరిగింది. హిందీ తర్వాత అత్యధికులు మాట్లాడే భాషగా బాంగ్లా (బెంగాలీ) కొనసాగుతోంది. గతంలో 8.11 శాతమున్న బాంగ్లా మాట్లాడే వారి సంఖ్య తాజా లెక్కల్లో 8.3 శాతానికి పెరిగింది. దేశంలో గుర్తించిన (రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన) 22 భాషల్లో సంస్కృతం మాత్రం ఈ విషయంలో చిట్టచివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బోడో, మణిపురి, కోంకణి, డోగ్రీ భాషలు మాట్లాడే వారి కంటే కూడా ఈ భాషను తక్కువమంది మాట్లాడుతున్నారు. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. రెండున్నరలక్షల మందికి ఇంగ్లిష్... మన దేశంలో మాతృభాషగా గుర్తించని ఇంగ్లిష్‌ను (షెడ్యూల్డ్ లాంగ్వేజేస్‌లో చేర్చని) మాత్రం 2.6 లక్షల మంది తాము మొదట మాట్లాడే భాష(ఫస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్)గా పేర్కొనడం విశేషం. ఇంగ్లిష్ మాతృభాషగా ఉన్నవారు లక్ష మందికి పైగా మహారాష్ట్రలో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక నిలుస్తున్నాయి. మనదేశంలో గుర్తింపు పొందని భాషల్లో రాజస్థాన్‌లోని కోటి మందికి పైగా భిలి / భిలోడి భాష మాట్లాడుతున్నారు. గోండీ భాషను 29 లక్షల మంది సంభాషిస్తున్నట్టు 2011 జనాభా గణన సమాచారాన్ని బట్టి వెల్లడైంది. గతంలోని జనాభా లెక్కల ప్రకారం ఆరోస్థానంలో ఉన్న ఉర్థూ కాస్తా ప్రస్తుతం ఏడోస్థానానికి పడిపోయింది. మొత్తం 4.74 శాతం మాట్లాడేవారితో గుజరాతీ భాష ఆరోస్థానానికి చేరుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే... భాష మాతృభాష మాట్లాడేవారు మొత్తం జనాభాలో శాతం హిందీ 52,83,47,193 43.63 బాంగ్లా 09,72,37,669 08.30 మరాఠి 08,30,26,680 07.09 తెలుగు 08,11,27,740 06.93 తమిళం 06,90,26,881 05.89 -
వారిలో హిందువులే ఎక్కువ!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని హిందువుల్లో అధిక శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకోగా, ఎక్కువ శాతం ముస్లిం జనాభా వ్యవసాయేతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని 2011 జనాభా లెక్కల రిపోర్టు వెల్లడించింది. మతాల ప్రాతికపదికన హిందూ, ముస్లిం జనాభా ఉద్యోగ, వ్యవసాయ వివరాలను శుక్రవారం ప్రకటించింది. మొత్తం హిందువుల్లో 45.40 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా.. ఈ మొత్తంలో 28 శాతం మంది భూమిని సాగు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపింది. 60 శాతం ముస్లిం జనాభా పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. అయితే, అక్షరాస్యతలో వారు హిందువుల కన్నా వెనకబడి ఉండడంతో ఉన్నతోద్యోగాలు పొందలేక పోతున్నారని తెలిపింది. పారిశ్రామిక రంగంలో దిగువ స్థాయి ఉద్యోగాలైన చేనేత, కుండల తయారీ, వడ్రంగి పని, హస్తకళలు వంటి కళాత్మక పనుల్లో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నారని రిపోర్టు వెల్లడించింది. దేశంలో చాలా మంది ముస్లింలు భూములు లేని కారణంగానే పారిశ్రామిక రంగంలో ఉపాధి కోరుకుంటున్నారని విశ్లేషించింది. కాగా, దక్షిణ భారతంలో కంటే ఉత్తరం భారతంలో ముస్లిం జనాభా పెరిగిందని రిపోర్టు పేర్కొంది. సచార్ కమిటీ ప్రకారం.. 2005లో ఏర్పాటైన రాజేంద్ర సచార్ కమిటీ దేశంలో భూమి కల్గివున్న జనాభాలో హిందూ, ముస్లింలకు గణనీయమైన తేడా ఉందని నివేదించింది. గ్రామీణుల్లో 94 శాతం కుటుంబాలు సొంత భూమిని కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. వారిలో కూడా అగ్రవర్ణ హిందూ జనాభా చేతిలోనే అధిక భూమి ఉందని తెలిపింది. దాదాపు 87 శాతం జనాభా కనీసం ఒక ఎకరా భూమిని కలిగి ఉన్నారని తెలిపింది. కాగా, అన్ని మతస్తుల కంటే తక్కువగా (83 శాతం) ముస్లింలు భూమిని కలిగి ఉన్నారని వెల్లడించింది. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో సొంత ఇళ్లు కలిగి ఉన్న వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, 2001 నుంచి 2011 వరకు జనాభాలో 0.8 శాతం పెరుగుదల నమోదు కావడంతో ముస్లిం జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గుదల నమోదు చేసింది. 2001లో 82.75 కోట్లుగా ఉన్న హిందూ జనాభా 96.63 కోట్లకు చేరింది. -
రిజర్వేషన్లపై టెన్షన్
జిల్లాలో గ్రామ పంచాయతీలు 468 వార్డులు 4,750 మొత్తం ఓటర్లు 7,25,660 మహిళలు 3,61,914 పురుషులు 3,63,746 సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లౖòపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ గ్రామ పంచాయతీకి ఏ రిజర్వేషన్ కానుందోననే సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 721 గ్రామ పంచాయతీల్లో 719 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయావర్గాల నేతలు తాము పోటీ చేయదల్చుకున్న స్థానాలకు రిజర్వేషన్లు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారుల గుర్తింపు పూర్తి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పాల్గొనే అధికారుల గుర్తింపు ఇప్పటికే పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఆఫీసర్లు(పీఓ)లు 1439 మందిని గుర్తించారు. ఇందులో మహబూబ్‌నగర్ డివిజన్లో 691, నారాయణపేట్‌లో 148 మందిని ఎంపిక చేశారు. ఏపీఓలు 2,271 మందిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఆయా మండలాల్లో ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు కేత్రస్థాయి పరిశీలన చేశారు. జిల్లా వ్యాప్తంగా 6,366 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుర్తించారు. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన మేరకు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు జిల్లాలోని గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడెప్పుడా అని రాజకీయ పార్టీలు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ఆరంభమైన తరువాత ఒక్కసారిగా పల్లె వాతావరణం వేడెక్కనుంది. ఆగస్టు 2, 2013న కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. అంతలోపు ఎన్నికలను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 468 గ్రామ పంచాయతీలు, 4,750 వార్డులు ఉన్నాయి. మొత్తం 7,25,660మం ది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,61,914 మహిళ ఓటర్లు, 3,63,746 పురుష ఓటర్లు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లను అమలు చేయనుండగా, బీసీలకు ఓటర్ల సంఖ్యను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుచేస్తారు. దీంతోపాటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు ఉంటుంది. అన్ని కేటగిరీల్లోనూ 50శాతం పదవులు మహిళలకు కేటాయించనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34శాతం, జనాభా ఆధారంగా ఎస్సీలకు 20.46 శాతం సర్పంచ్ పదవులను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఎస్టీ జనాభా 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఓటర్ల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు బీసీలకే కేటాయించే రిజర్వేషన్లను వారి ఓటర్ల సంఖ్య ఆధారంగా కేటాయించనున్నారు. జిల్లాలో 4,61,542 బీసీ ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,30,319 పురుష, 2, 31,223మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 34శాతం మేరకు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీని ప్రకారం జిల్లాలో బీసీలకు 243 స్థానాలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళలకు 50శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. దీంతో తండాలను కలుపుకుని 148 స్థానాలు సర్పంచ్ స్థానాలు దక్కనున్నాయి. ఎస్సీలకు 20.46 శాతం రిజర్వేషన్లను ఎస్సీలకు కేటాయిస్తారు. మొత్తం 714 స్థానాల్లో ఎస్సీలకు 146 స్థానాలు దక్కనున్నాయి. జనరల్‌కు వివిధ వర్గాలకు 60శాతం మేరకు రిజర్వేషన్ల కేటాయించే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 6,366 వార్డులు జిల్లా వ్యాప్తంగా 721 గ్రామ పంచాయతీలు, 6366 వార్డులు ఉన్నాయి. ఇందులో 34 శాతం లెక్కన బీసీలకు 2,164 స్థానాలు రానున్నాయి. వాటిలో 1,082 మహిళలకు, 1,082 బీసీ జనరల్ స్థానాలకు కేటాయించే అవకాశాలున్నాయి. ఎస్సీలకు 20.46శాతం లెక్కన 1,302 స్థానాలు దక్కనున్నాయి. వాటిలో 651 మహిళలకు, మిగతావి ఎస్సీ జనరల్‌కు దక్కే అవకాశాలున్నాయి. అలాగే ఎస్టీలకు 5.73శాతం మేరకు 365 స్థానాలు దక్కనుండగా, వాటిలో 182 మహిళలకు, 183 ఎస్టీ జనరల్‌కు రిజర్వేషన్లు పోగా 2,535 స్థానాలు జనరల్‌కు దక్కనున్నాయి. వాటిలో జనరల్ మహిళలకు 1,267 స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. మార్గదర్శకాలు రావాల్సి ఉంది ప్రభుత్వం నుంచి తమకు పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు అందాల్సి ఉంది. గత ఎన్నికల్లో నిర్వహించిన మాదిరిగానే రిజర్వేషన్లు కేటాయించాలని సూచనప్రాయంగా తెలిపారు. అందులో అంతగా స్పష్టత లేదు. మరో 4, 5 రోజుల్లో పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. – వెంకటేశ్వర్లు, డీపీఓ -
పెళ్లయిన వాళ్లే ఉద్యోగాలు చేస్తున్నారట!
ఒకవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ఉద్యోగ బాధ్యతలు రెండూ చూసుకోవడం మహిళలకు చాలా కష్టం అనుకుంటాం కదూ. కానీ, పెళ్లి కాని అమ్మాయిల కంటే పెళ్లయిన వాళ్లే ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారట. ఈ విషయం ఇటీవలే విడుదల చేసిన 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలిసింది. పెళ్లి కాని వాళ్లు కేవలం 21 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తుంటే.. పెళ్లయిన వాళ్లలో మాత్రం 41 శాతం మంది ఉద్యోగాల్లో ఉన్నారట. పెళ్లికాని వాళ్లు యువతులు కావడంతో వాళ్ల తల్లిదండ్రులు ఉద్యోగాల కోసం బయటకు పంపడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు ఇంకా స్కూళ్లు లేదా కాలేజీలలో చదువుకుంటున్నారు. అలాగే.. రెగ్యులర్ ఉద్యోగాలు ఉన్నవాళ్లు తమకు పిల్లలు తక్కువ మంది ఉంటేనే మేలని భావిస్తున్నారు, అందులోనూ కనీసం ఒక కొడుకు ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. దీంతో లింగ నిష్పత్తి దారుణంగా పడిపోతోంది. ఇక ఉద్యోగం చేయని మహిళల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదట. వాళ్లు కేవలం తమ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవుతున్నారని, ఉద్యోగాలు చేయని మహిళల కంటే వీళ్లు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారని తేలింది. దశాబ్దం క్రితం పిల్లలను కనగల వయసులో ఒక్కో మహిళకు సగటున 3.3 మంది పిల్లలు పుడుతుంటే, ఇప్పుడు అది 2.9కు పడిపోయింది. ఇది ఉద్యోగాలు చేసేవాళ్లకు సంబంధించినది. చేయని వాళ్లలో మాత్రం ఇది 3.1గానే ఉంది. లింగనిష్పత్తి మాత్రం రెండు వర్గాల్లోనూ బాగానే పడిపోయింది. 2001లో ఉద్యోగాలు చేసే మహిళలకు పుట్టే ప్రతి వెయ్యిమంది బాలురకు 912 మంది బాలికలుండగా, ఇప్పుడది 901కి పడిపోయింది. ఉద్యోగాలు చేయనివారి విషయంలో అది 901 నుంచి 894కి తగ్గింది. మహిళలకు గర్భంలో ఉన్నది ఆడపిల్లలని తెలిస్తే అబార్షన్లు చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితులు కూడా ఒక ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.