40 ఏళ్ల తర్వాత చేరిన పార్శిల్..!
మనం బుక్ చెయ్యకుండానే మనింటికి పార్శిల్ వచ్చి చేరితే మనకేమనిపిస్తుంది? అమ్మో.. ఇది ఏమయ్యుంటుంది అని అనుమానం వస్తుంది... ఇంకాస్త ముందుకెడితే అందులో ఏదైనా బాంబు లాంటిది ఉందేమోనన్న భయం కూడా వేస్తుంది. అదే అనుభవంలోకి వచ్చింది మెల్బోర్న్ టెన్నిస్ క్లబ్ సభ్యులకు. చినిగి..చీకిపోయిన అట్టపెట్టెలో వచ్చిన ఆ పార్శిల్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. 40 ఏళ్ల క్రితం.. 1975 ప్రాంతంలో అప్పటి మాజీ కమిటీ సభ్యురాలి అడ్రస్ ఆ పార్శిల్ పై రాసి ఉండటం చూసి నమ్మలేకపోయారు. అంతేకాదు అప్పటి ప్యాకింగ్కు చిహ్నంగా ఆ పార్శిల్ దారాలతో కుట్టి, ప్రభుత్వానికి సంబంధించిన ఓ మెయిల్ సర్వీస్ నుంచి వచ్చినట్లుగా కూడా ఉంది. అప్పట్లో ఆ పార్శిల్ ఆస్ట్రేలియా పోస్ట్లోని యంత్రాల మధ్య పడిపోయి ఉండొచ్చని, ఇటీవల కంపెనీ తరలించే సమయంలో సిబ్బందికి కనిపించడంతో ఆ పార్శిల్ను పంపి ఉంటారని క్లబ్ సభ్యులు భావిస్తున్నారు.
టెన్నిస్ క్లబ్ మాజీ కమిటీ సభ్యురాలు ఇరేన్ గారెట్ పేర వచ్చిన ఆ పార్శిల్ చూసి ఆమెకు నవ్వాగలేదట. పోనీలే.. ఇప్పటికైనా చేరిందంటూ నవ్వుకుందట. "నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నాకసలు అప్పట్లో జరిగిన విషయాలేవీ గుర్తులేవు. అయితే అది నా అడ్రస్ ఉంది కనుక బహుశా అప్పట్లో నా కోసం ఎవరో బుక్ చేసినదే అయి ఉండొచ్చు'' అని గారెట్ చెపుతోంది.
నిజానికి గారెట్ ఎక్కువ కాలం టెన్నిస్ క్లబ్ లో కొనసాగకపోయినా.. తన పేరిట బుక్ చేసిన పార్శిల్ చేరినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ పార్శిల్ తన పాత మిత్రులందరినీ కలిసేందుకు ఉపయోగపడిందని, పాత విషయాలను జ్ఞాపకం తెచ్చుకునేందుకు ఓ మంచి అవకాశాన్నిచ్చిందని గారెట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే ఇన్నాళ్ళ తర్వాత కనిపించిన పార్శిల్ నిరుపయోగమని డస్ట్ బిన్లో పడేయకుండా సరైన చిరునామాకు అందించడం చూస్తే... ఇంకా కొందరు నిజాయితీగా పనిచేస్తున్నారనేందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.