ఆయన.. ఇద్దరు భార్యల సమరం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ నియోజకవర్గంలో ఆసక్తికర పోరు సాగుతోంది. కాంగ్రెస్ తరఫున బరిలో దిగిన మాలతి బిశ్వాస్ తాను పీసీసీ మాజీ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్ భార్యనని చెబుతుండగా.. స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిందా బిశ్వాస్ కూడా తానే శ్యామ్ బిశ్వాస్కు నిజమైన భార్యనని చెబుతున్నారు.
బిందా (52), మాలతి (56) ఇద్దరూ సమర్పించిన అఫిడవిట్లలో తమ భర్త పేరును శ్యామ్ ప్రసాద్ బిశ్వాస్‌గా పేర్కొన్నారు. ఈ విషయంపై శ్యామ్ మాట్లాడుతూ.. మాలతి తనకు చట్టబద్ధమైన భార్యని, బిందా తనపై పుకార్లు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇంతకుమించి తాను మాట్లాడబోనని చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకు నిరాకరించిన మాలతి.. తాను శ్యామ్ భార్యనని పేర్కొన్నారు. ఇక బిందా మాట్లాడుతూ.. ఎన్నికల్లో మాలతిపై పోరాడుతున్నానని, ఇది న్యాయం కోసం, తన హోదా కోసం పోరాటమని చెప్పారు. 1976లో కోల్‌కతాలో శ్యామ్‌ను పెళ్లి చేసుకున్నానని, ఆ తర్వాత తనను బృందావనం తీసుకెళ్లాడని, అక్కడే తాము స్థిరపడ్డామని తెలిపారు.
ఆయన ఓ కేసులో ఇరుక్కుని ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్ వెళ్లారని, వ్యాపారంలో ఎదిగేందుకు తమ కుటుంబం సాయం చేసిందని చెప్పారు. ఆ తర్వాత శ్యామ్ మాలతిని వివాహం చేసుకుని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. బిందాకు ముగ్గురు కుమార్తెలు, మాలతికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సతుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో, ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి. బీడీ కంపెనీ యజమాని అయిన శ్యామ్ బెంగాలీ. సితార్‌గంజ్‌లో ఆయన వర్గానికి చెందినవారు 30 శాతం మంది ఓటర్లు ఉన్నారు. ఇదే చోట నుంచి బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ కొడుకు సౌరభ్ బహుగుణ పోటీ చేస్తున్నారు.