కోతుల గుంపులో బాలిక
బహ్రయిచ్(యూపీ): కోతుల గుంపుతో కలిసి జీవిస్తున్న ఓ 8 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్‌లోని బహ్రయిచ్ జిల్లా కటార్నియా ఘాట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో గుర్తించారు. స్థానికుల ద్వారా బాలిక విషయం తెలుసుకున్న పోలీసులు కష్టపడి ఆమెను మర్కటాల మంద నుంచి గత జనవరిలో వేరు చేశారు. ఆమెకు ప్రస్తుతం బహ్రయిచ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాలిక తన భావాలను వ్యక్తపరచలేకపోతోంది. ఎవరైనా ఆమె దగ్గరకు వెళితే గట్టిగా కేకలు వేస్తోంది.
ఈ కారణాలతో ఆమెకు సరైన చికిత్స అందించలేకపోతున్నామని వైద్యులు అంటున్నారు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ, బాలిక గురించి తమ దగ్గర ఏ సమాచారం లేదనీ, ఆమె ప్రవర్తనను బట్టి చూస్తే చాలా కాలంపాటు అడవిలో కోతులతో జీవిస్తోందని అర్థమవుతోందని చెప్పారు. బాలికను తాము రక్షించినప్పుడు జుట్లు, గోళ్లు బాగా పెరిగి, ఆమె ఒంటినిండా గాయాలు ఉన్నాయని అధికారి పేర్కొన్నారు.