రాష్ట్రపతి కుమార్తెకు వేధింపులు: కేసులో మరో మలుపు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి కుమార్తె, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షర్మిష్ఠ ముఖర్జీ తాను ఎదుర్కొన్న ఆన్ లైన్ వేధింపులపై మరోసారి స్పందించారు. ఈ కేసులో నిందితుడైన పార్థ మండల్ తండ్రి.. ఫేస్ బుక్ ద్వారా తనకు క్షమాపణలు చెప్పారని, మానసిక వ్యాధిగ్రస్తుడైనందున తన కొడుకును మన్నించాల్సిందిగా అభ్యర్థించారని షర్మిష్ఠ మంగళవారం వెల్లడించారు. అన్నిటికంటే ముందు అతణ్ని(పార్థాను) పోలీసులకు లొంగిపోవాల్సిందిగా సూచించానని ఆమె తెలిపారు. (చదవండి:రాష్ట్రపతి కుమార్తెకు ఆన్‌లైన్ వేధింపులు)
'నన్ను వేధింపులకు గురిచేసిన పార్థా మండల్ తండ్రిగారు నాకొక సందేశం పంపారు. 'నా కుమారుడి మానసిక పరిస్థితి బాగోలేనందున అతనికి చికిత్స చేయిస్తున్నాం. మా వాడి తరఫున నేను క్షమాపణలు చెబుతున్నా. దయచేసి మన్నించండి' అని ఆ తండ్రి నాకు మెసేజ్ చేశారు. అందుకు నేను.. 'వెంటనే మీ కుమారుణ్ని పోలీసులకు అప్పగించి, వైద్యపరీక్షలు చేయించండి. అప్పుడు నిజానిజాలు అవే తెలుస్తాయి' అని సమాధానం ఇచ్చినట్లు షర్మిష్ఠ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన పార్థా మండల్.. గత శుక్ర, శనివారాల్లో షర్మిష్ఠకు అసభ్య మెసేజ్ లు పంపిన విషయాన్ని స్వయంగా ఆమె వెలుగులోకి తెచ్చారు. తాము ఎదుర్కొటున్న అకృత్యాలను మహిళలు నిర్భయంగా ఎదుర్కోవాలని, అందుకే తాను ఫిర్యాదు చేశానని, ఇలాంటి కేసుల్లో 'నేమింగ్ అండ్ షేమింగ్' (వేధింపులకు పాల్పడ్డవారి పేరు వెల్లడించడం, చేసిన పనికి సిగ్గుపడేలా చేయడం) అవసరమని షర్మిష్ఠ అన్నారు.