రావత్‌ మెడకు ఎన్నికల కమిషన్‌ ఉచ్చు! | Uttarakhand Chief Minister Rawat in Troubles | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 29 2017 1:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

Uttarakhand Chief Minister Rawat in Troubles - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు సన్నిహిత మిత్రుడు, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌కు భారత ఎన్నికల కమిషన్‌ నుంచి ముప్పు ముంచుకొచ్చే అవకాశం ఉంది. ఆయన ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో స్థిరాస్తుల విలువను అతి తక్కువ చేసి చూపించారనే ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్‌ స్పందించడమే అందుకు కారణం. 

ఎన్నికల అఫిడవిట్‌లో తన స్థిరాస్తుల విలువను తక్కువ చేపి చూపినట్లు రావత్‌పై డెహ్రాడూన్‌కు చెందిన ఎస్‌హెచ్‌ రఘునాథ్‌ సింగ్‌ నేగి ఫిర్యాదు అందిందని, ఇందులోని వాస్తవాస్తవాలను తెలుసుకునేందుకు అధికారులను పంపించి క్షేత్రస్థాయిలో ఆయన స్థిరాస్తుల విలువను అంచనా వేసి ఓ నివేదికను పంపించండంటూ ‘కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు’ చైర్మన్‌కు ఎన్నికల కమిషన్‌ లేఖ రాసింది. అక్టోబర్‌ 20వ తేదీనే తనకు ఫిర్యాదు అందినప్పటికీ గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ప్రత్యక్ష పన్నుల బోర్డుకు ఎన్నికల కమిషన్‌ లేఖ రాసినట్లు తెల్సింది. రావత్‌ తన వయస్సును కూడా ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని మాజీ బీజేపీ సభ్యుడైన రఘునాథ్‌ సింగ్‌ నేగి ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల అఫిడవిట్‌లో అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 1951 నాటి ఎన్నికల ప్రాతినిథ్య చట్టంలోని 125 (ఏ) సెక్షన్‌ కింద జరిమానా విధిస్తారు. 2002 వరకు ఆరెస్సెస్‌లో ప్రచారక్‌గా పనిచేసిన రావత్, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాకు అత్యంత సన్నిహితుడని, ఆ కారణంగానే సరైన అర్హతలు లేకుండానే ఆయన్ని ఉత్తరాఖండ్‌ సీఎంను చేశారని పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. 2014లో పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ఇంచార్జిగా అమిత్‌ షా ఉన్నప్పుడు ఆయనకు సహకరించిన నలుగురు నాయకుల్లో రావత్‌ ఒకరు. 

2010లోనే రావత్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆయన ఉత్తరాఖండ్‌ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా రైతులకు పంపిణీ చేసే జీలుగు విత్తణాల్లో అవినీతికి పాల్పడ్డరంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి రావత్‌ పేరు మొదటిసారి బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఆయన అవినీతి ఆరోపణల గురించి గట్టిగా నిలదీసింది. రావత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పాటైన దర్యాప్తు కమిటీ ఆయనపై రాష్ట్ర అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో క్లీన్‌చిట్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement