సీఎం అయ్యేది ఈయనేనా?
ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి మొదలుపెట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా ఉన్న ఈ వ్యక్తి పేరు.. త్రివేంద్ర సింగ్ రావత్. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాకు సన్నిహితుడైన ఈయన ఎంపికయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాఖండ్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ.. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోడానికి శుక్రవారం సమావేశమవుతోంది. కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అధికారాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు కట్టబెట్టారు. శుక్రవారం సాయంత్రంలోగా ఎంపిక ప్రక్రియ పూర్తయితే శనివారం నాడు రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా హాజరవుతున్నారు.
పొరుగు రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లాగే, ఉత్తరాఖండ్‌లో కూడా బీజేపీ బ్రహ్మాండమైన మెజారిటీ సాధించింది. మొత్తం 70 స్థానాలున్న అసెంబ్లీలో 57 స్థానాలు బీజేపీకే దక్కాయి. ఇంత మెజారిటీ వచ్చినా ఈ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఎవరన్నది ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. మరోవైపు అసలు మెజారిటీయే దక్కని గోవా, మణిపూర్‌లలో మాత్రం ప్రమాణస్వీకారాలు కూడా అయిపోయాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని శనివారం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవికి సత్పాల్ మహరాజ్ లాంటి పేర్లు వినిపించినా, చివరకు త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. 2014లో ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. రావత్‌కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉండటమే కాక, అమిత్ షా ఆశీస్సులు సైతం మెండుగా ఉన్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అమిత్ షా యూపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పనిచేశారు.